Betting App Case: ముఖ్యంగా వరుస సినిమాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఎంతో మంది సెలబ్రిటీలు ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ కేసులో ఇరుక్కున్నారు. ముఖ్యంగా బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తూ ఎంతోమంది యువత జీవితాలతో ఆడుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తమ అభిమాన నటీనటులు ఏదైనా ప్రమోట్ చేస్తున్నారు అంటే.. కచ్చితంగా అందులో నిజం ఉంటుందని, ఖచ్చితత్వం ఉంటుందని నమ్మిన ఎంతోమంది అందులో పెట్టుబడులు పెట్టి, కోట్ల రూపాయలు నష్టపోయిన వారు కూడా ఉన్నారు. ఆఖరికి అప్పులు చేసి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు.. తిరిగి అప్పులు తీర్చలేక ప్రాణాలు కూడా కోల్పోయారు.
ఈడీ విచారణకు హాజరైన ప్రకాష్ రాజ్..
ఇదిలా ఉండగా.. ఇలా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ.. సినీ ఇండస్ట్రీలో పేరు మోసిన ఏకంగా 29 మంది సెలబ్రిటీలను గుర్తించిన అధికారులు.. వారికి విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక్కొక్కరిని ఈడీ విచారిస్తోంది. అందులో భాగంగానే ఈరోజు విలక్షణ నటుడిగా పేరు సొంతం చేసుకున్న ప్రకాష్ రాజ్ (Prakash Raj) ఈడీ విచారణకు హాజరయ్యారు. అసలు విషయంలోకి వెళ్తే.. ఈ బెట్టింగ్ యాప్ కేసులో భాగంగా రాణా, ప్రకాష్ రాజ్ , మంచు లక్ష్మి లకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఈడీ ముందు హాజరయ్యారు.
బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ లో ఇరుక్కున్న ప్రకాష్ రాజ్..
తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఇప్పుడు ఈడీ దర్యాప్తు చేపడుతోంది. బెట్టింగ్ యాప్లకు సంబంధించి మనీలాండరింగ్ , హవాలా లావాదేవీల ఆరోపణలపై ఈడి ఫోకస్ చేయగా.. మొత్తం 36 బెట్టింగ్ యాప్స్ కి సంబంధించిన ప్రమోషన్స్ పై సెలబ్రిటీలపై కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఒక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ లో ప్రకాష్ రాజ్ నటించడంతో ఆయనపై కూడా కేసు నమోదయింది. గత 10 రోజుల క్రితమే నోటీసులు ఇవ్వడంతో.. ఈరోజు ఈడీ ముందు హాజరయ్యారు ప్రకాష్ రాజు.
విచారణకు హాజరయ్యే ముందు ఆ వివరాలు తప్పనిసరి..
ఇకపోతే ఈడీ విచారణకు హాజరయ్యే ముందు.. బెట్టింగ్ యాప్లతో జరిగిన అగ్రిమెంట్లు, బ్యాంకు ఖాతాల వివరాలు కూడా తీసుకురావాలి అని టాలీవుడ్ సెలబ్రిటీలను ఈడి అధికారులు ఆదేశించారు.. ఈయనతో పాటు మిగతా 28 మంది నటీనటులతో పాటు కంటెంట్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లు యెన్సర్ లపై కూడా విచారణ జరుగుతోంది. ముఖ్యంగా పంజాగుట్ట, మియాపూర్, విశాఖపట్నం, సైబరాబాద్ లో పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ల ఆధారంగానే ఈడీ విచారణ జరుపుతోంది.
ప్రకాష్ రాజ్ తోపాటు రానా, మంచు లక్ష్మీ లకు నోటీసులు..
ఇకపోతే ఈనెల 23న విచారణకు రావాలని దగ్గుబాటి రానాకి కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 30వ తేదీన హాజరుకావాలని ప్రకాష్ రాజ్ కు, ఆగస్టు 13న విచారణకు రావాలి అని మంచు లక్ష్మికి నోటీసులు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈడీ ముందు హాజరైన ప్రకాష్ రాజ్ కి ఈడి అధికారులు ఎలాంటి ప్రశ్నలు గుప్పిస్తున్నారు అనే విషయం తెలియాల్సి ఉంది.