Film industry:సాధారణంగా ఒకప్పుడు సినిమా 2 గంటలు లేదా రెండున్నర గంటలకు మించి ఉంటే మాత్రం థియేటర్లో ప్రేక్షకుడు అంతసేపు కూర్చుంటాడా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యేవి. ముఖ్యంగా రెండు గంటల పాటు ప్రేక్షకుడిని థియేటర్లో సీట్లో కూర్చోబెట్టాలి అంటే అత్యంత సాహసంతో కూడిన పని. అలాంటిది ఇప్పుడు 3 గంటల రన్ టైం దాటినా సరే ప్రేక్షకుడు ఆ సినిమాను ఆదరిస్తున్నాడు అంటే ఇక కంటెంట్ కి ప్రాధాన్యత ఏ రేంజ్ లో ఇస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కంటెంట్ ఉంటే చాలు నిడివి అనేది కేవలం సంఖ్య మాత్రమే అని కొన్ని చిత్రాలు నిరూపిస్తూ.. బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను సాధిస్తున్నాయి.
ఇక ఈ మధ్యకాలంలో కంటెంట్ తోనే ప్రేక్షకుడిని సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టి ఎంతసేపైనా సరే సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నారు దర్శకులు. అలాంటి వారిలో ప్రథమంగా వినిపించే పేరు సుకుమార్. రంగస్థలం, పుష్ప సినిమాలతో అప్పటివరకు ఉన్న సెంటిమెంటును బ్రేక్ చేశారు. సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం సినిమా 2 గంటల 54 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా నిడివి చూసి అప్పట్లో చాలా అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. రెండున్నర గంటల సేపు ప్రేక్షకుడిని థియేటర్లో కూర్చోబెట్టాలి అంటేనే కష్టంతో కూడుకున్న పని.. అలాంటిది దాదాపు మూడు గంటల పాటు సుకుమార్ ప్రేక్షకుడిని కూర్చోబెడతారా అనే అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ ఈ సినిమా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఆ మ్యాజిక్ మళ్లీ పుష్ప 1 రిపీట్ చేసిందని చెప్పాలి. రంగస్థలం కంటే 5 నిమిషాల ఎక్కువ నిడివితో అంటే 2 గంటల 59 నిమిషాల నిడివితో వచ్చిన ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన మరో చిత్రం పుష్ప 2.. ఈ సినిమా ఏకంగా 3గంటల 21 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చి పాత రికార్డులను కూడా బ్రేక్ చేసింది.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సెన్సేషన్ డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్న సందీప్ రెడ్డివంగా.. అర్జున్ రెడ్డి సినిమాతో ఊహించని విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈయన చేసిన మొదటి సినిమా ఏకంగా 3 గంటల 2నిమిషాల నిడివి.. ఈ సినిమాకి థియేటర్లలో ప్రేక్షకులు పిచ్చెక్కిపోయారు. యువతకు బాగా కనెక్ట్ అయిన ఈ సినిమా అంత పెద్ద నిడివి ఉన్నా సరే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది. మళ్లీ ఈయన డైరెక్షన్లో వచ్చిన చిత్రం యానిమల్. ఈ సినిమా ఏకంగా 3 గంటల 21 నిమిషాల రన్ టైం తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది . ఇది కూడా ఊహించిన విజయాన్ని సొంతం చేసుకొని పాత సెంటిమెంటును బ్రేక్ చేసి.. కంటెంట్ ఉంటే చాలు నిడివి ఎక్కువైనా సరే సినిమా సక్సెస్ అవుతుందనే సెంటిమెంటును క్రియేట్ చేసింది.
ALSO READ:మాతృత్వంపై కియారా అద్వానీ సంచలన కామెంట్స్.. ఆడ పులినయ్యానంటూ!
ఇకపోతే ఉరి అనే చిత్రంతో బాలీవుడ్ లో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఆదిత్య ధర్ ధురంధర్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించారు. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన మొదటి భాగం 1350 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేస్తే.. ఇక రెండవ భాగం అంతకుమించి అనే చెప్పాలి. తక్కువ సమయంలోనే వేల కోట్ల కలెక్షన్లు వసూలు చేసి సంచలనం సృష్టిస్తోంది. అలా మొదటి భాగం 3 గంటల 34 నిమిషాల నిడివితో రాగా.. రెండవ భాగం 3 గంటల 49 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతేకాదు ఈ మధ్యకాలంలో ఇప్పటివరకు వచ్చిన ఇండియన్ చిత్రాలలో అత్యధిక నిడివి ఉన్న సినిమా మాత్రమే కాదు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సినిమాగా కూడా ఈ సినిమా రికార్డులు సృష్టించింది ..ఏది ఏమైనా సరే సినిమా అంటే 2 లేదా రెండున్నర గంటలే ఉండాలి. అది దాటితే బోర్ కొడుతుంది అనే అభిప్రాయాన్ని తలకిందులు చేసిన ఈ చిత్రాలు కంటెంట్ ఉంటే చాలు రన్ టైం ఇష్యూ కాదు అంటూ నిరూపించాయి. దీంతో లెంగ్తీ సినిమాలు కూడా సక్సెస్ఫుల్ ఫార్ములా అవ్వచ్చు అనే కామెంట్లు సినీ వర్గాల నుంచి వ్యక్తం అవుతున్నా యి.