YS Jagan: వైసీపీ నరసాపురం పార్లమెంట్ సెగ్మెంట్‌లోని ఐదు అసెంబ్లీనియోజకవర్గాల్లో తిరిగి ఎందుకు పుంజుకోలేక పోతుంది..? ఆ నియోజకవర్గాలలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు పార్టీ బలోపేతం పట్ల ఎందుకు దృష్టి సారించలేకపోతున్నారు..? పార్టీ అధికారంలో ఉండగా చక్రం తిప్పిన మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఎందుకు సైలెంట్ అయ్యారు? ఇదే పరిస్థితి భవిష్యత్తులో కొనసాగితే 2029 ఎన్నికల్లో కూడా వైసిపి పార్టీ పశ్చిమగోదావరి జిల్లాలో అడ్రస్ లేకుండా పోతుందా..?
2019 ఎన్నికల్లో ఆనాటి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు గాను 5 నియోజకవర్గాలను వైసిపి కైవసం చేసుకుంది. 2024 ఎన్నికలకు వచ్చేసరికి నర్సాపురం పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలలో వైసీపీ పూర్తిగా తుడుచుకుపెట్టుకుపోయింది. అయితే గత ఎన్నికల ఘోర పరాజయాన్ని దృష్టిలో పెట్టుకుని తిరిగి పార్టీని బలోపేతం చేసేందుకు వైసీపీ అధినేత జగన్ నానా తిప్పలు పడుతున్నారు. కాని అధికారం ఉన్నప్పుడు చక్రం తిప్పిన నేతలంతా నేడు పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితి కొత్తగా ఏర్పడిన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్ పరిధిలోని నరసాపురం, పాలకొల్లు, ఆచంట, భీమవరం, ఉండి నియోజకవర్గాలలో నెలకొంది
ఏడు నియోజకవర్గాలపై ఫోకస్:
నర్సాపురం పార్లమెంటులో మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో పాలకొల్లు, ఉండి నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గెలుపొందగా, మిగిలిన ఐదు నియోజకవర్గాలలో వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. వీరిలో నరసాపురం నుంచి ముదునూరి ప్రసాద రాజు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ గా కూడా కూడా పనిచేసారు. ఆయన వైసీపీ హయంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో రాజకీయంగా చక్రం తిప్పారు. ఆనాటి ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్న ప్రసాదరాజు గత ఎన్నికల్లో ఘోర పరాజయం చవి చూసారు. దీనికి కారణం 2019 ఎన్నికల్లో ఆయన గెలుపుకు సహకరించిన కాపు సామాజిక వర్గాన్ని ప్రసాదరాజు పూర్తిగా విస్మరించడంతో కాపు సామాజిక వర్గం గత ఎన్నికల్లో ప్రసాదరాజు కు దూరం జరిగింది.
ఈ నేపథ్యంలో ప్రసాదరాజు ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేగా నర్సాపురం నియోజకవర్గంలో తిరిగి పార్టీని బలోపేతం చేయలేకపోతున్నారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు సొంత పార్టీ క్యాడర్ ను కూడా పట్టించుకోకపోవడంతో నేడు పార్టీ క్యాడర్ ప్రసాద రాజును పట్టించుకోవడం లేదు. పైగా పార్టీని వీడి జనసేన పార్టీలో చేరుతున్నారు. నరసాపురంలో కూటమి తరుపున జనసేన ఎమ్మెల్యేగా గెలిచిన బొమ్మిడి నాయకర్ తన స్పీడ్ ని పెంచారు. వైసీపీ నాయకులను, కార్యకర్తలను వరుసబెట్టి మరీ జనసేనలో చేర్చుకుంటున్నారు. అయితే ప్రస్తుతం పార్టీలో ఉన్న కొద్దో, గొప్పో క్యాడర్ ను కూడా పార్టీ మారకుండా అడ్డుకోలేకపోతున్నారు ప్రసాద రాజు. ఇదే పరిస్థితి కొనసాగితే 2029 ఎన్నికల నాటికి నియోజకవర్గంలో వైసీపీకి డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి లేదు.
ఆచంట నియోజవర్గం:
ఇక ఆచంట నియోజవర్గ విషయానికి వస్తే 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చెరుకువాడ శ్రీరంగనాథరాజు మంత్రి కూడా అయ్యారు. ఐదేళ్ల పరిపాలనలో రాజు లానే నియోజకవర్గంలో పాలన చేశారు. ప్రజల మాట దేవుడెరుగు, సొంత పార్టీ కార్యకర్తలు నాయకులు సైతం ఆయనను కలవాలంటే భయపడే పరిస్థితులు ఉండేవి. ఎప్పుడు ఎవరిని ఏమంటారో తెలియని పరిస్థితి పార్టీ శ్రేణుల్లో ఉండడం, మంత్రిగా ఉన్నప్పుడు పార్టీ నాయకులను, కార్యకర్తలను పట్టించుకోవడంతో గత ఎన్నికలలో శ్రీరంగ నా రాజు ఓడిపోయారు. ఆయన ఓటమి తర్వాత ఆచంట నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ఏ మాత్రం కృషి చేయడం లేదని కూడా పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
కూటమి జోరు:
మరో ప్రక్క కూటమి తరుపున సీనియర్ ఎమ్మెల్యే ,మాజీ మంత్రి పీతాని సత్యనారాయణ దూసుకుపోతుంటే శ్రీరంగనాథరాజు పూర్తిగా వెనకబడిపోయారని, మంత్రిగా ఉన్నప్పుడు హోదాను అనుభవించిన ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీని రక్షించే విధంగా ఎందుకు పనిచేయడం లేదనే విషయాన్ని కార్యకర్తలు ప్రశ్నించే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఆచంట నియోజకవర్గంలో కూటమి జోరు కొనసాగుతుండగా నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్న శ్రీ రంగనాథ రాజు పార్టీని పట్టించుకోవడంలేదనే విమర్శలు ఉన్నాయి. కేవలం ఎన్నికల సమయంలో డబ్బులు ఖర్చు పెట్టడం, రోజుల తరబడి భోజనాలు పెట్టడం లాంటి కారణాలతో ప్రజలు ఓట్లు వేయరనే విషయాన్ని శ్రీ రంగనాథ రాజు ఇప్పటికైనా గుర్తించకపోతే ఆచంట నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి గత ఎన్నికల కంటే దారుణంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
భీమవరం నియోజవర్గం:
2019 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా భీమవరం నియోజవర్గం రాజకీయ సంచలనం రేపింది. కోట్లాదిమంది అభిమానుల హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గ్రంధి శ్రీనివాస్ పై ఓటమి చెందారు. అయితే పవర్ స్టార్ ను ఓడించిన గ్రంధి శ్రీనివాస్ కు ఎటువంటి రాజకీయ ఉన్నత స్థానాన్ని ఆనాటి ముఖ్యమంత్రి జగన్ కల్పించలేకపోయారు. అయినా సరే గ్రంధి శ్రీనివాస్ ఫైర్ బ్రాండ్ లా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. అయితే గత ఎన్నికల్లో కూటమి జోరులో జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయుల పై గ్రంధి శ్రీనివాస్ ఓటమి చెందారు.అదే సమయంలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేయాల్సిన గ్రంధి శ్రీనివాస్ రాజకీయంగా ముదునూరి ప్రసాద రాజు వైఖరికి విసిగి పార్టీకి రాజీనామా చేసేశారు.
అనంతరం కొంతకాలానికి కాపు సామాజిక వర్గానికే చెందిన మాజీ జడ్పిటిసి సభ్యుడు చిన్నమిల్లి వెంకట్రాయుడును భీమవరం వైసీపీ ఇన్చార్జిగా జగన్ నియమించారు. అయితే ఆయన పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లలేక పోతున్నారు. అంతేకాకుండా పార్టీకి సంబంధించిన పదవుల నియామకం విషయంలో కూడా సీనియర్ల మాటకు వెంకట్రాయుడు ప్రాధాన్యత ఇవ్వకపోవడం, భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు చేస్తున్న అవినీతిని ప్రశ్నించకపోవడం లాంటి కారణాలతో పార్టీ క్యాడర్ వెంకట్రాయుడిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం భీమవరం నియోజకవర్గంలో వైసిపి భవిష్యత్తు ప్రశ్నార్దకంగానే ఉంటుందని చెప్పవచ్చు.
పాలకొల్లు:
ఇక పాలకొల్లు నియోజకవర్గానికి వస్తే సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే, ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ని ఢీకొట్టే అభ్యర్థిని జగన్ ఇన్చార్జిగా నియమించలేకపోతున్నారనేది వాస్తవం. 2024 ఎన్నికలకు ముందు ప్రస్తుతం ఎమ్మెల్సీగా పనిచేస్తున్న కౌరు శ్రీనివాస్ ఈ నియోజకవర్గానికి కొంతకాలం ఇన్చార్జిగా ఉన్నారు. ఆ సమయంలో ఎమ్మెల్యేగా ఉన్న రామానాయుడు కి ధీటుగానే పనిచేసి పార్టీ క్యాడర్లో నూతన ఉత్సాహాన్ని నింపారు. ఎప్పటికప్పుడు రామానాయుడు కామెంట్లకు కౌంటర్లు ఇస్తూ పార్టీకి బలంగా మారారు కౌరు శ్రీనివాస్. అయితే కౌరు శ్రీనివాస్ ను అనూహ్యంగా నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు నుండి తప్పించి జగన్ రాజకీయంగా తప్పటడుగులు వేసి ఎటువంటి సొంత బలం లేని గుడాల గోపిని తీసుకొచ్చి పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జిగా చేశారు.
అప్పటివరకు బలం పుంజుకున్న వైసీపీ దీంతో ఒక్కసారిగా నియోజకవర్గంలో గుడాల గోపి కారణంగా బలహీనమైంది. 2024 ఎన్నికల్లో గోపికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మరోసారి జగన్ తప్పు చేశారు. ఆ ఎన్నికల్లో గోపి ఘోర పరాజయాన్ని చవి చూసారు. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న గోపి మంత్రి రామానాయుడు కు ఏ స్థాయిలో కూడా దీటుగా పనిచేయలేకపోతున్నారు. ఈ నియోజకవర్గంలో వైసిపి పార్టీ ఉందో లేదో తెలియని పరిస్థితి నేడు నెలకొంది. ఇప్పటికైనా జగన్ నియోజకవర్గ ఇన్చార్జి విషయంలో ఖచ్చితమైన నిర్ణయం తీసుకోకపోతే మాత్రం ఈ నియోజకవర్గంలో వైసిపి పార్టీ కనుమరుగు కాక తప్పదని చెప్పవచ్చు.
ఉండి:
టీడీపీ కంచుకోట అయిన ఉండి నియోజవర్గ పరిస్థితి వైసీపీ పార్టీకి మరింత తలనొప్పిగా మారింది. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న పీవీఎల్ నరసింహారాజు పార్టీకి రాజీనామా చేస్తారని ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. ఆయన ఇప్పటికే రెండు సార్లు వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి పరాజయం చెందారు. అయినప్పటికీ పార్టీని అంటిపెట్టుకుని ఉండి టీడీపీ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామ కృష్ణంరాజు నుండి పార్టీ క్యాడర్ కు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు. కానీ ఇటీవల కాలంలో ఆయనకు తెలియకుండానే నియోజకవర్గంలో తన గెలుపుకు సహకరించని వారికి రాష్ట్ర స్థాయిలో పదవులు ఇవ్వడం పై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది.
Also Read: బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్.. రంగంలోకి కేసీఆర్ ?
ఇక రాజీనామా చేయడమే తరువాయి అన్నట్లుగా పివిఎల్ నరసింహారాజు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. మరో ప్రక్క త్రిబుల్ ఆర్ ఎఫెక్ట్ నియోజకవర్గంలో వైసీపీకి గట్టిగానే తగులుతుంది. అయినప్పటికీ నరసింహారాజు పార్టీని ఇప్పటి వరకు బ్రతికిస్తూ వస్తున్నారు. కాని జగన్ నుండి మాత్రం నరసింహరాజుకు అంత ప్రాధాన్యత కనిపించడం లేదు. నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయి పదవులు ఇస్తున్న సమయంలో కనీసం నరసింహరాజుకు సమాచారం కూడా లేదని తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం కష్టమని నర సింహారాజు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. నరసింహారాజు పార్టీకి రాజీనామా చేస్తే ఆ స్థాయి నాయకుడు ఈ నియోజకవర్గంలో వైసీపీకి దొరకరని చెప్పవచ్చు. అయితే జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాలలో పార్టీ పరంగా నెలకొన్న రాజకీయ పరిస్థితులపై జగన్ దృష్టి సారించకపోతే వైసీపీ మనుగడ పశ్చిమగోదావరి జిల్లాలో కనుమరుగు కాక తప్పదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Story By Apparao, Bigtv