Comedian Satya: కమెడియన్ సత్య గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టార్ కమెడియన్స్ లో ఒకడిగా సత్య ముందుకు దూసుకెళ్తున్నాడు. మొదటి నుంచి సత్య కామెడీ ప్రేక్షకులను మెప్పించిన వెన్నెల కిషోర్ లాంటివారు ఉండడంతో అంతగా క్రెడిట్ ఇవ్వలేకపోయారు. కానీ, ఎప్పుడైతే మత్తు వదలరా సినిమా వచ్చిందో.. సత్య టాప్ కమెడియన్ గా మారిపోయాడు. మత్తు వదలరా శ్రీసింహా కంటే సత్యనే హీరోగా కనిపించాడని ప్రేక్షకులు బల్లగుద్ది చెప్పుకొచ్చారు.
ఇక మత్తు వదలరా సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో డైరెక్టర్ రితేష్ రానా మత్తు వదలరా 2 ను తెరకెక్కించాడు. గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఏసుదాసు పాత్రలో సత్య కామెడీ నెక్స్ట్ లెవెల్.ఈ సినిమా తరువాత సత్యకు సపరేట్ ఫ్యాన్ బేస్ మాత్రమే కాదు స్టార్ హోదా కూడా దక్కింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సత్యకు హీరోగా మరో ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే సత్య హీరోగా వివాహా భోజనంబు అనే సినిమా తెరకెక్కింది. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా 2021 లో రిలీజ్ అయ్యి అంత ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. హీరోగా మారి చేతులు కాల్చుకోవడం కన్నా.. కమెడియన్ గానే నాలుగు రాళ్లు వెనక్కి వేసుకుంటే బెటర్ అనుకున్న సత్య ఆ తరువాత హీరో రోల్స్ జోలికి పోలేదు.
ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మత్తు వదలరా డైరెక్టర్ రితేష్ రానా.. సత్యను హీరోగా పెట్టి ఒక సినిమా తీయడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. సేమ్ మత్తు వదలరా లానే ఈ కథ కూడా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. సత్యకు కూడా కథ నచ్చడంతో త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని టాక్. రితేష్ రానాకు మత్తు వదలరా తప్ప ఇంకే సినిమాలు అంతగా విజయాన్ని అందించలేదు. మత్తు వదలరా తరువాత వెన్నెల కిషోర్, లావణ్య త్రిపాఠి కీలక పాత్రల్లో హ్యాపి బర్త్ డే అని ఒక సినిమా తెరకెక్కించాడు. ఇది అసలు భారీ డిజాస్టర్ గా మారింది.
ఇప్పుడు మరోసారి రితేష్ రానా.. సత్యతో కొత్త ప్రయోగం చేస్తున్నాడు. ఇది వర్క్ అవుట్ అవ్వకపోతే మత్తు వదలరా 3 తో ప్రేక్షకుల ముందుకు వస్తాడు. మరి ఈ సినిమాతో సత్య హీరోగా నిలబడతాడా.. ? లేదా.. ? అనేది చూడాలి.