Fish Venkat Funeral: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ఒక పేరు సొంతం చేసుకున్నారు ఫిష్ వెంకట్ (Fish Venkat). ‘ఆది’ సినిమాతో ప్రజాదారణ పొందిన ఈయన.. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమాలలో కమెడియన్ గా.. విలన్ గ్రూప్లో ఒకరిగా నటించి మంచి పేరు అందుకున్నారు. ముఖ్యంగా ‘గబ్బర్ సింగ్’ సినిమాలో తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. తన సినీ కెరియర్లో దాదాపు 100కు పైగా చిత్రాలలో నటించిన ఫిష్ వెంకట్ ఆర్థికంగా మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం.
అనారోగ్య సమస్యతో మృతి చెందిన ఫిష్ వెంకట్..
గత కొంతకాలంగా కిడ్నీలు రెండూ చెడిపోవడంతో డయాలసిస్ కూడా చేయించుకున్నారు. అంతకుముందే బీపీ, షుగర్ ఎక్కువ కావడంతో ఒక కాలుకు సర్జరీ కూడా చేశారు. అయినా సరే కిడ్నీ సమస్య ముదరడంతో ఇన్ని రోజులు వెంటిలేటర్ కిందే చికిత్స పొందిన ఫిష్ వెంకట్.. నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు. ఈయన మరణంతో సినీ ఇండస్ట్రీ మూగబోయింది. పలువురు స్టార్ హీరోలు సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇక అభిమానులైతే ఈయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పవచ్చు.
మారేడ్ పల్లిలో ఫిష్ వెంకట్ అంత్యక్రియలు..
ఈరోజు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ప్రస్తుతం సికింద్రాబాద్ లోని అడ్డగుట్టలోని ఆయన నివాసం వద్ద ఫిష్ వెంకట్ పార్థివ దేహం ఉంచారు. మారేడ్ పల్లిలోని హిందూ స్మశానవాటికలో
ఈ రోజు మధ్యాహ్నం హిందూ సంప్రదాయ పద్దతిలో అంత్యక్రియలు జరపనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ విషయాలు వైరల్ గా మారుతున్నాయి.
మృత్యువును జయించలేకపోయిన ఫిష్ వెంకట్..
గత నెల రోజులుగా మృత్యువుతో పోరాడారు ఫిష్ వెంకట్. ఎలాగైనా సరే ఆరోగ్యంతో తిరిగి వస్తారు అని అటు కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా అనుకున్నారు. కానీ ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఎంతగానో మృతువుతో పోరాడిన ఫిష్ వెంకట్.. చివరికి ఆ మృత్యువు ఒడిలోకే చేరిపోయారు.
ప్రభాస్ పేరిట భారీ మోసం..
ఇకపోతే ఫిష్ వెంకట్ కి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే బ్రతికే అవకాశం ఉందని, వైద్యం ఖర్చు రూ.50 లక్షల అవుతుందని కూడా వైద్యులు తెలియజేశారు. దీంతో అంత డబ్బు తమ వద్ద లేదని.. సినీ పెద్దలు ఎవరైనా వచ్చి ఆదుకోవాలి అని ఫిష్ వెంకట్ భార్యతో పాటు కూతురు కూడా వేడుకున్నారు. దీనికి తోడు ప్రభాస్ (Prabhas ) పేరిట ఒక వ్యక్తి కాల్ చేసి.. చికిత్సకి అన్ని ఏర్పాట్లు చేసుకోమని, త్వరలోనే డబ్బు పంపిస్తామని ఫోన్ చేశారట. దీంతో ఈ విషయాన్ని మీడియాతో కూడా చెప్పింది ఫిష్ వెంకట్ కూతురు. కానీ మళ్ళీ అదే నెంబర్ కి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని, ప్రభాస్ పేరిట ఎవరో కావాలని మోసం చేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
ALSO READ:Fish Venkat Demise: ఫిష్ వెంకట్ అసలు పేరేంటి.. ఆయన సినీ రంగ ప్రవేశం ఎలా జరిగిందంటే?