Fish Venkat Demise: ప్రముఖ సినీ నటుడిగా తనకంటూ ఒక పేరు సొంతం చేసుకున్న ఫిష్ వెంకట్ (Fish Venkat) గత కొన్ని రోజులుగా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. దాదాపు నెల రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఐసీయూలో వెంటిలేటర్ సహాయంతోనే చికిత్స తీసుకున్నారు. 2 కిడ్నీలు పూర్తిగా పాడవడంతో వైద్యులు డయాలసిస్ చేశారు
కానీ పెద్దగా ఫలితం లభించలేదు.
కుటుంబ సభ్యులను కూడా గుర్తుపట్టని వైనం..
అటు స్పృహలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల్ని కూడా గుర్తుపట్టలేకపోయారు. బీపీ, షుగర్ కారణంగా ఇన్ఫెక్షన్ అవడంతో కొన్నేళ్ళ క్రితమే ఆయన కాలికి కూడా ఆపరేషన్ జరిగింది. కిడ్నీ రీప్లాంటేషన్ చేయిస్తే బ్రతికే అవకాశం ఉందని వైద్యులు చెప్పడంతో.. రూ. 50 లక్షలు ఖర్చు అవుతుందని తెలిసి.. కుటుంబ సభ్యులు ఇండస్ట్రీ పెద్దలను ఆర్థిక సహాయం కోసం కోరుకున్నారు.అయితే ఇందులో కొంతమంది ఆర్థిక సహాయం కూడా చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే మృత్యువుతో పోరాడుతూ.. శుక్రవారం రాత్రి కన్నుమూశారు. ఆయన మరణం అభిమానులను కూడా పూర్తిస్థాయిలో దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. సినీ పరిశ్రమ కూడా ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతోంది.
ఫిష్ వెంకట్ అసలు పేరేంటి? ఆ పేరు ఎలా వచ్చిందంటే?
ఇదిలా ఉండగా ఫిష్ వెంకట్ కి సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. అందులో ఒకటి ఆయన అసలు పేరు.. సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది? అనే విషయాలు వైరల్ అవుతున్నాయి. ఫిష్ వెంకట్ అసలు పేరు మంగళంపల్లి వెంకటేష్. ముషీరాబాద్ మార్కెట్లో చేపల వ్యాపారంతో ఫిష్ వెంకట్ గా పేరు సొంతం చేసుకున్నారు. ఈయన హైదరాబాదులో పుట్టి పెరిగారు. కేవలం మూడవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు.
ఫిష్ వెంకట్ సినీ ప్రయాణం ఎలా మొదలైందంటే?
వెంకట్ ను సినీ పరిశ్రమకు పరిచయం చేసింది ఫిష్ వెంకట్ మిత్రుడైన ప్రముఖ స్టార్ హీరో శ్రీహరి (Sri Hari). ప్రముఖ డైరెక్టర్ వి.వి.వినాయక్ (VV Vinayak) కి శ్రీహరి ఫిష్ వెంకట్ ను పరిచయం చేయగా.. అలా తెలుగు చిత్రసీమకు పరిచయమయ్యారు. ఇతడు ఎక్కువగా తెలంగాణ యాస మాట్లాడే హాస్య , విలన్ పాత్రలు పోషించారు. ‘ఆది’ సినిమా ద్వారా ప్రజాధారణ పొందిన వెంకట్ సుమారుగా 90 కి పైగా సినిమాలలో నటించారు.
ఫిష్ వెంకట్ సినిమాలు..
2002లో ఆది సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఫిష్ వెంకట్ ఆ తర్వాత భగీరథ, బన్నీ, సామాన్యుడు, కింగ్, శౌర్య, రెడీ, కాళిదాసు, హీరో, శంఖం, గణేష్, డాన్ శీను, సీతారాముల కళ్యాణం లంకలో, అదుర్స్, మిరపకాయ్, వీర, కందిరీగ ఇలా చాలా సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించారు. ఇక చివరిగా ‘కాఫీ విత్ ఏ కిల్లర్’ అనే సినిమాలో కూడా నటించారు. ఇకపోతే ఈ సినిమా ఆహా ఓటీటీ వేదికగా జనవరి 31న నేరుగా ఓటీటీ లోనే విడుదల చేయడం జరిగింది. ఆర్పి పట్నాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి ,రఘుబాబు, రవిబాబు, సత్యం రాజేష్, టెంపర్ వంశీ ప్రధాన పాత్రలు పోషించారు. సెవెన్ హిల్స్ బ్యానర్ పై సతీష్ నిర్మించారు.
also read:Anasuya: కుటుంబ సభ్యుల మోసం.. నాన్న అర్థం చేసుకోలేకపోయారు.. అనసూయ ఎమోషనల్!