Rohit Sharma ODI Ranking: భారత్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన వన్డే సిరీస్ లో టీమిండియా 1-2 తో ఓటమిని చవిచూసింది. సిడ్నీ వేదికగా శనివారం రోజు జరిగిన చివరి వన్డేలో భారత ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో {121*} చెలరేగాడు. 237 పరుగుల లక్ష్య చేదనలో ఆస్ట్రేలియా బౌలర్లకు హిట్ మ్యాన్ చుక్కలు చూపించాడు. ఈ నేపథ్యంలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ గా నిలిచిన రోహిత్ శర్మ పలు ప్రపంచ రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అలాగే ఈ సిరీస్ లో అదరగొట్టిన హిట్ మ్యాన్.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో నంబర్ 1 స్థానం దక్కించుకోనున్నాడు.
ఐసీసీ ర్యాంకింగ్స్ లో హిట్ మ్యాన్ నెంబర్ 1:
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కి ముందు రోహిత్ శర్మ 745 పాయింట్లతో మూడవ స్థానంలో ఉన్నాడు. ఐతే ఈ సిరీస్ లో 202 పరుగులు చేయడంతో నంబర్ 1 కి వెళ్ళినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 29వ తేదీన ఐసీసీ అధికారికంగా ర్యాంక్ లను ప్రకటించబోతోంది. ఇందులో రోహిత్ శర్మ మొదటి స్థానంలో నిలవబోతున్నాడు. ఏకంగా 38 ఏళ్లలో రోహిత్ కి నెంబర్ వన్ ర్యాంక్ రాబోతుండడంతో హిట్ మ్యాన్ అభిమానుల ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి. ఆస్ట్రేలియాతో జరిగిన మూడవ వన్డేలో మరో సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీతో కలిసి భారత జట్టును వైట్ వాష్ నుంచి గట్టెక్కించాడు.
రోహిత్ శర్మ రికార్డులు:
వన్డే క్రికెట్లో 100 క్యాచ్ లను పూర్తి చేసి హిస్టరీ క్రియేట్ చేశాడు. అలాగే SENA {South Africa, England, New Zealand, Australia} దేశాలలో వన్డేల్లో అత్యధిక సిక్సులు బాదిన విదేశీ ప్లేయర్ గా రోహిత్ శర్మ {95} నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ {92} పేరిట ఉండేది. అంతేకాకుండా 21 వ శతాబ్దంలో ఆస్ట్రేలియాపై వన్డే సెంచరీ చేసిన అతి పెద్ద వయస్కుడిగా రోహిత్ శర్మ నిలిచాడు. 38 ఏళ్ల 178 రోజుల వయస్సులో రోహిత్ ఈ ఫీట్ సాధించాడు. ఇది మాత్రమే కాకుండా వన్డే చరిత్రలో లేట్ వయసులో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్న ఇండియన్ ప్లేయర్ గా హిట్ మ్యాన్ నిలిచాడు.
అలాగే ఆస్ట్రేలియాలో అత్యధిక వన్డే సెంచరీలు చేసిన విదేశీ బ్యాటర్ గా రోహిత్ శర్మ రికార్డ్ సృష్టించాడు. ఇలా ఆస్ట్రేలియాతో సిడ్ని వేదికగా జరిగిన మూడవ వన్డేలో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు రోహిత్ శర్మ. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ వన్డే సిరీస్ లో జట్టు ఓడిపోయినప్పటికీ.. ఈ ఇన్నింగ్స్ ద్వారా రోహిత్ శర్మ తనలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందని నిరూపించడమే కాకుండా.. విమర్శకులకు గట్టి జవాబు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఇక రోహిత్ శర్మని గంభీర్ కాదు కదా ఎవరు ఆపలేరని ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.