Film Chamber:తెలుగు ఫిలిం ఛాంబర్ లో ఎన్నికలు జరగాల్సిన వేళ ఇప్పుడు మరో ట్విస్ట్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గత 30 సంవత్సరాలుగా తెలుగు సినీ పరిశ్రమకు చిరునామాగా నిలిచిన జూబ్లీహిల్స్ లోని ఫిలిం ఛాంబర్ ఇప్పుడు కూల్చివేతకు గురవుతోందనే వార్త అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక్కడే నిర్మాతల మండలి, నిర్మాతల కోసం నిర్మించిన గదులు , రిక్రియేషన్ క్లబ్ ఇలా ఎన్నో ఉన్నాయి. ఈ ప్రాంతంలో గజం స్థలం కొనాలన్నా కూడా దొరకని పరిస్థితి.. అలాంటిది ఎకరానికి పైగా విస్తీర్ణంలో ఉన్న ఫిలిం ఛాంబర్ భవనాలపై కొంతమంది కన్ను పడింది. ఇక్కడ నిర్మాణాలన్నింటినీ కూల్చివేసి బహుళ అంతస్తుల భవనం కట్టాలి అని సంకల్పించుకున్నారట.
అయితే తెలుగు సినీ పరిశ్రమకు వారసత్వంగా వస్తున్న ఈ ఫిలిం ఛాంబర్ భవనాలను కూల్చవద్దు అని చాలామంది సభ్యులు కోరుకుంటున్నా.. వీరి విన్నపాలు వినకుండా ఫిలింనగర్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఫిలిం ఛాంబర్ పాలక మండలిలో తమకు అనుకూలంగా ఉన్న కొంతమందితో కలిసి ఏకపక్షంగా భవనాలను కూల్చివేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి భూముల ధరలు పెరగడమే ఇప్పుడు ఈ భవనాల కూల్చివేతకు ప్రధాన కారణం అనే వార్త స్పష్టంగా వినిపిస్తోంది. ఎందుకంటే ఛాంబర్ పాలకమండలి గడవు ముగిసినా.. ఎన్నికలు జరపకుండా ఎప్పటికప్పుడు వాయిదా వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.
ప్రత్యూష ప్రెసిడెంట్ దీని వెనుక ఉన్నాడనే వార్తలు కూడా వ్యక్తం అవుతున్నాయి. నిజానికి అధ్యక్ష పదవికి ఏడాది కాలం ముగిసినా.. ఆగస్టులోనే జరగాల్సిన ఎన్నికలు ఇప్పటివరకు జరగలేదు. పైగా ఎన్నికల మాట ఎత్తితే మాకు సీఎంతో పలుకుబడి ఉంది. ఇంకో ఏడాది కొనసాగిస్తాము అంటూ భీష్మించుకు కూర్చున్నారట. నిజానికి కొత్త పాలక మండలి వస్తే బహుళ అంతస్తుల భవనం ప్రతిపాదనకు ఎక్కడ అడ్డుపడతారో అన్న భయంతోనే ఇలా అధ్యక్ష పదవిని కొనసాగించాలని చూస్తున్నారు అంటూ ఫిలిం ఛాంబర్ సభ్యులు ఆరోపిస్తున్నారు.
నిజానికి ఈ ఫిలిం చాంబర్ కోసం గత మూడు సంవత్సరాల క్రితమే చెన్నై నుండి సినీ పరిశ్రమ హైదరాబాద్ కి తరలి వస్తున్న సమయంలో సినీ పరిశ్రమలో పనిచేసే వారికి అప్పటి ప్రభుత్వాలు ఇళ్ల స్థలాలను కేటాయించాయి. అంతేకాదు అవసరాల కోసం ఫిలింనగర్ సహకార హౌసింగ్ సొసైటీ కూడా ఏర్పడింది. ఇక నిర్మాతలు, దర్శకులు, ఎగ్జిబిటర్ల, వాణిజ్య అవసరాల కోసం గదులు కూడా అవసరమయ్యాయి. దాంతో రమేష్ ప్రసాద్, జి.హనుమంతరావు, వీ.డీ.రాజేంద్రప్రసాద్, రామానాయుడు , డివిఎస్ రాజు, ఎమ్మెస్ రెడ్డి, సత్య చిత్ర సూర్యనారాయణ ఇలా ఎంతోమంది సినీ ప్రముఖులు ఉమ్మడిగా చేసిన విజ్ఞప్తి మేరకు హౌసింగ్ సొసైటీ.. రిక్రియేషన్ భవనాన్ని నిర్మించడానికి జూబ్లీహిల్స్ భూమిలో కొంత ఛాంబర్ కు లీజుకు ఇచ్చారు. ఇందులోనే చాంబర్ కొన్ని భవనాలను నిర్మించింది. ముఖ్యంగా రామానాయుడు 10 లక్షలు, అల్లు రామలింగయ్య 5 లక్షలు, సినీ నటుడు ప్రభాకర్ రెడ్డి సినీ కార్మికుల కోసం కూడా కొన్ని ఎకరాల భూమిని కూడా కేటాయించారు. ఇలా చాలామంది ప్రముఖులు తమ వంతు సహాయం అందించారు. అప్పట్లోనే 1.16కోట్ల రూపాయల వరకు ఈ బిల్డింగ్ నిర్మాణానికి ఖర్చయిందని సమాచారం.
ఇకపోతే ఈ భూమిని 30 సంవత్సరాలకు లీజుకి ఇచ్చారట లీజ్ పూర్తయిన తర్వాత ఇరుపక్షాలు సామరస్యంగా లీజ్ ను పొడిగించాలని కూడా నిర్ణయించుకోవాలని.. ఆ ఒప్పందంలో ఉంది వచ్చే ఏడాది తో ముగిస్తుంది. నిర్మాతల మండలికి నిర్మాతలకు ఇచ్చిన లీజులు మాత్రం 2030 వరకు ఉంటాయి. ప్రస్తుతం ఇక్కడ భూముల ధరలు ఆకాశాన్ని అందుతున్న నేపథ్యంలోనే ఈ హౌసింగ్ సొసైటీ మొత్తం భూమిని స్వాధీనం చేసుకొని బహుళ అంతస్తుల భవనాన్ని కట్టాలనే ప్రతిపాదనను తీసుకొచ్చింది. అయితే ఇక్కడ స్థలంలో ఛాంబర్ నిర్మాతల మండలి కార్యాలయాలు ఉండడంతో వారి అంగీకారం కోసం ఏడాదిగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. దీనిపై సభ్యులలో భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. చాలామంది ఈ భవనాన్ని కూల్చివేయడానికి ఒప్పుకోవడం లేదు. అటు పాలకవర్గంలో కొంతమంది హౌసింగ్ సొసైటీ తో చేతులు కలిపి కూల్చివేతకు అనుకూలంగా పావులు కదిపారనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.. ఏది ఏమైనా సినీ పరిశ్రమకు కేంద్ర బిందువుగా ఉన్న ఈ 30 ఏళ్ల ఫిలిం ఛాంబర్ ను కూల్చివేయడం ఎంతవరకు కరెక్ట్ అని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై సినీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
ALSO READ:Actress Death: 90 ఏళ్ల సినీ అనుభవం..ప్రముఖ నటి కన్నుమూత!