Jacqueline Fernandez: బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు గత కొంతకాలంగా సినిమాల కంటే ఎక్కువగా వివాదాల్లోనే వినిపిస్తోంది. సుకేశ్ చంద్రశేఖర్‌తో ముడిపడి ఉన్న రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఆమె చిక్కుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఈ కేసులో ఒక ఊహించని మలుపు చోటు చేసుకుంది. తానూ ఈ కేసులో సాక్షిగా మారి, నిజానిజాలు బయటపెడతానని, అప్రూవర్‌గా మారేందుకు సిద్ధమని జాక్వెలిన్ కోర్టుకు తెలపడం సంచలనంగా మారింది.
చాలా కాలంగా కోర్టు మెట్లు ఎక్కుతున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఈ కేసు నుంచి బయటపడటానికి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా ఆమె తరఫు న్యాయవాదులు ఒక ముఖ్యమైన ప్రతిపాదనను ఉంచారు. ఈ కేసులో తాను నిందితురాలిగా కాకుండా, ‘అప్రూవర్’గా మారతానని ఆమె కోర్టుకు విన్నవించారు. అంటే, ఈ కుంభకోణానికి సంబంధించి తనకు తెలిసిన అన్ని విషయాలను, సుకేశ్ చేసిన లావాదేవీల వివరాలను ఆమె విచారణ సంస్థలకు సాక్షిగా వివరిస్తారన్నమాట.
జాక్వెలిన్ చేసిన ఈ అభ్యర్థనపై ఢిల్లీ కోర్టు సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది. అయితే, దీనికి ఒక పద్ధతి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. మీరు అప్రూవర్‌గా మారాలనుకుంటే, దానికి సంబంధించిన పూర్తి వివరాలతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులకు ఒక ఫార్మల్ రిక్వెస్ట్ పంపాలని కోర్టు సూచించింది. ఒకవేళ ఈడీ ఆమె విన్నపాన్ని అంగీకరిస్తే, ఈ కేసు విచారణ వేగం పుంజుకోవడమే కాకుండా, జాక్వెలిన్‌కు కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది.
also read:పవన్ పై అనుచిత వ్యాఖ్యలు.. పోలీసుల అదుపులో స్టాండప్ కమెడియన్ రఫిక్ ..
ఈ కేసు అంతా సుకేశ్ చంద్రశేఖర్ చుట్టూ తిరుగుతోంది. గతంలో తాను జాక్వెలిన్‌తో ప్రేమలో ఉన్నానని, ఆమెకు కోట్ల విలువైన కానుకలు ఇచ్చానని సుకేశ్ స్వయంగా వెల్లడించారు. ఈ క్రమంలోనే మనీలాండరింగ్ సొమ్ముతో కొన్న ఖరీదైన గిఫ్టులను ఆమె అందుకున్నారని ఈడీ ఆరోపించింది. దీనివల్లే ఆమె విదేశాలకు వెళ్లాలన్నా కోర్టు అనుమతి తీసుకోవాల్సి వస్తోంది. ఇప్పుడు ఆమె అప్రూవర్‌గా మారాలని నిర్ణయించుకోవడం వెనుక, తను నిర్దోషినని నిరూపించుకోవాలనే బలమైన కోరిక కనిపిస్తోంది.
ఒకసారి జాక్వెలిన్ అప్రూవర్‌గా మారితే, సుకేశ్ చంద్రశేఖర్‌కు మరిన్ని కష్టాలు తప్పవని న్యాయ నిపుణులు అంటున్నారు. ఇక ఆమె ఇచ్చే సాక్ష్యం ఈ కేసులో చాలా కీలకం కానుంది. అయితే, ఈ ప్రక్రియ అంత సులభం కాదు ఈడీ అధికారులు ఆమె ఇచ్చే సమాచారం ఎంతవరకు నిజమో నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. బాలీవుడ్ మొత్తం ఈ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తోంది. తన కెరీర్‌ను మళ్ళీ గాడిలో పెట్టుకోవాలంటే ఈ కేసు నుంచి బయటపడటం జాక్వెలిన్‌కు అత్యంత అవసరం.