Keerthy Suresh: సౌత్ సినీ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కీర్తి సురేష్(Keerthy Suresh) ఇటీవల సౌత్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలను అందుకుంటు కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు. ఇకపోతే తాజాగా కీర్తి సురేష్ జగపతిబాబు(Jagapathi Babu) హోస్ట్ గా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా తన కెరీర్ కి సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. అలాగే తన ప్రేమ వివాహం గురించి కూడా ఈ సందర్భంగా ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.
కీర్తి సురేష్, ఆంటోనీ తట్టిల్(Antony Thattil) వివాహం 2024 డిసెంబర్ 12 వ తేదీ హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయ ఆచారాల ప్రకారం గోవాలో ఎంతో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇలా పెళ్లి తర్వాత కూడా కీర్తి సురేష్ సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూ బిజీగా ఉన్నారు.అయితే వీరిద్దరూ దాదాపు 15 సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్నారని తెలుస్తుంది. ఇలా 15 సంవత్సరాల ప్రేమ తరువాత పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఇలా ఈ జంట ఇంత ఆలస్యంగా పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఏంటి అంటూ జగపతిబాబు ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా కీర్తి సమాధానం చెబుతూ తాను 2010 సంవత్సరంలోనే ఆంటోనీతో ప్రేమలో పడ్డానని తెలిపారు. అయితే ముందుగా స్టడీస్ కంప్లీట్ చేయాలని సుమారు ఆరు సంవత్సరాలు పాటు మేము పూర్తిగా దూరంగా ఉన్నామని తెలిపారు.
ఆంటోనీ ఖతర్ లో ఉండి ఆయిల్ పరిశ్రమకు సంబంధించిన వ్యాపారాలను చూసుకుంటూ ఉండేవారు. ఆ తర్వాత నేను కూడా సినిమాలలో బిజీగా ఉన్నాను. అయితే గత నాలుగు సంవత్సరాల క్రితమే మా ప్రేమ విషయాన్ని మా నాన్నకు చెప్పానని అయితే అప్పుడు కూడా నాన్న ఎలా రిసీవ్ చేసుకుంటారనే భయం చాలా ఉండేదని తెలిపారు. ముఖ్యంగా మా పెళ్ళికి మా మతాలు సమస్యగా మారుతాయని భావించాను. ఈ ప్రేమ విషయాన్ని నాన్నగారితో చెప్పడానికి వెనకడుగు వేశానని కీర్తి సురేష్ తెలిపారు.
విజయ్ దేవరకొండ సినిమాలో కీర్తి సురేష్..
ఇక చివరికి ధైర్యం తెచ్చుకొని నాన్న దగ్గర ఆంటోని విషయం గురించి చెప్పడంతో ఆయన చాలా కూల్ గా రియాక్ట్ అవుతూ పెళ్లికి ఒప్పుకున్నారని తాను అనుకున్న విధంగా ఏమి జరగలేదు అంటూ తన ప్రేమ విషయాన్ని తెలియజేయడమే కాకుండా, పెళ్లి లేటుగా చేసుకోవడానికి గల కారణాలను కూడా తెలిపారు. ఇలా పెద్దల అంగీకారంతో గత ఏడాది పెళ్లి చేసుకున్న ఈ జంట తమా వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక కీర్తి సురేష్ భర్త ఆంటోనీ మాత్రం సోషల్ మీడియాకి కూడా చాలా దూరంగా ఉంటారు. పెళ్లి తర్వాత కీర్తి పలు సినిమాలకు కమిట్ అవుతూ బిజీ అవుతున్నారు. ఇటీవల ఈమె రవి కిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న రౌడీ జనార్దన్ (Rowdy Janardhan)అనే సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలను ఘనంగా జరుపుకుంది.