ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ది ఒక విజయవంతమైన, స్ఫూర్తిదాకయమైన పొలిటికల్ జర్నీ. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఆయన పోరాటం చేశారు. కొన్నిసార్లు ఒంటరిగా పోరు జరిపారు, మరికొన్నిసార్లు కూటమిగా పొలిటికల్ ఫైట్ చేశారు. చివరకు సక్సెస్ అయ్యారు, ఏకంగా ఏపీకి డిప్యూటీసీఎం గా మారారు. జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి, 100 శాతం స్ట్రైట్ రేట్ సాధించిందంటే పవన్ కల్యాణ్ పొలిటికల్ వ్యూహం ఎంత బాగా వర్కవుట్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఎన్ని స్థానాల్లో పోటీ చేశామన్నది కాదు, పార్టీని ఎంత బాగా విజయ తీరాలకు చేర్చాం, ప్రభుత్వంలో మనం ఏ స్థానంలో ఉన్నాం.. అనేది బేరీజు వేసుకోవాలనేది పవన్ సిద్ధాంతం. ఆ వ్యూహాన్నే ఆయన ఇప్పుడు తమిళనాడులో పొలిటికల్ జర్నీ మొదలు పెట్టిన హీరో విజయ్ కి చెప్పారని వినికిడి. తమిళగ వెట్రి కళగం(TVK) అనే పార్టీ పెట్టిన విజయ్ వచ్చే ఏడాది జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఏ గ్రూప్ లో చేరకుండా ఒంటరిగానే TVK బరిలో దిగుతుందని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే ఆ నిర్ణయాన్ని మార్చుకోవాలంటూ పవన్, విజయ్ కి హితబోధ చేసినట్టు వార్తలు వినపడుతున్నాయి. ఈ విషయాన్ని ఇరు వర్గాలు ఖండించదేలు, అలాగని సమర్థించనూ లేదు. ఇంతకీ విజయ్ ని పవన్ కలిశారా, లేక ఫోన్ లో చెప్పారా, లేక పవన్ తన సందేశాన్ని ఎవరితోనైనా పంపించారా అనేది తేలాల్సి ఉంది.
విజయ్ సాహసం..
తమిళనాడులో ప్రస్తుతం డీఎంకే అధికారంలో ఉంది. సీఎం స్టాలిన్ బలంగా కనపడుతున్నారు. ప్రస్తుతానికి డీఎంకే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమిలో ఉంది. అటు బీజేపీ, అన్నాడీఎంకేని తోడు తీసుకెళ్తోంది. ఈ రెండిటి మధ్య TVK నిలదొక్కుకుంటుందా అనేది అనుమానమే. సింగిల్ గా పోటీ చేసి విజయ్ ఏం సాధిస్తారు, ఎన్ని సీట్లలో గెలుస్తారు.. అనేది తేలాల్సి ఉంది.
అప్పట్లో ప్రజారాజ్యం..
ఏపీలో కాంగ్రెస్, టీడీపీ బలంగా ఉన్నప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఒక సంచలనం సృష్టించారు మెగాస్టార్ చిరంజీవి. చెప్పుకోదగ్గ సీట్లు వచ్చినా కూడా ప్రజారాజ్యం సక్సెస్ కాలేకపోయింది. దానికి కారణం ఏపీలో మూడో ప్రత్యామ్నాయానికి చోటు లేకపోవడమే. ఆ తర్వాత కాంగ్రెస్ ఉనికి కోల్పోవడంతో వైసీపీ ఆ స్థానాన్ని భర్తీ చేసింది. ప్రజారాజ్యం తర్వాత జనసేనతో వచ్చిన పవన్ కల్యాణ్ ఒంటరిగా పోటీ చేసి విజయం సాధించలేకపోయారు. మిత్రలాభం సూత్రం తెలుసుకుని కూటమిగా బరిలో దిగి ఏకంగా కుంభ స్థలాన్నే బద్దలు కొట్టారు. డిప్యూటీ సీఎం అయ్యారు. కలసి ఉంటే కలదు సుఖం, విడిపోతే తప్పదు ఖేదం అనే సూత్రాన్ని పవన్ బలంగా నమ్ముతున్నారు. అదే ఫార్ములాని ఆయన విజయ్ తో చెప్పినట్టు సమాచారం.
Also Read: బాలకృష్ణకు మినిస్టర్ పోస్ట్..? అసలేంటి కథ?
Also Read: సీఆర్డీఏ భవన ప్రారంభోత్సవంలో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
బీజేపీ దూత..?
పవన్ కల్యాణ్, విజయ్ ఇద్దరికీ ఫ్యాన్ బేస్ బాగా ఉంది. ఇద్దరూ ఒకే రకమైన సినిమాల్ని చేశారు. ఒకరు ఇంకొకరి సినిమాల్ని రీమేక్ చేశారు. తమిళనాడులో TVK సింగిల్ గా పోటీ చేస్తే విజయ్ కష్టాలు పడటం సంగతి అటుంచి, అధికారం కోసం ఎదురు చూస్తున్న బీజేపీకి నష్టం జరుగుతుందనే మాట వాస్తవం. అందుకే బీజేపీ తరపున పవన్ ని దూతగా పంపించారనే ప్రచారం కూడా జరుగుతోంది. అన్నాడీఎంకే-బీజేపీ కూటమితో చేతులు కలిపి పోటీ చేస్తే బాగుంటుందని, ఒకవేళ ఎన్నికల్లో గెలిస్తే పదవి దక్కుతుందని, ఓడితే ప్రతిపక్ష నేతగానైనా ఉండొచ్చని కూడా సలహా ఇచ్చారట పవన్. మరి విజయ్ మనసులో ఏముంది? ఆయన నిర్ణయం ఏంటి అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది. అయితే పవన్, విజయ్ మధ్య జరిగిందని చెబుతున్న ఈ సలహా ఈ ఎపిసోడ్ ని మాత్రం ప్రస్తుతానికి ఊహాగానంగానే భావించాలి.