Maheshwari: ఇండస్ట్రీలో ప్రేమలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. ఒక సినిమాలో పరిచయమైన హీరో హీరోయిన్స్.. రెండు, మూడు సినిమాల్లో కలిసి చేస్తే వారి మధ్య ప్రేమ పుట్టడం, ఆ ప్రేమ.. పెళ్లి వరకు వెళ్లడం జరుగుతుంది. అలా ఒకే సినిమాలో కలిసి నటించినవారు ప్రేమించి పెళ్లి చేసుకున్నవారు చాలామంది ఉన్నారు. అయితే ఇదంతా ఒకటి అయితే.. బ్రేకప్ స్టోరీలు మరోకటి. గాఢంగా ప్రేమించుకున్నవారు విభేదాల వలన విడిపోవడం. పెళ్లి తరువాత విడాకులు తీసుకొని విడిపోవడం చూస్తూనే ఉంటాం.
అయితే ఈ రెండు కాకుండా మూడో రకం ప్రేమలు కూడా ఇండస్ట్రీలో ఉన్నాయి. అవే క్రష్ ప్రేమలు. అంటే ఒక హీరోపై హీరోయిన్ కు క్రష్. అంటే అతనంటే ఇష్టం. అతడితో ఎక్కువ టైమ్ గడపాలనుకోవడం.. కానీ, ఆ ప్రేమ విషయాన్నీ అతనికి చెప్పకపోవడం. మనసులోనే దాచుకోవడం లాంటివి ఇందులోకి వస్తాయి. అలా దూరం నుంచి చూస్తూ ప్రేమించడమే క్రష్ అని చెప్పొచ్చు. ఇలాంటి క్రష్ లు ఒక్కొక్కరికి ఎన్ని అయినా ఉండొచ్చు.
సరే ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే సీనియర్ హీరోయిన్ మహేశ్వరి.. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ పై ఎనలేని ప్రేమను పెంచుకుందట. కానీ, చివర్లో అజిత్ తనకు షాక్ ఇచ్చాడని చెప్పుకొచ్చింది. తాజాగా ముగ్గురు హీరోయిన్లు మీనా, సిమ్రాన్, మహేశ్వరి.. జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురాకు విచ్చేశారు. ఇక ఈ ఎపిసోడ్ లో అప్పటి సినిమాల ముచ్చట్లు చాలా అంటే చాలా వినిపించారు. అందులో మీ క్రష్ ఎవరు అని జగ్గు భాయ్.. మహేశ్వరిని అడగ్గా.. అదొక సాడ్ స్టోరీ అంటూ చెప్పుకొచ్చింది.
” నాకు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ అంటే చాలా ఇష్టం. ఆయనతో కలిసి రెండు మూడు సినిమాలు కూడా చేశాను. వ్యక్తిగతంగా ఆయన అంటే చాలా అభిమానం. అప్పట్లో అజిత్ మీద నాకు క్రష్ ఉండేది. ఇక సినిమా చివర్లో ఉండగా అజిత్ నా దగ్గరకు వచ్చి.. మహీ నువ్వు నా చెల్లి లాంటిదానివి. జీవితంలో నీకు ఏ అవసరం వచ్చినా నా దగ్గరకు రా. అస్సలు మొహమాటపడకు అని చెప్పారు. అదే నా సాడ్ స్టోరీ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మహేశ్వరి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.