Nitish Bharadwaj: నితీశ్ భరద్వాజ్ అంటే ఇప్పటికీ చాలామందికి గుర్తొచ్చేది మహాభారత్ సీరియల్‌లో శ్రీకృష్ణుడు. ఆ పాత్రతో కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించిన ఆయన.. ఇప్పుడు రణ్‌బీర్ కపూర్‌కు ఇచ్చిన ఓ సలహా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది . “ఎంత డబ్బు ఇచ్చినా ‘యానిమల్’ లాంటి సినిమాలు మాత్రం చేయొద్దు” అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
తాజాగా విడుదలైన’రామాయణ’ ట్రైలర్ చూసిన నితీశ్ భరద్వాజ్ తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే భారతీయ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లే ప్రయత్నం కనిపిస్తోందని అన్నారు. దర్శకుడు నితీశ్ తివారీపై ప్రశంసలు కురిపిస్తూ.. “ఇది కేవలం సినిమా కాదు.. ప్రపంచానికి ఇండియా నుంచి వెళ్లే మరో గొప్ప విజువల్ ఎక్స్‌పీరియెన్స్” అని చెప్పుకొచ్చారు.
‘యానిమల్’ లాంటి సినిమాలు చేయకు
అంతేకాదు.. ఈ సందర్భంగా రణ్‌బీర్ కపూర్‌కు ఓ స్పెషల్ మెసేజ్ కూడా ఇచ్చారు. “నటుడిగా నువ్వంటే నాకు చాలా ఇష్టం. కానీ ఇకపై నువ్వు చేసే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చినా ‘యానిమల్’ లాంటి సినిమాలు చేయకు. భారతీయ సంస్కృతి, కుటుంబ విలువలు, మంచి కథలు చెప్పే సినిమాలే చేయాలి” అంటూ సూచించారు. స్టార్ హీరోలు చేసే సినిమాలు యువతపై ప్రభావం చూపుతాయని, అందుకే కథలు ఎంచుకునే విషయంలో బాధ్యతగా ఉండాలని చెప్పారు.
‘యానిమల్’ సినిమా రిలీజ్ అయినప్పుడు వచ్చిన వివాదాలను కూడా ఆయన గుర్తు చేశారు. సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 900వందల కోట్లు కొల్లగొట్టినప్పటికీ బ్లడ్ బాత్ ఎక్కువగా ఉండటం, మహిళల పాత్రలని హద్దులు మీరి చూపించడం పై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. అదే విషయాన్ని గుర్తు చేస్తూ.. అలాంటి సినిమాల కంటే ప్రేక్షకులకు మంచి అనుభూతి ఇచ్చే కథలు చేయాలని రణ్‌బీర్‌ను కోరారు
అంతర్జాతీయ అవార్డులు వచ్చే అవకాశం
ఇక ‘రామాయణ’ ట్రైలర్ గురించి మాట్లాడితే.. విజువల్స్ చూస్తుంటే గూస్‌బంప్స్ వచ్చాయని నితీశ్ అన్నారు. VFX, AI టెక్నాలజీని వాడిన తీరు హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోదని ప్రశంసించారు. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్షన్‌కు అంతర్జాతీయ అవార్డులు వచ్చే అవకాశం ఉందని కూడా అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. ఈ సినిమా ఆస్కార్ రేసులో కూడా నిలిచే సత్తా ఉందని కాన్ఫిడెన్స్ చూపించారు .
మరోవైపు హాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండటాన్ని కూడా ఆయన స్పెషల్ గా మెన్షన్ చేశాడు కూడా.భారతీయ ఇతిహాసానికి ప్రపంచ స్థాయి సంగీతం జత కావడం నిజంగా గర్వపడాల్సిన విషయమని ఆకాశానికి ఎత్తేశారు నితీశ్.
సీత పాత్రలో నటిస్తున్న సాయిపల్లవి గురించి కూడా నితీశ్ భరద్వాజ్ మాట్లాడారు. సహజమైన నటనతో ఇప్పటికే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న సాయిపల్లవి.. సీత పాత్రకు వంద శాతం న్యాయం చేస్తుందని మనసులోని మాటని తెలిపారు. అలాగే రావణుడిగా నటిస్తున్న యశ్, రాముడిగా కనిపిస్తున్న రణ్‌బీర్ కపూర్ ఇద్దరూ తమ పాత్రల్లో అదరగొడతారనే నమ్మకం వ్యక్తం చేశారు.
‘రామాయణ’ వాటిని అందుకుంటుందో లేదో
ఇదిలా ఉంటే.. గతంలో రామానంద్ సాగర్ రూపొందించిన ‘రామాయణ’, అలాగే బీఆర్ చోప్రా తీసిన ‘మహాభారత్’ సీరియల్స్ టీవీ చరిత్రలో ఎలాంటి సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ ఆ సీరియల్స్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు అదే ఇతిహాసాన్ని అత్యాధునిక టెక్నాలజీతో భారీ స్థాయిలో తెరపైకి తీసుకొస్తుండటంతో దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
చూడాలి మరి నవంబర్ 8న విడుదల కానున్న ‘రామాయణ’ వాటిని అందుకుంటుందో లేదో !