Diet Soda Memory Loss| ఈ రోజుల్లో చాలామందికి కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ తాగే అలవాటు ఉంది. వీరిలో కూడా షుగర్ లెస్ డ్రింక్స్ తాగేవారి కోసం డైట్ కోక్ లాంటి సోడా డ్రింక్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవి పూర్తిగా షుగర్ లెస్ కాదు. ఇందులో చక్కెర ఉండదనే మాట నిజమే కానీ చక్కెర బదులు ఇందులో ఆర్టిఫీషియల్ స్వీటెనర్లు అంటే కృత్రిమ చక్కెర కలుపుతారు. ఈ ఆర్టిఫీషియల్ స్వీటెనర్లు ప్రస్తుతం చాలా మంది ఆహారంలో భాగంగా మారాయి. బరువు తగ్గాలనుకునే వారు, మధుమేహాన్ని నియంత్రించాలనుకునే వారు ఎక్కువగా చక్కెరకు బదులుగా వీటిని ఉపయోగిస్తున్నారు. అయితే తాజాగా వచ్చిన ఒక అధ్యయనం.. ఆర్టిఫీషియల్ స్వీటెనర్లు మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని సూచించింది. అయితే ఇవి నేరుగా జ్ఞాపకశక్తి తగ్గడానికి కారణమని పరిశోధకులు స్పష్టంగా నిర్ధారించలేదు.
ఈ అధ్యయనంలో సగటు వయస్సు 52 సంవత్సరాలు ఉన్న 12,772 మంది పెద్దలను దాదాపు ఎనిమిదేళ్ల పాటు పరిశీలించారు. వారు తీసుకునే ఆహారపు అలవాట్ల గురించి ప్రశ్నావళి ద్వారా సమాచారం సేకరించారు. ఆ వివరాల ఆధారంగా వారు ఎంత మేరకు ఆర్టిఫీషియల్ స్వీటెనర్లు తీసుకుంటున్నారో అంచనా వేశారు.
ఈ పరిశోధనలో అస్పార్టేమ్, సాకరిన్, అసెసల్ఫేమ్ k, ఎరిథ్రిటాల్, జైలిటాల్, సార్బిటాల్, టాగటోస్ వంటి ఏడు రకాల స్వీటెనర్లను పరిశీలించారు. అలాగే పాల్గొన్న వారి జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యాన్ని పలుమార్లు పరీక్షించారు.
60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారిలో ఆర్టిఫీషియల్ స్వీటెనర్ల వినియోగాన్ని పరిశోధకులు పోల్చారు. అత్యధికంగా స్వీటెనర్లు తీసుకున్న వారిలో జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యం 62 శాతం వేగంగా తగ్గినట్లు గుర్తించారు. వారి మెదడు దాదాపు 18 నెలలు అదనంగా వృద్ధాప్యానికి చేరినట్లు అంచనా వేశారు.
మితంగా స్వీటెనర్లు తీసుకున్న వారిలో కూడా తక్కువగా తీసుకున్న వారితో పోలిస్తే 35 శాతం వేగంగా జ్ఞాపకశక్తి తగ్గినట్లు అధ్యయనం వెల్లడించింది. అయితే ఇది కేవలం సంబంధం ఉన్నట్లు మాత్రమే నిరూపితమైంది. స్వీటెనర్లే నేరుగా కారణమని ఈ పరిశోధన చెప్పలేదు.
మధుమేహంతో బాధపడుతున్న వారిలో ఈ సంబంధం మరింత బలంగా కనిపించింది. పరిశోధన ప్రధాన రచయిత డాక్టర్ క్లాడియా కిమీ సుయెమోటో మాట్లాడుతూ.. చక్కెరకు బదులుగా ఆర్టిఫీషియల్ స్వీటెనర్లను ఆరోగ్యకరమైన ఎంపికగా చాలామంది భావిస్తున్నారని చెప్పారు. అయితే కొన్ని స్వీటెనర్లు దీర్ఘకాలంలో మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఈ ఫలితాలు సూచిస్తున్నాయని వివరించారు.
Also Read: 45 ఏళ్ల వయసులో 25 ఏళ్ల యవ్వనం.. ముడతల చర్మంలో జీవం పోసే జెల్.. ఇంట్లోనే తయారు చేయండి
60 సంవత్సరాలు దాటిన వారిలో ఈ సంబంధం స్పష్టంగా కనిపించలేదు. అయితే దీని అర్థం ఆ వయస్సులో ఆర్టిఫీషియల్ స్వీటెనర్లు పూర్తిగా సురక్షితమని కాదు. వృద్ధాప్యంలో మెదడు పనితీరులో సహజంగానే ఎక్కువ మార్పులు ఉంటాయి. అందువల్ల చిన్న ప్రభావాలను గుర్తించడం కష్టమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
డైట్ సోడాల్లో మాత్రమే కాకుండా అనేక ప్రాసెస్డ్ ఆహారాల్లో కూడా కృత్రిమ స్వీటెనర్లు ఉంటాయి. షుగర్ ఫ్రీ జ్యూసులు, ప్రోటీన్ బార్లు, చ్యూయింగ్ గమ్, తక్కువ కేలరీల పెరుగు, షుగర్ ఫ్రీ బిస్కెట్లు, ఫ్లేవర్డ్ డ్రింక్స్, డైట్ స్నాక్స్ వంటి ఉత్పత్తుల్లో ఇవి కనిపిస్తాయి. అందుకే ఆహార పదార్థాల లేబుల్స్ చదవడం మంచిది.
Also Read: మొటిమలతో ఇబ్బందిపడుతున్నారా? రోజూ ఈ డ్రింక్ తాగితే మచ్చలు, మొటిమలు మాయం
నిపుణులు సమతుల ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. పండ్లు, కూరగాయలు, సంపూర్ణ ధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తగ్గించాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. తగినంత నిద్రపోవాలి. మధుమేహం, రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచాలి. అలాగే ధూమపానం, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి.
ఆర్టిఫీషియల్ స్వీటెనర్లు, జ్ఞాపకశక్తి మధ్య సంబంధంపై ఈ అధ్యయనం కొత్త ప్రశ్నలను లేవనెత్తింది. అయితే ఇవి నేరుగా జ్ఞాపకశక్తిని తగ్గిస్తాయని ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు. మరిన్ని పరిశోధనలు పూర్తయ్యే వరకు ఆర్టిఫీషియల్ స్వీటెనర్లను పరిమితంగా తీసుకోవడం, సమతుల ఆహారాన్ని పాటించడం ఆరోగ్యానికి మంచి ఎంపికగా నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: నెలకు రూ.10 లక్షల వరకు జీతం.. ప్రపంచమంతా తిరిగిరావొచ్చు.. ఇంటర్మీడియట్ ఉంటే చాలు