OG Trailer: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. ఈమధ్య వరుస సినిమాలను రిలీజ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ కి డీసీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన చేసిన తొలి చిత్రం ‘హరిహర వీరమల్లు’. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ రేంజ్ నిలబెట్టకపోయినా పర్వాలేదు అనిపించుకుంది. ఇప్పుడు ప్రముఖ డైరెక్టర్ సుజీత్(Sujeeth ) దర్శకత్వంలో ‘ఓజీ’ అంటూ సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ (Priyanka mohan) హీరోయిన్ గా నటిస్తోంది.
ప్రముఖ బాలీవుడ్ స్టార్ నటుడు ఇమ్రాన్ హస్మీ (Imran Hashmi) విలన్ పాత్ర పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే దానయ్య కుమారుడు కళ్యాణ్ దాసరి(Kalyan Dasari) ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను దగ్గరుండి మరీ చూసుకున్నట్లు సమాచారం. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో నిన్న అనగా సెప్టెంబర్ 21న ఉదయం 10:08 గంటలకు సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల అదే రోజు సాయంత్రం హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్లో విడుదల చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఉదయమే ట్రైలర్ వస్తుందని ఎంతో ఎదురుచూసిన అభిమానులకు నిరాశ మిగిలిందనే చెప్పాలి.
ఓజీ ట్రైలర్ రిలీజ్..
ఎట్టకేలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభించారు. ఈవెంట్ కి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు కానీ వరుణుడు వీరికి సహకరించలేదు. ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ఈ కార్యక్రమం సమయంలో అనుకోకుండా అకాల వర్షం రావడంతో ఈవెంట్ కి కాస్త అంతరాయం కలిగింది. అయితే అభిమానులను నిరాశపరచకూడదు అనే కారణంతో ఈవెంట్లోనే ట్రైలర్ ను రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ ట్రైలర్ కి సంబంధించిన వీడియోలను అభిమానులు సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నారు.
హీరో కంటే విలన్ కే ఎక్కువ హైప్ ఇచ్చినట్టున్నారే..
ట్రైలర్ విషయానికి వస్తే.. ఇందులో ఎక్కువగా హీరో కంటే విలన్ ఓమీ పాత్రలో నటిస్తున్న ఇమ్రాన్ హస్మీ (Imran Hashmi) ని సుజీత్ ఎక్కువగా హైలెట్ చేసినట్లు అనిపిస్తోంది అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ట్రైలర్ స్టార్ట్ అవ్వగానే హీరోని ముందు చూపించి ఉంటే బాగుండేదని.. హీరోకి పెద్దగా ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు కనిపించలేదని.. ఇందులో ఎక్కువగా పవన్ కళ్యాణ్ కత్తిని మాత్రమే హైలెట్ చేశారు కానీ పవన్ కళ్యాణ్ పర్ఫామెన్స్ పెద్దగా కనిపించలేదంటూ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఈవెంట్లో ట్రైలర్ రిలీజ్ చేశారు కానీ ఆ ట్రైలర్ ఇప్పుడు అనుకున్నంత రేంజ్ లో అంచనాలను అయితే క్రియేట్ చేయలేకపోతుందనే వార్తలు వినిపిస్తూ ఉండడం గమనార్హం. విడుదలకు కేవలం రెండు రోజులు మాత్రమే ఉంది. ఇలాంటి సమయంలో యూనిట్ సినిమా విజయానికి ఎలాంటి అడుగులు వేస్తారో చూడాలి.