Karimnagar Fire Accident: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పద్మనగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో.. సోమవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రీసైక్లింగ్ గోడౌన్‌లో మంటలు ఆరంభం కావడంతో ఒక్కసారిగా పరిసర ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. మంటలు ఎగసిపడుతున్న దృశ్యం చూసిన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అప్రమత్తమైన సిబ్బంది తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని.. ఫైర్ ఇంజన్ సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు.
గోడౌన్‌లో ఎక్కువ మొత్తంలో ప్లాస్టిక్ వస్తువులు, పార ఫ్లాస్టిక్ ముక్కలు నిల్వ చేసి ఉన్నట్లు సమాచారం. ఇవి మంటలు చెలరేగడానికి ప్రధాన కారణమయ్యాయని అధికారులు భావిస్తున్నారు. ప్లాస్టిక్ పదార్థాలు అత్యంత త్వరగా మంటలు అంటుకునే స్వభావం కలిగి ఉండటంతో.. నిమిషాల్లోనే మంటలు గోడౌన్ మొత్తాన్ని కమ్మేశాయి. అదృష్టవశాత్తు గోడౌన్‌లో కార్మికులు లేకపోవడం వల్ల ప్రాణనష్టం సంభవించలేదు.
స్థానికులు చెప్పిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది.. రెండు ఫైర్ ఇంజన్లతో అక్కడికి చేరుకున్నారు. గంటల తరబడి పోరాడిన తర్వాత మంటలను పూర్తిగా ఆర్పగలిగారు. రాత్రివేళ కావడంతో నీటి సరఫరా వాహనాల కదలికలు కొంత ఇబ్బంది కలిగించినప్పటికీ, సిబ్బంది అప్రమత్తంగా పని చేసి పెద్ద ప్రమాదాన్ని నివారించారు. సమయానికి స్పందించకపోతే మంటలు పక్కనే ఉన్న ఇతర యూనిట్లకు వ్యాపించే అవకాశం ఉండేదని అధికారులు తెలిపారు.
ఈ ప్రమాదంలో గోడౌన్‌లో నిల్వ ఉంచిన ప్లాస్టిక్ వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రారంభ అంచనాల ప్రకారం లక్షల్లో ఆస్తి నష్టం జరిగినట్లు భావిస్తున్నారు. అయితే ఖచ్చితమైన నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీస్ అధికారులు, అగ్నిమాపక శాఖ అధికారి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని వారు తెలిపారు. గోడౌన్ యాజమాన్యం సేఫ్టీ నిబంధనలు పాటించిందా లేదా అన్న దానిపై కూడా విచారణ జరపనున్నారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. పరిశ్రమల ప్రాంతాల్లోని గోడౌన్లలో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా అమలు చేయాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా ప్లాస్టిక్, కెమికల్ వంటి అగ్ని ప్రమాదానికి దారితీసే వస్తువులు నిల్వ చేసే కేంద్రాల్లో.. అగ్నిమాపక పరికరాలు తప్పనిసరిగా ఉంచాలని ఆదేశించారు.