Raveena Tandon: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ కుటుంబంలో జరిగిన ఒక భారీ చోరీ ఇప్పుడు బీ టౌన్ లో హాట్ టాపిక్ అయింది. నమ్మిన వాళ్లే నట్టేట ముంచుతారు అనే సామెతని నిజం చేస్తూ, గత కొన్నేళ్లుగా రవీనా తల్లికి కేర్ టేకర్ గా ఉన్న ఒక మహిళే ఈ చోరీకి పాల్పడటం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. ముంబైలోని జుహు పరిధిలో వెలుగుచూసిన ఈ క్రైమ్ స్టోరీ ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
25 లక్షల రూపాయల విలువైన ఆభరణాలు
విషయంలోకి వెళ్తే.. గతేడాది అక్టోబరు (2025) నెలలో రవీనా టండన్ సోదరుడు రాజీవ్ టాండన్ ఇంట్లో ఈ దొంగతనం జరిగింది. పండుగ సీజన్ కావడంతో ఇంట్లోని లాకర్‌ను పరిశీలించిన కుటుంబ సభ్యులకు ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయింది. లాకర్ తెరిచి ఉండటమే కాకుండా, అందులో ఉండాల్సిన దాదాపు 25 లక్షల రూపాయల విలువైన బంగారు, వజ్రాల ఆభరణాలతో పాటు రెండు అత్యంత ఖరీదైన బ్రాండెడ్ చేతి వాచీలు మాయమయ్యాయి. ఇంట్లో ఎలాంటి తాళాలు పగలగొట్టకపోవడంతో ఇది కచ్చితంగా తెలిసిన వాళ్ల పనే అని అనుమానించిన రాజీవ్ టండన్, వెంటనే ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
47 ఏళ్ల రాశి ఛాబ్రియా అనే మహిళ అసలు సూత్రధారి
రంగంలోకి దిగిన జుహు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే , ఈ కేసులో 47 ఏళ్ల రాశి ఛాబ్రియా అనే మహిళ అసలు సూత్రధారిగా తేలింది. 2020 నుంచి రవీనా టాండన్ సోదరుడి కుటుంబంతో రాశి ఛాబ్రియాకు అత్యంత ఆప్తంగా మెలిగేది. ముఖ్యంగా రవీనా టండన్ వృద్ధురాలైన తల్లికి కేర్‌టేకర్‌గా ఉంటూ ఇంట్లో అందరి నమ్మకాన్ని సంపాదించింది. ఆ నమ్మకమే ఆమెకు ఇంట్లోని రెండో అంతస్తులో ఉండే విలువైన నగలు ఉండే గదిలోకి కూడా స్వేచ్ఛగా వెళ్లే అవకాశాన్ని ఇచ్చింది. దీన్ని అవకాశంగా తీసుకున్న రాశి, సమయం చూసి లాకర్‌లోని 25 లక్షల సొత్తును దొంగతనం చేసింది.
సినిమా లెవెల్ స్కెచ్
మొదట పోలీసులు ఆమెను ప్రశ్నించినప్పుడు బుకాయించినప్పటికీ, పోలీసుల స్టైల్ విచారణలో నేరాన్ని ఒప్పుకోక తప్పలేదు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. దొంగిలించిన రెండు కాస్ట్ లీ వాచీలను తిరిగి ఇచ్చేసిన రాశి, నగలను మాత్రం జగదీష్ అనే తన సహచరుడి వద్ద దాచినట్లు చెప్పింది. అంతటితో ఆగకుండా, తన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి సినిమా లెవెల్ స్కెచ్ వేసింది. తన పార్ట్నర్‌ను ఒక పోలీస్ ఇన్ఫార్మర్‌గా టండన్ కుటుంబానికి పరిచయం చేసి, ఒకవేళ ఈ నగలను వదిలేయకపోతే రాజీవ్ టండన్ కుటుంబాన్ని నకిలీ డ్రగ్స్ కేసులో ఇరికిస్తామంటూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడింది. ఈ విషయాన్ని కూడా రాజీవ్ టండన్ ఎఫ్ఐఆర్‌లో నమోదు చేయించారు. చివరకు ఆధారాలతో మే 21న రాశి ఛాబ్రియాని జుహు పోలీసులు అరెస్ట్ చేయగా, మే 29 వరకు కోర్టు ఆమెకు రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ స్పీడ్ గా జరుగుతుందని సమాచారం.
టాలీవుడ్‌తో విడదీయరాని అనుబంధం
ఇక రవీనా టాండన్ విషయానికి వస్తే, ఈమెకు టాలీవుడ్‌తో విడదీయరాని అనుబంధం ఉందన్న సంగతి తెల్సిందే. 1990ల్లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సరసన ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’ వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలో నటించిన రవీనా, ఆ తర్వాత నాగార్జునతో ‘ఆవిడా మా ఆవిడే’, ఉపేంద్రతో ‘ఉపేంద్ర’ వంటి సెన్సేషనల్ సినిమాల్లో మెరిసింది. ఇటీవలే పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ‘కేజీఎఫ్ 2’ లో రమికా సేన్ పాత్రతో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది కూడా.
ప్రస్తుతం రవీనా వారసురాలిగా ఆమె కుమార్తె రషా తడానీ టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నయ్య (రమేష్ బాబు) కుమారుడు జయకృష్ణ హీరోగా పరిచయమవుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రంలో రషా తడానీ హీరోయిన్‌గా నటిస్తోంది. చూడాలి పోలీసుల ఈ ఇన్వెస్టిగేషన్లో ఇంకెవరెవరు బయటికి వస్తారో !
also read :నాని ‘పారడైజ్’ క్లైమాక్స్‌లో మెగాస్టార్ ?.. టాలీవుడ్‌లో సరికొత్త సినిమాటిక్ యూనివర్స్!