Film industry:భోజ్ పురి నటుడిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న పవన్ సింగ్ (Pawan Singh) గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న ఒక సినిమా ఈవెంట్ లో భాగంగా స్టేజ్ పైనే అందరి ముందు హీరోయిన్ అంజలి రాఘవ్ (Anjali Raghav) నడుమును తాకి విమర్శల పాలైన ఈయన.. ఇప్పుడు ఏకంగా చీటింగ్ కేసులో ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఒక వ్యాపారిని రూ .1.57కోట్లు మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు పవన్ సింగ్.
చీటింగ్ కేసులో ఇరుక్కున్న పవన్..
అసలు విషయంలోకి వెళ్తే.. విశాల్ సింగ్ అనే ఒక వ్యాపారవేత్త.. 2018లో బాస్ అనే భోజ్ పురి చిత్రానికి పెట్టుబడి పెట్టారు. ఈ సినిమాలో పెట్టుబడి పెడితే లాభాలలో వాటా ఇస్తానని పవన్ సింగ్ , అతని స్నేహితులు విశాల్ సింగ్ కు హామీ ఇచ్చారట. వారి మాటలను నమ్మి, విశాల్ సింగ్ సినిమాలో పెట్టుబడి పెట్టారు. అయితే సినిమా విడుదలైన తర్వాత లాభాలలో వాటాలు కాదు కదా.. కనీసం తాను పెట్టిన పెట్టుబడిని కూడా తిరిగి ఇవ్వలేదట. పైగా అడిగితే చంపేస్తామని పవన్ సింగ్ బెదిరించారట. దీంతో తాను మోసపోయానని గ్రహించిన విశాల్ సింగ్.. పవన్ సింగ్ తో పాటు మరో ముగ్గురిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కేసును స్వీకరించిన పోలీసులు పవన్ సింగ్ తో పాటు మరో ముగ్గురిపై మోసం అలాగే బెదిరింపుల ఆరోపణల కింద ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
హీరోయిన్ తో అసభ్యకర ప్రవర్తన.. దిగొచ్చిన హీరో..
ఇదిలా ఉండగా తనతో కలిసి ఒక సాంగ్లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన అంజలి రాఘవ్ తో అసభ్యంగా ప్రవర్తించారు పవన్ సింగ్. ముఖ్యంగా ఒక స్టేజిపై అందరి ముందే ఆమె నడుమును తాకిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయగా.. ఎట్టకేలకు పవన్ సింగ్ ఆ హీరోయిన్ కి క్షమాపణలు చెప్పారు. ఇలా వివాదాలు నేపథ్యంలో విమర్శలు ఎదుర్కొంటున్న పవన్ సింగ్ పై ఇప్పుడు కేసు ఫైల్ అవ్వడం మరింత ఆశ్చర్యంగా మారింది. మరి ఈ చీటింగ్ కేస్ ఫైల్ వివాదం నుండీ ఎలా బయటపడతారో చూడాలి.
పవన్ సింగ్ సినిమాలు..
నటుడిగా, రాజకీయ నాయకుడిగా, నేపథ్య గాయకుడిగా, సంగీత స్వరకర్తగా, రంగస్థలం ప్రదర్శన కారుడిగా మంచి పేరు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా భోజ్ పురి చిత్ర పరిశ్రమలో తన రచనలకు ప్రసిద్ధి చెందిన ఈయన.. బాలీవుడ్ చిత్రం స్త్రీ 2 నేపథ్య గాయకుడిగా పాడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రెండు అంతర్జాతీయ భోజ్ పురి చలనచిత్ర అవార్డులు కూడా అందుకున్నారు. ప్రతిజ్ఞ, సత్య, క్రాక్, ఫైటర్, షేర్ సింగ్, రాజా వంటి చిత్రాలు ఈయనకు మంచి గుర్తింపును అందించాయి.