Shoaib Ibrahim: ప్రముఖ టెలివిజన్ నటుడు షోయబ్ ఇబ్రహీం కుటుంబం ప్రస్తుతం తీవ్రమైన వ్యక్తిగత కష్టాలను ఎదుర్కొంటోంది. ఒకవైపు ఆయన భార్య, నటి దీపికా కాకర్ లివర్ క్యాన్సర్‌తో పోరాడుతుండగా, ఇప్పుడు షోయబ్ తండ్రి రెండోసారి బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడ్డారు. శనివారం ఉదయం ఆయనకు స్ట్రోక్ రావడంతో ముంబైలోని ఒక ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో చేర్పించారు.
Read also-రణవీర్ సింగ్‌పై ఎఫ్‌డబ్ల్యుఐసిఈకి ఫిర్యాదు చేసిన ఫర్హాన్ అఖ్తర్.. కారణం ఏంటంటే?
ఈ విషాద వార్తను షోయబ్ ఇబ్రహీం తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. “నాన్నగారి కోసం మీ అందరి ప్రార్థనలు, దువాలు కావాలి. ఈ ఉదయం నాన్నకు మళ్లీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉన్నారు. దయచేసి ఆయనను మీ ప్రార్థనలలో ఉంచండి. వచ్చే 24 గంటలు ఆయన ఆరోగ్యానికి చాలా కీలకం” అని షోయబ్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
గతంలో, జూలై 2021లో కూడా షోయబ్ తండ్రికి మొదటిసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఆ సమయంలో ఆయన సుదీర్ఘ కాలం ఆసుపత్రిలో చికిత్స పొందారు. అయితే, ఆ స్ట్రోక్ కారణంగా ఆయన శరీరంలోని ఎడమ భాగం పక్షవాతానికి గురైంది. అప్పటినుంచి కుటుంబ సభ్యులు ఆయనను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు. షోయబ్ తన యూట్యూబ్ వ్లాగ్స్‌లో తరచుగా తన తండ్రిని చూపిస్తూ, కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ ఉంటారు. ఈ దురదృష్టకర సంఘటన జరగడానికి కేవలం ఒక రోజు ముందే, షోయబ్ తన స్వంత నిర్మాణ సంస్థ ‘ఖల్బ్ ప్రొడక్షన్స్’ కింద ఒక కొత్త మ్యూజిక్ వీడియో షూటింగ్ ప్రారంభించినందుకు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. షూటింగ్‌కు వెళ్లే ముందు తండ్రి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. కానీ అంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది.
మరోవైపు, షోయబ్ భార్య దీపికా కాకర్ ఆరోగ్య పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది. గతేడాది ఆమెకు లివర్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది, ఆ తర్వాత ఆమెకు శస్త్రచికిత్స కూడా జరిగింది. అయితే, ఈ ఏడాది మార్చిలో ఆమె కాలేయంలో మళ్లీ కొత్తగా రెండు చిన్న సిస్ట్‌లు (కండరాలు/గడ్డలు) ఉన్నట్లు ఎంఆర్‌ఐ స్కాన్‌లో తేలింది. దీనిపై షోయబ్ మాట్లాడుతూ, వైద్యులు ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, తదుపరి చికిత్స కోసం పెట్ స్కాన్ చేయించాల్సి ఉందని తెలిపారు.
Read also-వైజయంతీమాలపై కంగనా రనౌత్ ఎమోషనల్ నోట్.. ఇది అస్సలు ఊహించలేరు..
ఈ కష్టసమయంలో దీపికా కాకర్ మాట్లాడుతూ.. “ఇది ఒక సుదీర్ఘమైన పోరాటం, మేము దీనిని ధైర్యంగా ఎదుర్కొంటాము. ఈ అనారోగ్యం మా జీవితంలో ఒక భాగమైపోయింది. కానీ నా వల్ల షోయబ్ కెరీర్ పాడవకూడదు. ఈ పోరాటం ఏళ్ల తరబడి సాగవచ్చు, కానీ పని కూడా అంతే ముఖ్యం” అని పేర్కొన్నారు. షోయబ్ ఇబ్రహీం, దీపికా కాకర్ 2018లో వివాహం చేసుకోగా, వారికి 2023లో ‘రుహాన్’ అనే కుమారుడు జన్మించాడు. ఒకే సమయంలో భార్య, తండ్రి ఇద్దరూ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటంతో షోయబ్ మానసికంగా ఎంతో కుంగిపోతున్నారు. నటుడి తండ్రి త్వరగా కోలుకోవాలని టీవీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో సోషల్ మీడియా ద్వారా ప్రార్థనలు చేస్తున్నారు.