Shruti Haasan:ప్రముఖ స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న శృతిహాసన్ (Shruti Haasan) ఇప్పుడు సీనియర్ స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంటోంది. ఒకప్పుడు రామ్ చరణ్ (Ram Charan), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వంటి హీరోలతో జతకట్టిన ఈమె.. ఆ తర్వాత కాలంలో బాలకృష్ణ (Balakrishna), చిరంజీవి (Chiranjeevi) వంటి హీరోలతో కూడా నటించింది. ఇప్పుడు ఏకంగా రజనీకాంత్ (Rajinikanth) వంటి అగ్ర హీరోలతో నటించడం నిజంగా ఆశ్చర్యకరమనే చెప్పాలి. ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా.. అవకాశం వస్తే ప్రతి ఒక్కరితో కూడా నటించడానికి సిద్ధం అంటోంది శృతిహాసన్. అందులో భాగంగానే తాజాగా ఈమె నటిస్తున్న చిత్రం కూలీ (Coolie). ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఆ ఒక్క సినిమా శృతిహాసన్ జీవితాన్నే మార్చేసింది..
ఇదిలా ఉండగా తాజాగా ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతిహాసన్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకుంది. అసలు విషయంలోకి వెళ్తే.. ఈమెకు మొదటి విజయాన్ని పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ సినిమా ద్వారా అందించిన విషయం తెలిసిందే. హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అంతే కాదు పవన్ కళ్యాణ్ – శృతిహాసన్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా కంటే ముందు పలు చిత్రాలు చేసినా.. అవన్నీ ఫ్లాప్ కావడంతో ఈమెను ఐరన్ లెగ్ అంటూ చాలా మంది సంబోధించారు కూడా. అంతేకాదు ఈమె ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అసాధ్యం అనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అయ్యాయి. ఎప్పుడైతే గబ్బర్ సింగ్ సినిమా విజయం సాధించిందో.. ఒక్కసారిగా ఈమె కెరియర్ మలుపు తిరిగింది. తక్కువ సమయంలోనే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది.
నా కెరియర్ ఇలా ఉండడానికి కారణం వారే..
అలాంటి పవన్ కళ్యాణ్ గురించి తాజాగా ఈమె కీలక వ్యాఖ్యలు చేసింది.” నన్ను గబ్బర్ సింగ్ పాత్ర కోసం అడిగిన సమయంలో కొన్ని కారణాలు చెప్పి తిరస్కరించాను. కానీ దర్శకుడు హరీష్ శంకర్ మాత్రం వదిలిపెట్టలేదు. ఆ పాత్రలో మిమ్మల్ని మాత్రమే చూశాను అని, తప్పకుండా చేయాలి అని విజ్ఞప్తి చేశారు. దాంతో కొన్ని వారాల తర్వాత సినిమా కథ విని, కథ నచ్చడంతో సినిమా చేయడానికి సిద్ధమయ్యాను. ఆ సినిమా చేయడం వల్ల ఈ రోజు నా కెరియర్ ఇలా ఉందని నేను నమ్ముతున్నాను.
పవన్ రాజకీయాల్లో ఉంటే జరిగేది ఇదే..
పవన్ కళ్యాణ్ చాలా సింపుల్ పర్సన్. స్టార్డం ఎప్పుడు కూడా చూపించరు. గ్రామాలు, వ్యవసాయం గురించి ఆయన ఎక్కువగా ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. అలాంటి వారే ఎక్కువగా రాజకీయాలలో ఉండాలి. ఆయన కచ్చితంగా రాజకీయాల్లో ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుంది అంటూ పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తుపై కామెంట్లు చేసింది శృతిహాసన్. మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉంటే రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటారు అని తన మనసులో మాటగా చెప్పుకొచ్చింది.