Sonusood:రీల్ హీరోగానే కాకుండా రియల్ హీరోగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంటున్న సోనూసూద్ (Sonusood) ఎక్కడైనా ప్రమాదం జరిగినా లేదా ఎవరికైనా ఇబ్బంది కలిగినా వెంటనే స్పందిస్తూ సహాయాన్ని అందిస్తూ ఉంటారు. ఇటీవల జపాన్ లో వచ్చిన వరదల కారణంగా అక్కడ తన సూద్ చారిటీ సంస్థ ద్వారా ఎంతో మందికి ఆసరాగా నిలిచిన ఆయ.. నేడు ఢిల్లీ భవన ప్రమాదం పై స్పందిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన చేస్తున్న డిమాండ్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఢిల్లీలోని సత్య నికేతన్ లో జరిగిన ఐదంతస్తుల పీజీ భవనం కూలిన ఘటనపై సోనూసూద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఒక పోస్ట్ పంచుకున్నారు. ” విద్యార్థులు తమ సొంత ఊర్లను వదిలి, ఇతర నగరాలకు చదువుకోవడానికి వస్తున్నారు. అలాంటి విద్యార్థులకు సురక్షితమైన, సరసమైన ధరలలో వసతి గృహాలు అందుబాటులో లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో విద్యార్థుల సంఖ్యకు.. అందుబాటులో ఉన్న హాస్టల్ సౌకర్యాలకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని, ఢిల్లీ యూనివర్సిటీలో సుమారుగా ఏడు లక్షల మంది విద్యార్థులు చదువుతుంటే.. కేవలం 30 వేల మందికి మాత్రమే హాస్టల్ వసతి లభిస్తుందని అంటే.. ప్రతి 31 మంది విద్యార్థులలో కేవలం ఒక్కరికి మాత్రమే హాస్టల్ లభిస్తోంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
భవనం కూలిపోవడంతో ఐదుగురు ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థులతో పాటు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది విద్యార్థులు గాయపడ్డారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ నివేదిక ప్రకారం.. ఈ భవనం నిర్మించడానికి ఎటువంటి అనుమతి లేదు. అక్రమంగా బేస్ మెంట్ తో పాటు నిబంధనలకు విరుద్ధంగా ఐదవ అంతస్తును కూడా నిర్మించినట్లు తేలింది. ఈ మేరకు విద్యార్థుల భద్రతను కాపాడడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సోనూ సూద్ కోరారు. విశ్వవిద్యాలయాల చుట్టూ ఉన్న ఖాళీ ప్రభుత్వ భూములను గుర్తించి , సురక్షితమైన హాస్టల్ లను నిర్మించాలని, అలాగే క్యాంపస్లలో వసతిని పెంచుకోవడానికి వర్సిటీలకు అదనకు అనుమతులు కూడా ఇవ్వాలని ఆయన కోరారు.

ఇదిలా ఉండగా ఢిల్లీలో జరిగిన ఈ దుర్ఘటనలో గాయపడిన వారికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తామని , వారి పూర్తి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్త ప్రకటించారు. ఇక సోను సూద్ డిమాండ్ మేరకు ప్రభుత్వం ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
also read:కైపెక్కించే ఫోజులతో విష్ణుప్రియ కిర్రాక్ లుక్.. ఫోటోస్ వైరల్!
సోనూసూద్ విషయానికి వస్తే.. ఒకవైపు ఇలా సామాజిక అంశాలపై స్పందిస్తూనే.. మరొకవైపు హీరోగా పలు చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.. కోడి రామకృష్ణ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన అరుంధతి సినిమాలో పశుపతి పాత్ర పోషించి తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. విలనిజానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఆయన.. ఎన్నో తెలుగు చిత్రాలలో నటించి మెప్పించారు. ఇక ఇప్పుడు ఇలా సామాజిక సేవా దృక్పథంతో కూడా అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు.