Tollywood:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు గర్భం దాలుస్తూ అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది దీపిక పదుకొనే మరోసారి తల్లి కాబోతున్నాను అని అభిమానులతో ఆ శుభవార్తను పంచుకోగా.. ఇక నిన్నటికి నిన్న నారా రోహిత్ భార్య ప్రముఖ హీరోయిన్ శిరీష లెల్లా కూడా తల్లి కాబోతున్నాను అంటూ బేబీ బంప్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. వీరితోపాటు ఇప్పుడు మరో బ్యూటీ తల్లి కాబోతున్న విషయాన్ని అభిమానులతో పంచుకుంది. తన భర్తతో కలిసి దిగిన ఫోటోషూట్ ను అభిమానులతో షేర్ చేస్తూ.. ఇద్దరం కాస్త ముగ్గురం కాబోతున్నాము.. మా ఈ ప్రత్యేకమైన ప్రయాణానికి మీ అందరి ఆశీస్సులు కావాలి అని కోరింది.
ఆమె ఎవరో కాదు రెబా మోనిక జాన్.. స్వతహాగా మలయాళీ అయినప్పటికీ తెలుగులో శ్రీ విష్ణు సరసన మృత్యుంజయ్, సామజవరగమన, మ్యాడ్ స్క్వేర్ వంటి చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇక ఇప్పుడు తన ప్రెగ్నెన్సీ విషయాన్ని బయట పెట్టింది. థాయిలాండ్ లోని బీచ్ లో తన భర్తతో దిగిన ఫోటోలను షేర్ చేసింది. త్వరలో మేము ముగ్గురం కాబోతున్నాము అంటూ ఆ బేబీ బంప్ ఫోటోలను అభిమానులతో పంచుకోవడంతో ఈ ఫోటోలు, వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ప్రస్తుతం ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నారు అని తెలిసి అభిమానులు, సినీ సెలబ్రిటీలు నెటిజన్లు వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే కెరియర్ పీక్స్ లో ఉండగానే 2022లో జోయీమోన్ జోసెఫ్ తో ఏడడుగులు వేసింది . ఇక పెళ్లయిన నాలుగేళ్లకు తల్లి కాబోతున్నానని ప్రకటించింది ఈ ముద్దుగుమ్మ.
రెబా మోనిక జాన్ కెరియర్ విషయానికి వస్తే.. 1994 ఫిబ్రవరి 4న కర్ణాటక బెంగళూరులో జన్మించిన ఈమె.. 2016 లో జాకోబిన్ట్ స్వర్గరాజ్యం అనే సినిమాతో మలయాళం సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది తమిళ్, మలయాళం సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె తొలిసారి అక్టోబర్ 31 లేడీస్ నైట్ అనే తెలుగు, తమిళ్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అయితే ఈమె శ్రీ సామజ వరగమన సినిమా ద్వారా తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్, అనిల్ సుంకర సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీ విష్ణు హీరోగా నటించారు. వెన్నెల కిషోర్ , నరేష్ , శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ద్వారా రెబా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇందులో తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంది.
ఇకపోతే ఈమెకు బాగా గుర్తింపు వచ్చింది మాత్రం మ్యాడ్ స్క్వేర్ మూవీ తోనే అనే చెప్పాలి. 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాకు సీక్వెల్ గా సూర్యదేవర నాగ వంశీ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై హారిక సూర్యదేవర , సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. సంగీత్ శోభన్, నార్నే నితిన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమాలో స్వాతి రెడ్డి అనే పాటలో అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ కనబరిచి అందరినీ ఆకట్టుకుంది.