Aaryan Postponed: తెలుగు సినిమా రేంజ్ ఎంతగా మారిపోయిందంటే.. తెలుగు ఇండస్ట్రీని చూసి వేరే ఇండస్ట్రీ వాళ్లు భయపడుతున్నారు. తెలుగులో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే.. వాటితో పోటీ మనకెందుకు అనుకోని పక్కకు తప్పుకుంటున్నారు. తాజాగా ఒక కోలీవుడ్ సినిమా అలానే చివరి నిమిషంలో పక్కకు తప్పుకుంది. ఆ సినిమా ఏదో కాదు ఆర్యన్. విష్ణు విశాల్ హీరోగా కె ప్రవీణ్ దర్శకత్వం వహించిన ఆర్యన్ సినిమాను విష్ణు విశాల్ నే నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాధ్, మానస చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇప్పటికే ఆర్యన్ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అక్టోబర్ 31 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజున తెలుగులో మాస్ జాతర, బాహబలి ది ఎపిక్ రిలీజ్ కుసిద్ధమవుతున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టిన విష్ణు విశాల్ తాజాగా తాము ఈ రేస్ నుంచి తప్పుకుంటున్నట్లు అధికారిక ప్రకటన రిలీజ్ చేశారు. సడెన్ గా వాయిదా వేయడానికి తెలుగు సినిమాలే కారణమని కూడా తెలిపారు.
“డియర్ తెలుగు ఆడియన్స్.. సినిమా అనేది రేస్ కాదు, అది ఒక వేడుక అని నేను ఎప్పుడూ నమ్ముతాను. ప్రతి వేడుకకీ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం, విలువ ఉండాలి. మా చిత్రం ‘ఆర్యన్’ అక్టోబర్ 31న విడుదల కావలసి ఉంది. ఈ ప్రత్యేక తేదీ మాస్ మహారాజా రవితేజ గారు ‘మాస్ జాతర’, పవర్ ఫుల్ ‘బాహుబలి ది ఎపిక్’ మీ అందరినీ అలరించడానికి రావడంతో మరింత ప్రత్యేకమైనది. నేను ఎప్పటినుంచో రవితేజ గారిని అభిమానించే వ్యక్తిని ఆయన ఆన్ స్కీన్ ఎనర్జీకే కాక ఆయన వ్యక్తిత్వం నాకు చాలా ఇష్టం, మాకు ఆయన మద్దతు (నా గట్టా కుస్తీ సినిమాకి ఆయన సహనిర్మాతగా ఉన్నారు) కూడా వుంది.
అలాగే, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి గారికి నేను లైఫ్ టైం ఫ్యాన్ ని. ఈ వారం వారి సినిమాలని సెలబ్రేట్ చేసుకోవడం సరైనదని భావిస్తున్నాను. ఆర్యన్ సినిమా తమిళ్ లో విడుదలైన ఒక వారం తర్వాత అదే పాషన్, థ్రిల్ తో నవంబర్ 7న తెలుగులోకి వస్తుంది. మీ మద్దతుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా నిర్ణయానికి అండగా నిలిచిన మా డిస్ట్రిబ్యూటర్లు శ్రీ సుధాకర్ రెడ్డి గారు, మహేశ్వర్ రెడ్డి గారు (Sreshth Movies)లకు ప్రత్యేక కృతజ్ఞతలు. నా సినిమా తనకంటూ ఒక మంచి స్థానం సంపాదించుకోవాలని నేను కోరుకుంటున్నాను. తెలుగు ప్రేక్షకుల కోసం విభిన్నమైన సినిమాలు అందించాలనే నా ప్రయత్నంలో ఇది ఒక మంచి ప్రారంభం అవుతుందని నేను నమ్ముతున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. నువ్వు ఎంత ప్రేమగా చెప్పినా తెలుగు సినిమాలతో రిలీజ్ చేయాలంటే భయపడుతున్నావ్ లే అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే ఆర్యన్ నవంబర్ 7 న రిలీజ్ కానుందని తెలుస్తోంది. మరి ఆ రోజు రిలీజ్ కానున్న తెలుగు సినిమాలను తట్టుకుంటుందో లేదో చూడాలి.