NCP Politics: మహారాష్ట్రలో రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం, ఎన్‌సీపీ అధినేత అజిత్ పవర్ మృతి చెందారు. దీంతో ఆయన రాజకీయ వారసుడు ఎవరన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇంతకీ అజిత్ భార్య పార్టీ పగ్గాలు అందుకుంటారా? లేకుంటే కొడుకు తీసుకుంటాడా? లేకుంటే శరద్ పవార్‌కు అప్పగిస్తారా? అనేదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఎన్‌సీపీకి అజిత్ పవార్ వారసులెవరు?
బుధవారం విమాన ప్రమాదంలో మృతి చెందారు ఎన్‌సీపీ అధినేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్. అజిత్ అంత్యక్రియలు ముగియడంతో ఆ పార్టీ అసలు రాజకీయాలు మొదలయ్యాయి. ఎన్‌సీపీ పార్టీ పరిస్థితి ఏంటి? అజిత్ పవార్ రాజకీయ వారసులు ఎవరు? అనేదానిపై ఆ పార్టీలో రకరకాలుగా చర్చ కొనసాగుతోంది. ఆ పార్టీ పగ్గాలు అందుకునేందుకు సీనియర్ నేతలు రేసులో ఉన్నారు.
దీంతో అజిత్ పవార్ లోటును ఎవర భర్తీ చేస్తారనే దానిపై ఆసక్తి మొదలైంది. అజిత్ పవార్ రాజకీయ వారసుడిగా తెర మీదకు పలువురి పేర్లు వస్తున్నాయి. అజిత్ అకాల మరణంతో ఎన్‌సీపీలో నాయకత్వ శూన్యత ఏర్పడింది. ఆ లోటు భర్తీ చేసేందుకు ఆ పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ పేరు రాజకీయ వారసురాలిగా ప్రకటించాలని ఎన్సీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
భార్య లేకుంటే కొడుకా? సొంతగూటుకి వెళ్తారా?
ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ ఉన్నారు. ఎన్సీపీకి కంచుకోట బారామతి ప్రాంతం. అజిత్ పవార్ పగ్గాలు అందుకున్న తర్వాత భార్యని రంగంలోకి దించారు. మహిళా సంఘాలు, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ఆ ప్రాంత ప్రజల్లో మంచి పట్టు సాధించారు సునేత్ర పవార్.
పార్టీ యంత్రాంగంపై సీనియర్ నేతలు ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరేలు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్సీపీ పరిస్థితి ఏంటన్నది అసలు ప్రశ్న. ఎన్సీపీ ఎమ్మెల్యేలు తిరిగి శరద్ పవార్ గూటికి చేరుతారా? లేకుంటే పార్టీని అజిత్ మాదిరిగా నడిపిస్తారా? అనేది కీలకంగా మారింది.
సునేత్ర పవార్ తర్వాత రేసులో అజిత్ పవార్ పెద్ద కొడుకు పార్థ్ పవార్ పేరు వినిపిస్తోంది. 2019 లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పార్థ్, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటినుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. అజిత్ పవార్ కుటుంబ వారసుడిగా పార్టీ కేడర్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు పార్థ్ పవార్.
ALSO READ: హిమాలయాల్లో ఎయిర్‌ఫోర్స్ పోరాటం
అజిత్ పవార్ రాజకీయ వారసుడిగా ప్రఫుల్ పటేల్ తెరమీదకు వస్తోంది. ఆ పార్టీ వ్యవస్థాపక నేతల్లో ఆయన కూడా ఒకరు. ప్రఫుల్ కు అవకాశం ఇవ్వాలని ఆయన వర్గం డిమాండ్ చేస్తోంది. ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పగలిగే సామర్థ్యం అజిత్ పవార్ ఆయనకే ఉందని అంటున్నారు. పరిపాలనా అనుభవం, జాతీయ రాజకీయాల్లో పరిచయాలు ఉండటంతో పార్టీని సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ప్రఫుల్ పటేల్ అయితే బెటరని అంటున్నారు.
ఎన్సీపీ పార్టీ మహారాష్ట్ర యూనిట్ అధ్యక్షుడిగా సునీల్ తట్కరే ఉన్నారు. క్షేత్రస్థాయిలో కేడర్‌పై గట్టి పట్టున్న నేత. ముఖ్యంగా కొంకణ్ ప్రాంతంలో బలమైన నేతగా గుర్తింపు పొందారు. ఎన్సీపీ యంత్రాంగాన్ని నడిపించడంలో అజిత్ పవార్‌కు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్నారు.
ప్రస్తుతం ఎన్సీపీ ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సునేత్రా పవార్‌ను అధ్యక్షురాలిని చేసి, ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరేలకు కీలక బాధ్యతలు అప్పగించడం. రెండోది అజిత్ పవార్ లేని లోటును భర్తీ చేయడం కష్టమని భావిస్తే తిరిగి శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ విలీనం కావడం మాత్రమే ఉంది. రానున్న రెండువారాల్లో ఏం జరుగుతుందో చూడాలి.