BigTV English
Advertisement

Jammu Kashmir: కశ్మీర్‌ కుర్చీకై పార్టీల కుస్తీలు

Jammu Kashmir: కశ్మీర్‌ కుర్చీకై పార్టీల కుస్తీలు

– పదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు
– నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ
– 90 స్థానాలకు 3 దశల్లో పోలింగ్..
– అక్టోబరు 4న ఫలితాల వెల్లడి
– రాష్ట్ర హోదా గ్యారెంటీతో కాంగ్రెస్
– కశ్మీర్ అభివృద్ధికి బీజేపీ గ్యారెంటీలు
– కూటమి దిశగా కాంగ్రెస్ – ఎన్సీపీ
– ఒంటరి పోరుకు సిద్ధమైన బీజేపీ
– త్రిశంకు స్వర్గంలో పీడీపీ పార్టీ


Assembly Elections in Jammu & Kashmir(Political news telugu): జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర అసెంబ్లీలోని 90 స్థానాలకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2014లో చివరిసారి జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలు జరగగా, తర్వాత రాష్ట్రం గవర్నర్ పాలనలో ఉండిపోయింది. 2019 ఆగస్టు 5న కేంద్రం ఆర్టికల్ 370 అధికరణ రద్దు చేసిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావటంతో దేశవ్యాప్తంగా ఈ అసెంబ్లీ ఎన్నికల మీద ఆసక్తి నెలకొంది. కాగా, కశ్మీర్ కోల్పోయిన రాష్ట్ర హోదా ఇస్తామని కాంగ్రెస్, స్థానికంగా అభివృద్ధి చేసే బాధ్యత తనదేనంటూ బీజేపీ రంగంలోకి దిగి ప్రచారాన్ని ప్రారంభించాయి. కాంగ్రెస్- ఎన్సీపీలు జట్టుగా గోదాలోకి దిగనుండగా, బీజేపీ, పీడీపీలు ఒంటరి పోరుకు సిద్ధమయ్యాయి.

అసెంబ్లీ లెక్క ఇదీ..
ఇప్పటి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత దీని రాష్ట్ర హోదాను రద్దు చేశారు. జమ్మూ కాశ్మీర్‌లో మొత్తం 114 సీట్లుండగా, అందులో 24 పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్నాయి. ఆ ప్రాంతంలో భారత ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదు గనుక టెక్నికల్‌గా ఈ సీట్లు ఖాళీగా ఉంటాయి. అవి పోను మిగిలిన 90 సీట్లకు ఇప్పడు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో 43 సీట్లు కశ్మీర్‌ లోయలో ఉండగా, 47 సీట్లు జమ్మూ ప్రాంతంలో ఉన్నాయి. గతంలో అసెంబ్లీ ప్రభుత్వ పదవీకాలం 6 సంవత్సరాలుగా ఉండగా, ఇప్పుడు అది మిగిలిన రాష్ట్రాల మాదిరిగానే ఐదేళ్లకు పరిమితం కానుంది.


87 లక్షల ఓటర్లు..
జమ్ముకశ్మీర్‌ మొత్తం ఓటర్ల సంఖ్య.. 87.09 లక్షలు. వీరిలో 44.46 లక్షల మంది పురుషులు, 42.62 లక్షల మంది మహిళలున్నారు. ఈసారి 3.71 లక్షల మంది తొలిసారి ఓటేయనున్నారు. మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో మొత్తం 11,800 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి సగటున 735 మంది ఓటర్లున్నారు. మొత్తం 90 సీట్లలో 24 సీట్లకు తొలి దశలో సెప్టెంబర్ 18న పోలింగ్ జరగనుంది. రెండవ దశలో 26 సీట్లకు సెప్టెంబరు 25న ఓటింగ్ నిర్వహించనున్నారు. చివరి దశలోని 40 సీట్లకు అక్టోబరు 1న ఎన్నికలు నిర్వహిస్తారు. అక్టోబరు 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.

కీలకంగా ఆ 16 సీట్లు..
ఆర్టికల్ 370 రద్దుకు ముందు రాష్ట్రంలో రిజర్వేషన్లు లేవు. కానీ, ఆ ఆర్టికల్ రద్దు తర్వాత తొలిసారి ఇక్కడ రిజర్వేషన్ల అమలు జరుగుతోంది. దీని ప్రకారం.. ప్రస్తుతం ఉన్న 90 సీట్లలో 16 సీట్లను రిజర్వుడు వర్గాలకు కేటాయించారు. వీటిలో ఎస్సీలకు 7, ఎస్టీలకు 9 స్థానాలొచ్చాయి. ఈ 16 సీట్లలో 13 జమ్మూ డివిజన్‌లో ఉండగా, 3 కశ్మీర్ లోయలో ఉన్నాయి. తొలిసారిగా ఎస్‌సీ,ఎస్టీ రిజర్వేషన్ వచ్చిన కారణంగా ముఖ్యంగా రాజోరి-పూంచ్ జిల్లాలో గత సమీకరణాలు మారనున్నాయి. దీంతో ఈ ప్రాంతంలో పహారీ, గుజ్జర్ వర్గాల వారికి అధికారం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం 90 సీట్లలో ఈ 16 సీట్లు ఎవరికి దక్కితే వారికి అధికారం దక్కే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇదీ మా హామీ: రాహుల్
జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించడమే కాంగ్రెస్, ఇండియా కూటమి తొలి ప్రాధాన్యత అని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. కశ్మీర్ పర్యటనలో ఉన్న ఆయన గురువారం శ్రీనగర్ లో పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ప్రసంగించారు. కశ్మీర్, లడఖ్ ప్రజలు తమ ప్రజాస్వామ్య హక్కులను తిరిగి పొందాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. దేశంలో నియంతృత్వ పోకడలతో చెలరేగుతున్న విభజిత శక్తులను ఓడించడమేనని అన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గొప్ప విజయాన్ని సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర హోదాను తిరిగి దక్కించుకోవటం ప్రధానమని, ఆ ప్రయత్నంలో కాశ్మీరీయులకు కాంగ్రెస్ అండగా నిలవనుందని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఒక రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడం ఇదే తొలిసారని ఆయన గుర్తు చేశారు. కశ్మీర్ ప్రజలతో తనకు చాలా లోతైన సంబంధం ఉందని, ఇక్కడికి రావడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుందని చెప్పారు. దేశ ప్రజల నమ్మకాన్ని మోదీ వమ్ముచేశారని మండిపడ్డారు.

బీజేపీ వ్యూహాలు..
ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే బరిలో దిగనుంది. కాగా, ఈ ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ.. గతంలో ఆ రాష్ట్రంలో కీలక పాత్ర పోషించిన రామ్ మాధవ్‌ను, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ఎన్నికల ఇన్‌ఛార్జులుగా నియమించింది. జమ్మూ ప్రాంతంలో గట్టి పట్టుసాధించటంతో బాటు కశ్మీర్ లోయలోని రిజర్వుడు సీట్లు సాధించటం ద్వారా గెలుస్తామని ఆ పార్టీ లెక్కలు వేసుకుంటోంది. ఈ క్రమంలోనే 8 స్థానాల్లో ఇండింపెండెంట్‌లకు మద్దతు నివ్వాలని బీజేపీ భావిస్తోంది. ఇక.. రాష్ట్రంలో కీలక పార్టీలుగా ఉన్న ఎన్సీపీ, పీడీపీలు ఉమ్మడిగా పోటీ చేయాలని భావిస్తుండగా, తాజాగా కాంగ్రెస్ కూడా కూటమిలో చేరనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. గులాం నబీ ఆజాద్ పార్టీ అయిన డెమొక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ ఆజాద్‌ పార్టీతో కొన్నిచోట్ల పరోక్షంగా అవగాహన కుదుర్చుకునే దిశగా కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.

Related News

India VS Pakistan: పవర్‌ఫుల్‌గా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్! యుద్ధం ఖాయమేనా?

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

KCR Campaign: జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ రానట్లేనా?

CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌లో.. కాంగ్రెస్ త్రిముఖ వ్యూహం

Donald Trump: ఎవరీ జొహ్రాన్‌ మమ్దానీ? న్యూయార్క్ మేయర్ బ్యాక్ గ్రౌండ్ ఇదే

Suicide Incidents: బతకండ్రా బాబూ! అన్నింటికీ ఆత్మహత్యే పరిష్కారమా?

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Jubilee Hills Bypoll: నవంబర్ సెంటిమెంట్.. బైపోల్స్‌లో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా!

Big Stories

×