Tamil Nadu political crisis: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర రాజకీయం అత్యంత ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన స్పష్టమైన మెజారిటీని సాధించలేకపోయింది. ఈ క్రమంలో టీవీకే ప్రభుత్వానికి అన్నాడీఎంకే (AIADMK) మద్దతు ఇస్తుందంటూ సోషల్ మీడియాలో.. రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగింది. అయితే ఈ వార్తలపై అన్నాడీఎంకే అధిష్ఠానం స్పందిస్తూ కీలక ప్రకటన చేసింది.
విజయ్ పార్టీకి తాము మద్దతు ఇస్తున్నట్లు వస్తున్న వార్తలను అన్నాడీఎంకే ముఖ్య నేత కేపీ మునుస్వామి ఖండించారు. టీవీకేకు మద్దతు ఇవ్వబోతున్నామనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ విజయ్ పార్టీకి అన్నాడీఎంకే మద్దతు ఇస్తే ప్రభుత్వం సుస్థిరంగా మారుతుందని అంతా భావించినప్పటికీ.. మునుస్వామి ప్రకటనతో ఆ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో టీవీకేకు మద్దతు ఇచ్చేది లేదని ఆయన తేల్చి చెప్పారు.
Read Also: తమిళనాట హుందాతనం.. కేరళలో విజ్ఞత.. మన దగ్గర ఈ తిట్ల పురాణం ఏంటి?