Telugu Politics: ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలు రాజకీయాలని అందరూ అంటుంటారు. కానీ, నేడు తెలుగు రాష్ట్రాల్లో ఆ పట్టుకొమ్మలు ‘వ్యక్తిగత దూషణలు’ అనే గొడ్డలి దెబ్బలతో బలహీనపడుతున్నాయి. ఒకప్పుడు మేధోమథనానికి, సిద్ధాంతాల పోరాటానికి వేదికలుగా నిలిచిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ క్షేత్రాలు.. నేడు తిట్ల పురాణాలకు, వ్యక్తిగత కక్షలకు అద్దం పడుతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో మన పొరుగున ఉన్న తమిళనాడు, కేరళ రాష్ట్రాలు.. రాజకీయాల్లో హుందాతనాన్ని ప్రదర్శిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం అక్కడి పార్టీలు ప్రదర్శిస్తున్న విజ్ఞత.. తెలుగు రాష్ట్రాలకు గట్టి గుణపాఠమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తమిళనాడు రాజకీయాలు ఒకప్పుడు ఉప్పూ నిప్పులా ఉండేవి. కరుణానిధి (DMK), జయలలిత (AIADMK) మరణం అనంతరం.. ప్రస్తుతం అక్కడి రాజకీయాల్లో హుందాతనం కనిపిస్తోంది. నిన్నటి వరకూ ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్.. తన ప్రత్యర్థులను విమర్శించేటప్పుడు కూడా గౌరవప్రదమైన పదజాలాన్నే వాడుతూ వచ్చారు. అటు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన సినీ నటుడు విజయ్ సైతం ప్రచార సమయంలో సిద్ధాంతపరమైన విమర్శలకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. ఎక్కడా హద్దు దాటి మాట్లాడలేదు. ఎన్నికల ఫలితాల అనంతరం కూడా అక్కడి రాజకీయ పార్టీలు ఈ హుందాతనాన్నే ప్రదర్శించాయి. కొత్తగా వచ్చిన టీవీకే (TVK) పార్టీ గెలవడం ఏంటన్న రీతిలో తమ అక్కసును డీఎంకే గానీ, అన్నా డీఎంకే గానీ వెళ్లగక్కలేదు. ఈవీఎంలపై నిందలు వేయలేదు. ప్రజాతీర్పును గౌరవిస్తున్నట్లు ఎం.కె స్టాలిన్ ప్రకటించడం ఆయన రాజకీయ పరిణితికి అద్దం పట్టింది.
కేరళ విషయానికి వస్తే.. అక్కడి రాజకీయం ఎప్పుడూ ఒక విభిన్నమైన పంథాలో సాగుతుంటాయి. అక్కడ లెఫ్ట్ పార్టీలు (LDF), కాంగ్రెస్ కూటమి (UDF) మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది. కానీ వారి మధ్య జరిగే చర్చల్లో అక్షరాస్యత, ఆరోగ్యం, ఆర్థిక వృద్ధి వంటి అంశాలే కనిపిస్తాయి. ఒకరి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకోవడం లేదా అసభ్య పదజాలంతో విరుచుకుపడటం ఎన్నడు కనిపించదు. ప్రజలు కూడా అలాంటి నేతలను ఆదరించరు. కాబట్టి విమర్శలు చేసే విషయంలో కేరళ నేతలు తమ విజ్ఞతను ప్రదర్శిస్తుంటారు. తాజాగా ఎన్నికల ఫలితాల అనంతరం కూడా కేరళలో ఇది స్పష్టంగా కనిపించింది. లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (LDF) తరపున పదేళ్లపాటు సీఎంగా ఉన్న పినరయి విజయన్.. ఘోర ఓటమిని చవి చూసినా.. ఏమాత్రం సహనం కోల్పోలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF)కు అభినందనలు తెలియజేశారు. ప్రతిపక్షంలో ఉంటూ ఆ పార్టీ ఇచ్చిన హామీలు అమలయ్యేలా పోరాడతామని ఎల్ డీఎఫ్ నేతలు చేసిన ప్రకటనలు.. అక్కడి ప్రజాస్వామ్యబద్దమైన రాజకీయాలకు అద్దం పడుతోంది.
కేరళ, తమిళనాడుతో పోలిస్తే.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వారికి పూర్తి భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత.. రాజకీయ నాయకులు తమ అనుచరులను సంతృప్తి పరచడానికి ప్రత్యర్థులపై దారుణమైన వ్యక్తిగత దాడులకు దిగుతున్నారు. గత కొన్నేళ్లుగా అసెంబ్లీ లోపల, బయట ఉపయోగించే పదజాలం తీవ్ర అభ్యంతరకంగా మారుతోంది. ముఖ్యంగా ఏపీలో ప్రతిపక్ష నేత భార్యను అత్యంత అవమానకరంగా మాట్లాడిన తీరు.. రాజకీయాలు ఏ స్థాయికి దిగజారుతున్నాయో అన్న ఆందోళనను కలిగించింది. ఒకప్పటిలా విధానపరమైన విమర్శలకు తావులేకుండా కులాలు, మతాలు, కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. ఒక పార్టీ ఐటీ సెల్ మరొకరిపై ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం, అసభ్యకరమైన మీమ్స్ సృష్టించడమే రాజకీయంగా భావిస్తున్నారు.
Also Read: చక్రం తిప్పిన రోహిత్.. పాండ్యా, సూర్యకు ఔట్…ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా తెలుగోడు ?
తెలుగునాట రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు, తిట్ల పురణాలు ఎక్కువ కావడం పట్ల ఇక్కడి ప్రజలు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమకు కావాల్సింది అభివృద్ధి, మౌలిక సదుపాయాలు అని.. మీ హీరోయిజం, తిట్లు కాదని సామాన్యులు బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. రాజకీయాల్లో విమర్శ ఉండాలి కానీ, అది ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని సూచిస్తున్నారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాలు రాజకీయాల్లో ఒక ప్రమాణాన్ని పాటిస్తుంటే.. మన దగ్గర మాత్రం రోజు రోజుకు అట్టడుగు స్థానానికి పాలిటిక్స్ వెళ్తున్నాయా? అన్న అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా కేరళ, తమిళనాడు రాష్ట్రాలను పాలిటిక్స్ విషయంలో ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడి రాజకీయ నాయకులు.. తమ శైలిని మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొంటున్నారు. తిట్టిన వాడే నాయకుడు అనే భావన నుంచి, పని చేసేవాడే నాయకుడు అనే దిశగా అడుగులు వేయాలని హితవు పలుకుతున్నారు.
Also Read: హైదరాబాద్‌కు పోటీగా ఖమ్మం స్పోర్ట్స్ హబ్.. భారీ అంతర్జాతీయ క్రీడా మైదానం ఏర్పాటు