JK Assembly Elections: జమ్మూకాశ్మీర్‌లో తొలి విడత ఎన్నికల పోలింగ్ మొదలైంది. దాదాపు పదేళ్ల తర్వాత ఎన్నికలు జరగనుండడంతో ఉదయం ఆరు గంటల నుంచే ఓటర్లు పోలింగ్ స్టేషన్ల వద్ద బారులు తీరారు. మొత్తం 90 అసెంబ్లీ సీట్లకు గాను తొలి విడత 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది.
జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరిగి దశాబ్దం గడుస్తున్నది. పదేళ్ల నుంచి ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగలేవు. ఈ పదేళ్ల కాలంలో జమ్ముకశ్మీర్‌కు సంబంధించి ఎన్నో మార్పులు జరిగాయి. చరిత్రలో నిలిచిపోయే ఘటనలు చోటుచేసుకున్నాయి. 2019లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏలను రద్దు చేసింది. తద్వార జమ్ము కశ్మీర్‌కు ఉన్న స్వయంప్రతిపత్తి తొలగిపోయింది. అలాగే.. జమ్ము కశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఆ తర్వాత ఇక్కడ ఆందోళనలు, ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో కశ్మీర్‌లో భద్రతా బలగాలను దింపింది. కొన్ని నెలలపాటు ఇక్కడ వీధుల్లో ఆర్మీ మాత్రమే కనిపించింది. సామాన్య పౌరులు కూడా బయట అడుగుపెట్టే పరిస్థితులు లేవు. కొందరైతే.. జమ్ము కశ్మీర్‌ను బహిరంగ చెరసాలగా వర్ణించారు.
ఆ తర్వాత జమ్ము కశ్మీర్ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేపట్టారు. నియోజకవర్గాల పరిధి, పరిమాణాలు మారిపోయాయి. రిజర్వేషన్లూ మారిపోయాయి. అక్కడి ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల వ్యవస్థలో మార్పులు వచ్చాయి. రాష్ట్రం.. కేంద్రపాలిత ప్రాంతాలుగా మారే భౌగోళిక మార్పే కాదు.. రాజకీయ, సాంఘిక మార్పులు కూడా చోటుచేసుకున్నాయి. ఈ మార్పులతో కొన్ని వర్గాలు సాధికారులుగా మారితే.. మరికొన్ని ఆత్మరక్షణలో పడిపోయాయి. ఇలాంటి అనేక మార్పుల తర్వాత ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.
370, 35ఏ అధికరణాల రద్దు తర్వాత.. రాజకీయ నాయకుల గృహనిర్బంధాల నుంచి విడిచిపెట్టాక, మిలిటరీ బలగాలు తగ్గాక.. స్థానిక నాయకులంతా కలిసి గుప్కార్ అలయెన్స్‌గా ఏర్పడ్డారు. రాష్ట్రానికి తిరిగి ఆర్టికల్ 370 పునరుద్ధరణను లక్ష్యంగా పెట్టుకున్నాయి. కానీ, ఆ అలయెన్స్ ఎక్కువకాలం మనలేదు. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ అలయెన్స్ అభ్యర్థులు వారికి వారే పోటీ పడ్డారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అలయెన్స్ లేదు. స్థానిక పార్టీలు ముఖ్యంగా ఎన్‌సీ, పీడీపీలు ఉనికిని కాపాడుకునే స్థితిలో ఉన్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కాంగ్రెస్‌తో ఎన్నికలకు ముందే పొత్తును ప్రకటించాయి. ఈ రెండు పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి బరిలోకి దిగనున్నాయి. కొన్ని స్థానాల్లో ఈ పార్టీల అభ్యర్థుల మధ్య ఫ్రెండ్లీ పోటీ ఉండనుంది. ఇక పీడీపీ మాత్రం ఒంటరిగా పోటీ చేస్తున్నది. తాము కూటమిలో చేర్చుకోవడానికి పీడీపీ కోసం ఎప్పుడూ తమ ద్వారాలు తెరిచే ఉంచుతామని ఎన్‌సీ చెప్పింది. కానీ, అది జరగడం లేదు.
Also Read: Tammareddy Bharadwaj: త్రివిక్రమ్ పై పూనమ్ ఫిర్యాదు.. మేము ఏం చేయలేం
ఇక బీజేపీకి ఇది లిట్మస్ టెస్టుగా ఉన్నది. 370 అధికరణ రద్దు తర్వాత తక్కువ సమయంలోనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీ దారుణంగా ఓడిపోయేదని, ప్రజా వ్యతిరేకత స్పష్టంగా ఓటు రూపంలో వ్యక్తమయ్యేదని విమర్శలు అంటుండేవారు. కానీ, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, శాంతి భద్రతలు ఇలా అనేక కారణాల రీత్యా ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఎలాంటి తీర్పు వస్తుందా? అనేది ఆసక్తిగా ఉన్నది. అయితే, లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడి నుంచి 24 శాతం ఓటు షేర్‌తో రెండు ఎంపీ సీట్లు గెలుచుకోగా.. ఎన్‌సీ 22 శాతం ఓటు శాతంతో రెండు ఎంపీ సీట్లను సాధించుకుంది. ఒక స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. 2019లో బీజేపీ ఇక్కడి ఆరు సీట్లల్లో మూడు సీట్లు 46.67 ఓట్ల శాతంతో గెలుచుకోవడం గమనార్హం. మరి ఇప్పుడు ఎలా ఉంటుందనేది చూడాల్సి ఉన్నది. బుధవారం తొలి దశ పోలింగ్ జరగనుంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో 24 స్థానాలకు ఈ దశలో ఎన్నికలు జరుగుతాయి.