ఆన్ లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్ లకు ఇకపై అమాయకుల ప్రాణాలు బలికాకుండా కేంద్రం తీసుకొచ్చిన కీలక బిల్లుకి లోక్ సభ ఆమోదం తెలిపింది. ‘ది ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు-2025’ పేరుతో దీన్ని లోక్ సభలో ప్రవేశ పెట్టారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ బిల్లుని ప్రవేశపెట్టగా, మూజువాణి ఓటుతో దీన్ని లోక్ సభ ఆమోదించింది. రాజ్యసభలో లాంఛనం పూర్తయిన తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే ఈ బిల్లు చట్టంగా మారుతుంది.
కీలక అంశాలు..
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు బానిసలుగా మారుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుండటంతో కేంద్రం ఈ బిల్లుని తెరపైకి తెచ్చింది. ఆన్‌లైన్ ఫాంటసీ గేమ్స్, పోకర్, రమ్మీ, ఇతర కార్డ్ గేమ్స్, ఆన్‌లైన్ లాటరీలు, సట్జా, జువా వంటి ఆన్ లైన్ జూదాలను ఈ బిల్లు నిషేధించింది. నిషేధాన్ని ఉల్లంఘించిన వారికి మూడేళ్లు జైలు శిక్ష, గరిష్టంగా కోటి రూపాయల వరకు జరిమానా విధించబడుతుంది. అయితే ఆన్‌లైన్ గేమ్స్, ఈ-స్పోర్ట్స్ మధ్య ఉన్న సున్నిత విభజన రేఖను ఈ బిల్లు గుర్తించింది. ఈ స్పోర్ట్స్ కి ఈ నిషేధం వర్తించదు. డబ్బు ప్రమేయం ఉన్న ఆన్ లైన్ గేమ్స్ ని మాత్రమే ఈ బిల్లు నిషేధించింది.
ఆ పప్పులు ఉడకవు..
బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలకు కూడా ఈ బిల్లు షాకిచ్చింది. ఇలాంటి యాప్స్ ని ప్రోత్సహించి, తమకు తెలియదంటే ఇకపై కుదరదు. ఆయా ఆన్ లైన్ గేమ్స్ కి సంబంధించిన అడ్వర్టైజ్ మెంట్లలో భాగస్వాములైన వారికి గరిష్ఠంగా రెండేళ్ల జైలుశిక్ష విధించేలా బిల్లు రూపొందించారు. వారికి రూ.50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ఆన్ లైన్ గేమ్స్ కి సంబంధించిన ఆర్థిక లావాదేవీల్లో ప్రమేయం ఉన్నవారికి కూడా గరిష్ఠంగా మూడేళ్ల శిక్ష, రూ.కోటి వరకు జరిమానా విధిస్తారు.
ఆటగాళ్లపై కనికరం..
అయితే ఆన్‌లైన్ మనీ గేమ్స్ ఆడేవారిని నేరస్థులుగా కాకుండా.. బాధితులుగా ఈ బిల్లులో పేర్కొనడం విశేషం. ఆన్ లైన్ గేమ్ లు ఆడుతున్న వారిపై చర్యలు తీసుకోరు. వారిని హెచ్చరించి వదిలేస్తారు, వారిని కేవలం బాధితులుగా మాత్రమే పరిగణిస్తారు. అయితే ఈ గేమ్ ల రూపకల్పన, వాటి నిర్వహణ, ప్రచారం వంటి విషయాల్లో మాత్రం ఎవరిపై కూడా బిల్లు కనికరం చూడలేదు.
అది కూడా కష్టం..
ఆన్ లైన్ గేమ్స్ పట్ల నిరక్షరాశ్యులు కూడా ఆసక్తి చూపించడానికి ప్రధాన కారణం ఫ్లెక్సిబిలిటీ. ఎవరైనా ఆన్ లైన్ లో గేమ్స్ ఆడొచ్చు, బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకుంటే చాలు క్యాష్ ట్రాన్సాక్షన్స్ కూడా సులభంగా జరుగుతాయి. అయితే ఈ ట్రాన్సాక్షన్స్ ని కూడా ఈ బిల్లు ద్వారా కేంద్రం కట్టడి చేస్తోంది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా నిధులు సులభంగా బదిలీ చేసేందుకు వీలు లేకుండా ఈ బిల్లు నిరోధిస్తుంది. లావాదేవీలు సులభంగా లేకపోతే ఎవరూ ఈ బెట్టింగ్ యాప్ ల జోలికి వెళ్లరని కేంద్రం భావిస్తోంది.