PM Removal Bill: ప్రజల కోసం రకరకాల చట్టాలను తీసుకొస్తోంది కేంద్రప్రభుత్వం. కానీ ప్రజాప్రతినిధులకు మాత్రం పెద్దగా చట్టాలు లేవు. తాజాగా కేంద్రం కొత్త చట్టానికి పదును పెడుతోంది. తీవ్రమైన కేసుల్లో జైలుకి వెళ్లే ప్రజాప్రతినిధుల పదవులకు చెక్ పెట్టేందుకు కొత్త చట్టం తీసుకురానుంది.
ప్రధానమంత్రి మొదలు కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్రాల మంత్రులు తీవ్రమైన నేరాల కిందట అరెస్టయి నెల రోజుల పాటు జైల్లో ఉంటే అటోమేటిక్‌గా పదవి రద్దు కానుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ బిల్లును బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు.
దేశంలో ఎన్ని కొత్త చట్టాలు వచ్చినా రాజకీయ నేతలు మాత్రం తప్పించుకుంటూనే ఉన్నారు. చట్టంలోని లొసుగులను తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. తీవ్రమైన నేరాల ఆరోపణలతో అరెస్టయి నెల రోజులు జైలులో ఉంటే ప్రధానమంత్రి మొదలు కేంద్ర మంత్రి,ముఖ్యమంత్రులు, రాష్ట్రాల మంత్రులను పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే బిల్లు ఇది.
దీన్ని బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్టు కేంద్రమంత్రి హోం మంత్రి అమిత్ షా. ఐదేళ్ల శిక్ష పడే నేరానికి పాల్పడితే 31 రోజున వారి పదవి పోయేలా నిబంధనను ఈ బిల్లులో చేర్చారు. ఆయా నేతలు రాజీనామా చేయకపోయినా కొత్త నిబంధన ప్రకారం తమ పదవులను కోల్పోతారు.
ALSO READ: ఉపరాష్ట్రపతి పోరు.. చివరి నిమిషంలో ట్విస్ట్, క్రాస్ ఓటింగ్ తప్పదా?
తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న వారిని తొలగించడానికి రాజ్యాంగంలో ఇంతవరకు నిబంధనలు లేవన్నది ఈ బిల్లు మాట. వాటిలో హత్య, భారీగా అవినీతి వంటి తీవ్రమైన నేరాలు ఈ చట్టం పరిధిలోకి రానున్నాయి. ఈ చట్టం కోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 75, 164, 239AA లకు సవరణలు చేయనుంది కేంద్రం.
ఈ బిల్లుపై అప్పుడే ప్రతిపక్షాల నుంచి విమర్శలు మొదలయ్యాయి. పదవిలో ఉన్న రాజకీయ నేతలను కాపాడేందుకు తీసుకొస్తున్న బిల్లుగా వర్ణిస్తున్నారు. దీనివల్ల కేంద్రానికి అధికారాలు దక్కనున్నట్లు చెబుతున్నారు. ఎందుకంటే కీలకమైన దర్యాప్తు సంస్థలు కేంద్రం చేతులో ఉన్నాయని అంటున్నారు. ఎప్పుడైనా రాష్ట్రంలో నచ్చని ప్రభుత్వాలపై కేంద్రం కొరడా ఝులిపించే ఛాన్స్ ఉంది.
లిక్కర్ కేసులో చిక్కుకున్న ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు మాజీ మంత్రి సెంథిల్ బాలాజీలపై కేసులు నమోదు అయ్యాయి. జైలుకి వెళ్లిన తర్వాత కొద్దిరోజులు ఆ పదవిలో కంటిన్యూ అయ్యారు. ఆ తర్వాత తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ బిల్లును తీసుకొస్తుందని అంటున్నాయి కాంగ్రెస్ మిత్రపక్షాలు.