Online Gaming Bill: ప్రధాని మోదీ చైనా టూర్ నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకుంటుందా? గడిచిన ఆరేళ్లు ఆన్‌లైన్ బెట్టింగుల పేరుతో వేల కోట్ల చైనాకు తరలిపోయాయా? ఈ తరహా గేమ్స్ అక్కడి నుంచి మొదలయ్యాయా? ఈ ఉచ్చులో పడి చాలామంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారా? ఇకపై వాటికి ఫుల్‌స్టాప్ పడనుందా? అవుననే అంటున్నాయి కేంద్రప్రభుత్వ వర్గాలు.
ఆన్‌లైన్ బెట్టింగులు పేరు ఎత్తేసరికి ముందుగా చైనా పేరు గుర్తుకు వస్తుంది. ఎందుకంటే కరోనా మొదలు నేటి వరకు వేల కోట్ల రూపాయలు ఆదేశానికి తరలిపోయినట్టు ప్రభుత్వాలు బలంగా నమ్ముతున్నాయి. ఈ విషయాన్ని దర్యాప్తు సంస్థలు తెలిపాయి. దీని ఉచ్చులోపడి చాలామంది జీవితాలను నాశనం చేసుకున్నారు. బయటపడలేక ఈ లోకాన్ని విడిచిపెట్టిన సందర్భాలు లేకపోలేదు.
వీటిని దృష్టిలో పెట్టుకున్న కేంద్రప్రభుత్వం ఆన్‌లైన్ బెట్టింగులపై కొత్త బిల్లు తీసుకొచ్చింది. ఈ మేరకు మోదీ కేబినెట్ భేటీలో ఓకే చేయడం జరిగిపోయింది. రేపోమాపో పార్లమెంటుకు ఈ బిల్లు రానుంది. అందులో ఉన్న అంశాలేంటి? అన్నదే అసలు పాయింట్.
పార్లమెంటులో పెట్టనున్న ఈ బిల్లులో కీలక అంశాలేంటి? రియల్ మనీ ఆన్‌లైన్ గేమింగ్ సంస్థలు, బాధ్యులకు మూడేళ్ల కఠిన జైలు శిక్ష పడనుంది. అంతేకాదు కోటి వరకు జరిమానా విధించనున్నారు. ఇలాంటి కార్యకలాపాలకు పదేపదే పాల్పడితే ఐదేళ్ల వరకు జైలు శిక్ష తప్పదు. ఆన్‌లైన్ గేమింగ్ ప్రచారం చేసే వ్యక్తులు, సంస్థలకు రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించనున్నారు.
ALSO READ: చిన్నారులపై వీధి కుక్కల బీభత్సం.. డాగ్ లవర్స్ ఎక్కడ?
అలాగే 50 లక్షల వరకు జరిమానా కూడా. గేమింగ్ సంబంధిత నిధులను ప్రాసెస్ చేయకుండా బ్యాంకులు, ఆర్థిక సంస్థలపై నిషేధం విధిస్తారు. ఈ తరహా వాటిని ప్రోత్సహించే ప్లాట్‌ఫాంలకు వాణిజ్య ప్రకటనలను పూర్తిగా నిషేధించనున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే అక్రమ గేమింగ్ ప్లాట్‌ఫాంలపై ఉక్కుపాదం మోపుతారు.
ఇ–స్పోర్ట్స్, క్యాండీ క్రష్ వంటి ఆన్‌లైన్ గేమ్స్ వంటివి ఇతోధికంగా ప్రోత్సహించే అవకాశం ఉంది. ఇలాంటి గేమ్స్ ఆడేవారిని శిక్షల పరిధి నుంచి తప్పించారు. బాధితులుగా పరిగణించాలని నిర్ణయించారు. ఆన్‌లైన్ గేమింగ్ రంగానికి నోడల్ రెగ్యులేటర్‌గా ఎలక్ట్రానిక్స్-ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకి అధికారం కల్పించనుంది ఈ బిల్లు.
దేశంలో పని చేస్తున్న ఏదైనా నమోదుకాని లేదా చట్టవిరుద్ధమైన సైట్‌ను బ్లాక్ చేసే అధికారం ఉండనుంది. 2023 అక్టోబర్‌లో ప్రభుత్వం ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లపై 28శాతం GST పరిధిలోకి తెచ్చారు. ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫాంలను నిషేధించేందుకు మోదీ సర్కారు చర్యలు తీసుకుంటూ వస్తోంది. దాదాపు 1500 ప్లాట్‌ఫాంలను నిషేధించింది కూడా.
ఆన్‌లైన్ గేమ్‌ల గెలుపోటములపై 30 శాతం పన్ను విధించబడుతుంది. విదేశీ గేమింగ్ ఆపరేటర్లను కూడా భారత చట్టాల పరిధిలోకి తెచ్చారు. దీని బారినపడి తెలుగురాష్ట్రాల్లో చాలామంది జీవితాలు నాశమయ్యాయి. కొందరు బయటపడలేక ఈ లోకాన్ని విడిచిపెట్టారు. దీనిపై ఐపీఎస్ అధికారి సజ్జనార్ ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పించేందుకు తీవ్ర కృషి చేశారు.. చేస్తున్నారు కూడా. అయినా జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. కొత్త చట్టం తీసుకురావడంతో కంట్రోల్ పడుతుందని భావిస్తున్నారు.