Delhi: దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులకు కొత్త టెన్షన్ మొదలైందా? రోజుకు 54 మంది చొప్పున మిస్సింగ్ అవుతున్నారా? అందులో మూడింట రెండొంతులు మహిళలే ఉన్నారా? వారిని ఎవరైనా కిడ్నాప్ చేస్తున్నారా? వారి వారి కుటుంబ సభ్యుల్లో టెన్షన్ మొదలైందా? అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది.
ఢిల్లీ పోలీసులకు కొత్త టెన్షన్.. రోజుకు 54 మంది మిస్సింగ్
దేశ రాజధాని ఢిల్లీ అంటే చెప్పనక్కర్లేదు. చీమ చిటుక్కుమన్నా క్షణాల్లో ఇట్టే తెలిసిపోతుంది. అడుగడుగునా సీసీటీవీ కెమెరాలు ఒకవైపు, పోలీసులు మరోవైపు కనిపిస్తుంటారు. ఇంకోవైపు వీఐపీల రాకపోకలు, విదేశీ ప్రముఖులతో నిత్యం కళకళలాడుతోంది. అదే సమయంలో ఊహించని వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో శాంతిభద్రతలపై కొత్త ఆందోళన మొదలైంది.
రోజుకు 54 మంది చొప్పున మిస్సింగ్ అవుతున్నట్లు తేలింది. 2026 ఏడాది ప్రారంభమైన మొదటి 15 రోజుల్లో ఏకంగా 800 మందికి పైగా అదృశ్యమైనట్లు పోలీసు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అందులో మూడింట రెండొంతుల మంది మహిళలు, టీనేజ్ యువతులు, బాలికలే ఉన్నారు.
ప్రతీ ఏటా పెరుగుతున్న మిస్సింగ్ కేసులు
జనవరి ఒకటి నుంచి 15 మధ్య కాలంలో 807 మంది అదృశ్యమయ్యారు. రోజుకు సగటున 54 మంది ఆచూకీ లేకుండా పోతున్నారు. అందులో 509 మంది మహిళలు, టీనేజీ యువతులు, బాలికలు ఎక్కువగా ఉన్నారు. మరో 298 మంది పురుషులు ఉన్నారు. అదృశ్యమైన వారిలో 191 మంది మైనర్లు ఉన్నారు. 616 మంది పెద్దవాళ్లు ఉన్నారు.
పోలీసులు ఇప్పటివరకు 235 మందిని మాత్రమే గుర్తించారు. మిగతా 572 మంది ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. చిన్నారుల విషయానికి వద్దాం. జనవరి ఒకటి నుంచి 15 వరకు సగటున ప్రతీ రోజు 13 మంది పిల్లలు అదృశ్యమవుతున్నారు.191 మంది మైనర్లలో 146 మంది బాలికలు ఉన్నారు.
ఇక టీనేజర్ల విషయానికి వద్దాం. 169 మంది టీనేజర్లు ఉన్నారు. వారిలో 138 మంది అమ్మాయిలు కాగా, 31 మంది అబ్బాయిలు ఉన్నారు. వీరిలో కేవలం 29 మంది అమ్మాయిలు, 19 మంది అబ్బాయిల ఆచూకీ లభించింది. టీనేజర్లలో 71 శాతం మంది ఆచూకీ లభించలేదు.
ALSO READ: న్యాయపోరాటానికి సిద్ధమైన అగ్నికన్య.. లాయర్ కోటు ధరించి మమత
మిస్సింగ్ అవుతున్నవారిలో 8 – 12 ఏళ్ల వయస్సు పిల్లలు ఉన్నారు. ఎనిమిది మంది అబ్బాయిలు, ఐదుగురు అమ్మాయిలు సహా 13 మంది పిల్లలు తప్పిపోయారు. కేవలం ముగ్గురు అబ్బాయిలు మాత్రమే గుర్తించారు. మిగిలినవారి ఆచూకీ తెలియరాలేదు. ఎనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లల్లో తొమ్మిది కేసులు నమోదయ్యాయి. పోలీసులు ముగ్గుర్ని గుర్తించారు. ఇంకా ఆరుగురు పిల్లల ఆచూకీ తెలియలేదు.
మిస్సింగ్ కేసుల్లో పెద్దవాళ్లు ఎక్కువ మంది ఉన్నారు. జనవరి ఒకటి నుంచి 15 రోజుల్లో 616 మంది పెద్దవారు తప్పిపోయినట్లు తేలింది. వారిలో 363 మంది మహిళలు, 253 మంది పురుషులు ఉన్నారు. ఇప్పటివరకు పోలీసులు 91 మంది మహిళలు, 90 మంది పురుషులను గుర్తించారు. ఇంకా 435 మంది ఆచూకీ తెలియాల్సివుంది.
గతేడాది ఢిల్లీలోని వివిధ ప్రాంతాల పోలీసుస్టేషన్లలో 24,508 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. అందులో 60 శాతానికి పైగా మహిళలు ఉన్నారు. 14, 870 మంది మహిళలు కనిపించలేదు. ఒకేడాదిలో అత్యధికంగా నమోదైన కేసులు 14,870. పురుషుల మిస్సయిన కేసులు 9,638. పోలీసులు ఇప్పటివరకు 15,421 మందిని గుర్తించారు.
అందులో ఇంకా 9,087 కేసులు పరిష్కారం కాలేదు. గత పదేళ్లలో డేటాను పరిశీలిస్తే ఢిల్లీలో అదృశ్యమయ్యే వారి సంఖ్య ప్రతీ ఏటా పెరుగుతోంది. దశాబ్ద కాలంలో 2,32,737 మంది అదృశ్యమయ్యారు. సుమారు 1.8 లక్షల మందిని గుర్తించారు. 52 వేల కేసులు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి.