DK Shivakumar: కర్ణాటక రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సీఎంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డి.కె. శివకుమార్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణమైంది. జూన్ 3వ తేదీన ఆయన కర్ణాటక సీఎంగా ప్రమాణం చేయడం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే ఆ తేదీనే డీకే ఎందుకు ఎంచుకున్నారన్న ప్రశ్నకు.. ఆసక్తికర సమాధానాలు వెలువడుతున్నాయి.
డి.కె. శివకుమార్‌కు దైవభక్తి, జ్యోతిష్యంపై అపారమైన నమ్మకం ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ఏ ముఖ్యమైన పని ప్రారంభించినా పంచాంగం, ముహూర్తాలను ఖచ్చితంగా పాటిస్తారు. జూన్ 3వ తేదీన అత్యంత బలమైన, అనుకూలమైన ‘శుభ ముహూర్తం’ ఉందని ఆ రోజున ప్రమాణ కార్యక్రమాన్ని నిర్వహిస్తే భవిష్యత్తులో అంతా మంచి జరుగుతుందని డీకే ఆస్థాన జ్యోతిష్యుడు బెల్లూర్ ద్వారకానాథ్ సూచించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. తన రాజకీయ ప్రయాణంలో ఎలాంటి అడ్డంకులు రాకూడదనే ఉద్దేశంతోనే గ్రహాల అనుకూలతను చూసుకుని జూన్ 3వ తేదీనే డీకే ఖరారు చేసినట్లు సమాచారం.
ఈ కార్యక్రమానికి జూన్ 3వ తేదీని ఖరారు చేయడానికి మరో ముఖ్య కారణం కూడా ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జూన్ 3వ తేదీన తన అపాయింట్ మెంట్ ఇచ్చినట్లు సమాచారం. దీనికి తోడు రాహుల్ గాంధీ స్వయంగా హాజరైతే ఈ కార్యక్రమానికి మరింత మైలేజ్ తో పాటు. పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వస్తుందని డీకే శివకుమార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధినాయకత్వం సమక్షంలోనే ఈ కార్యక్రమం ఘనంగా జరిగితే కాంగ్రెస్ శ్రేణుల నుంచి సైతం సీఎంగా తన పాలనకు మద్దతు లభిస్తుందని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 3వ తేదీన సీఎంగా ప్రమాణం.. అటు పార్టీ పరంగా, ఇటు గ్రహబలం పరంగా డీకేకు బాగా కలిసొచ్చిందని చెప్పవచ్చు.
Also Read: గుంపు మేస్త్రీపై పోరాటానికి.. ప్రజలు సిద్ధం కావాలి.. కల్వకుంట్ల కవిత పిలుపు
విశ్వసనీయ వర్గాలు సమాచారం ప్రకారం డీకే శివకుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమం చాలా నిరాడంబరంగా జరగనుంది. ఆ రోజున డీకేతో పాటు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేస్తారని తెలుస్తోంది. దళిత, మైనారిటీ వర్గాలకు చెందిన ఇద్దరు నేతలు ఆ రోజున డిప్యూటీ సీఎంలుగా బాధ్యతలు చేపడతారని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. మరోవైపు డీకే శివకుమార్ కేబినేట్ లో మాజీ సీఎం సిద్దరామయ్య కుమారుడు యతీంద్రకు కీలకమైన మంత్రి పదవి సైతం దక్కే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.
Also Read: జియో యూజర్లకు షాక్.. మాయమైన బడ్జెట్ ప్లాన్లు.. అసలేం జరిగిందంటే?