Election Commission: కొత్త ఓటర్లు తమ పేర్లు నమోదు చేసుకునే క్రమంలో వారి తల్లిదండ్రుల వివరాలను సమర్పించాలనే నిబంధనపై ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఈ నిబంధన కొత్తగా ప్రవేశపెట్టినది కాదని తెలిపింది. ఓటర్ల జాబితాలో పారదర్శకత, కచ్చితత్వం కోసం అమలు చేస్తున్నామని స్పష్టం చేసింది.
ఎన్నికల సంఘం క్లారిటీ-తెలుగు రాష్ట్రాలతోపాటు వివిధ రాష్ట్రాల్లో సర్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-SIR లో చేర్చని ప్రస్తుత ఓటర్లు కాకుండా, ఓటర్ల జాబితాలో చేరాలని భావించే కొత్త దరఖాస్తుదారులు తమ తల్లిదండ్రుల వివరాలు సమర్పించాలని ఈసీ అధికారులు తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లను ఒక పోలింగ్ కేంద్రం పరిధిలోకి తీసుకురావడం దీని ఉద్దేశమని తెలిపారు.
కొత్త ఓటర్లతో పేరెంట్స్ వివరాలు సేకరణ-వెరిఫికేషన్ ప్రక్రియను సులభతరం చేయడమే అందుకు కారణమని పేర్కొన్నారు. కొత్త ఓటర్లు ఫామ్-6 ద్వారా దరఖాస్తు చేసుకొనేటప్పుడు తమ తల్లిదండ్రుల పేర్లు ఓటర్ల జాబితాలో ఉన్నాయో లేదో డిక్లేర్ చేయాల్సి వుంది. పాత ఓటరు రికార్డులతో కొత్తగా దరఖాస్తు చేసుకునేవారిని అనుసంధానించడం వల్ల నకిలీ ఓట్లకు అడ్డుకట్ట వేయవచ్చన్నది అధికారుల ఆలోచన.
బీహార్‌లో ఆ పద్దతి సక్సెస్, అందుకే-గతేడాది ఈ పద్దతిని బీహార్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది ఎన్నికల సంఘం. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-ఎస్ఐఆర్ ప్రక్రియ వల్ల ఏకంగా 47 లక్షల నకిలీ ఓట్లు తొలగించినట్టు వివరించారు. ఆ రాష్ట్ర ఓటర్లలో దాదాపు 6 శాతానికి సమానం.
ALSO READ: ట్విస్ట్ అంటే ఇది.. పెన్షన్ డబ్బుల కోసం వెళ్తే.. అకౌంట్లో రూ.759 కోట్లు! చూసి షాకైన వృద్ధుడు
బీహార్‌లో ఆ ప్రణాళిక సక్సెస్ కావడంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో భాగంగా అన్ని రాష్ట్రాలు-కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ పద్దతిని విస్తరిస్తామని తెలిపింది. ఇంటింటికీ వెళ్లి బూత్ స్థాయి అధికారులు సర్వే చేస్తున్నారు. మరణించినవారు, వలస, డూప్లికేట్ ఓటర్ల వివరాలను సేకరించి జాబితా నుంచి తొలగిస్తున్నారు.
ఈ ప్రక్రియ అంతా రాజ్యాంగబద్ధంగా జరుగుతుందని స్పష్టం చేసింది ఈసీ. అర్హులైన ఏ ఒక్కరు ఓటు హక్కును కోల్పోకుండా చూస్తామని తెలియజేసింది. ఏమైనా పత్రాలు సమర్పించలేకపోయినా సరిదిద్దుకోవడానికి తగిన సమయం ఇస్తామని వెల్లడించారు. రాబోయే ఎన్నికల నాటికి కచ్చితమైన ఓటర్ల జాబితాను సిద్ధం చేయడమే తమ లక్ష్యమని వ్యక్తం చేశారు.