Manmohan Singh: భారతదేశ ప్రజాస్వామ్యంలో వ్యవస్థల పట్ల ఒక దేశ ప్రధాని ఎంతటి ఉన్నతమైన గౌరవాన్ని ప్రదర్శించవచ్చో చాటిచెప్పే అద్భుతమైన సంఘటన ఇది. మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) ఎస్.వై. ఖురేషీ తన సరికొత్త పుస్తకం ‘ఇండియా అండ్ ఐ: ఎ హండ్రెడ్ మెమొరీస్, నాట్ ఎ మెమోయిర్’ ద్వారా నాటి ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు.
వివాదానికి కారణమైన మంత్రుల వ్యాఖ్యలు
2012 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ ఒక పెద్ద ప్రకటన చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ముస్లింలకు ఉద్యోగాల కోటాను 4.5% నుండి 9% కి పెంచుతామని హామీ ఇచ్చారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఇలాంటి హామీలు ఇవ్వడం నిబంధనల ఉల్లంఘనేనంటూ బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన ఎన్నికల సంఘం, ఖుర్షీద్‌ను తీవ్రంగా హెచ్చరించింది. అయితే, ఈ చర్యను జీర్ణించుకోలేని కొందరు కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘంపై విమర్శలు మొదలుపెట్టారు. ఈ ‘చిల్లర మాటలు’ ఖురేషీని తీవ్రంగా కలచివేసాయి.
‘నేను ఆత్మహత్య చేసుకుంటాను’- కలవరపడ్డ ప్రధాని
ఈ పరిణామాలపై ఖురేషీ తన ఆవేదనను ప్రధాని ప్రెస్ సెక్రటరీ హరీష్ ఖారే వద్ద పంచుకున్నారు. మరుసటి రోజే ఈ విషయం అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ వద్దకు చేరింది. వెంటనే స్పందించిన ప్రధాని, ఖురేషీని అత్యవసరంగా తన నివాసానికి పిలిపించుకున్నారు. ఆ సాయంత్రం భేటీలో మన్మోహన్ సింగ్ ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. ఖురేషీతో అంటూ.. ‘నా ప్రభుత్వం గురించి మీరు అలా అనుకుంటే, నేను ఆత్మహత్య చేసుకుంటాను’ అని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
షాక్‌కి గురైన ఖురేషీ..
ఆ మాటలకు ఖురేషీ ఒక్కసారిగా షాక్ అయ్యారు. తాను కేవలం కొందరు మంత్రుల ప్రవర్తన గురించే మాట్లాడానని, ప్రధానిని తప్పుబట్టలేదని వివరించి ఆయనను శాంతింపజేయడానికి ఖురేషీకి కొన్ని నిమిషాల సమయం పట్టింది. చివరకు మన్మోహన్ సింగ్ శాంతించి, ‘నాకు ఈ విషయం అస్సలు తెలియదు. ఇకపై ఎలాంటి సమస్య వచ్చినా నేరుగా నాకు ఫోన్ చేయండి’ అని హామీ ఇచ్చారు.
ప్రజాస్వామ్యానికి ఎన్నికల సంఘమే ఆత్మ..
ఆ సందర్భంలో మన్మోహన్ సింగ్ అన్న మాటలను ఖురేషీ ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు. ‘ఎన్నికల సంఘం కేవలం భారతదేశ గర్వకారణం మాత్రమే కాదు.. అది మన ప్రజాస్వామ్యానికే ఆత్మ.. దానిని కోల్పోతే మనం అంతా కోల్పోయినట్టే’ అని ప్రధాని అన్నారు.
ఈ భేటీ జరిగిన తర్వాత ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ నేతల విమర్శలు పూర్తిగా ఆగిపోయాయి. అధికార మదంతో కాకుండా, వ్యవస్థల పట్ల అత్యంత బాధ్యతగా, సున్నితంగా వ్యవహరించిన మన్మోహన్ సింగ్ లాంటి అరుదైన నాయకుడిని తాను చూడలేదని ఖురేషీ తన పుస్తకంలో కొనియాడారు.