Kulgam Terror Attack: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు మళ్లీ తమ పాత రాక్షస క్రీడను తెరపైకి తెచ్చారు. శుక్రవారం సాయంత్రం కుల్గాం జిల్లాలోని కెల్లం ప్రాంతంలో ఉన్న ఒక ఇటుక బట్టీ వద్ద పనిచేస్తున్న వలస కూలీలపై హఠాత్తుగా విరుచుకుపడ్డారు. ముందుగా వారి ఐడెంటిటీ కార్డులు అడిగి తెలుసుకున్న ఉగ్రవాదులు, ఆ వెంటనే పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు జరిపారు.
దాడికి పాల్పడిన వారిని ఏరిపారేయండి..
ఈ పిరికిపంద దాడిలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దీపక్ రాత్రే అనే కార్మికుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. భూపేందర్ అనే మరో కూలీకి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వెంటనే అనంతనాగ్‌లోని ఆస్పత్రికి తరలించి అత్యవసర వైద్యం అందిస్తున్నారు. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు క్షణాల్లో రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. పారిపోయిన ఉగ్రవాదుల వేట కోసం ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. ఈ దారుణాన్ని జమ్మూ కశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వారిని ఏరిపారేయాలని డీజీపీ నలిన్ ప్రభాత్ బలగాలను ఆదేశించారు.
నాయకుల దిగ్భ్రాంతి .. తీవ్ర ఖండన
ఈ విషాదకర ఘటనపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు తమ సానుభూతిని తెలుపుతూ, ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేశారు.
ప్రియాంక గాంధీ..
అమాయక ఇటుక బట్టీ కార్మికుల గుర్తింపు అడిగి మరీ కాల్చి చంపడం అత్యంత సిగ్గుచేటైన, అమానుషమైన చర్య అని మండిపడ్డారు. బాధితుల కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉంటుందని, ఈ కేసులో తక్షణమే స్పందించి ముష్కరులకు కఠిన శిక్ష పడేలా చూడాలన్నారు.
రాహుల్ గాంధీ..
దేశం కోసం కష్టపడి పనిచేసే అమాయక కార్మికులు ఇలా ప్రాణాలు కోల్పోవడం గుండెలను పిండేసే విషాదమని పేర్కొన్నారు. ఈ పిరికిపంద చర్యకు పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెట్టి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అత్యంత తీవ్రమైన శిక్ష విధించాలని స్పష్టం చేశారు.
మల్లికార్జున ఖర్గే..
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే స్పందిస్తూ.. ఇది మానవత్వానికే పెద్ద అవమానమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన, ఈ దుశ్చర్యకు పాల్పడిన ఉగ్రవాదులపై త్వరితగతిన, కఠినంగా చర్యలు తీసుకోవాలని, చట్టప్రకారం వారికి తగిన శిక్ష పడేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.