Tata Curvv EV vs Mahindra BE 6 Sportech: భారత్‌లో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతున్న సమయంలో, దేశీయ కంపెనీలు కొత్త కొత్త మోడళ్లను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో మహీంద్రా BE 6, టాటా కర్వ్ EV రెండూ ప్రత్యేకమైన డిజైన్, మంచి రేంజ్, అత్యాధునిక ఫీచర్లతో ఆకట్టుకుంటున్నాయి. తాజాగా BE 6 స్పోర్టెక్, కర్వ్ EV సిరీస్ X అప్‌డేట్లతో ఈ రెండు మోడళ్ల మధ్య పోటీ మరింత పెరిగింది. అయితే, ధర, బ్యాటరీ, రేంజ్, పనితీరు, ఫీచర్ల పరంగా రెండింటి మధ్య తేడాలేంటో చూద్దాం.
ధర విషయంలో రెండు కార్ల మధ్య భారీ తేడా కనిపిస్తుంది. మహీంద్రా BE 6 స్పోర్టెక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.19.45 లక్షల నుంచి ప్రారంభమై రూ.26.95 లక్షల వరకు ఉంటుంది. ఇందులో ఛార్జర్ ఖర్చు అదనంగా ఉండే అవకాశం ఉంది. మరోవైపు టాటా కర్వ్ EV ధర రూ.17.19 లక్షల నుంచి రూ.19.69 లక్షల వరకు ఉంది. అంటే BE 6 స్పోర్టెక్‌తో పోలిస్తే కర్వ్ EV ప్రారంభ ధర రూ.2 లక్షలకు పైగా తక్కువగా ఉంటుంది. టాప్ వేరియంట్లను పరిశీలించినా రెండు కార్ల మధ్య భారీ ధర వ్యత్యాసం ఉంది.
అయితే, BE 6 స్పోర్టెక్‌కు BaaS అంటే బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ ఆప్షన్ అందుబాటులో ఉంది. ఈ విధానంలో ప్రారంభ ధర రూ.11.45 లక్షలకు తగ్గుతుంది. అయితే, బ్యాటరీ వినియోగానికి కిలోమీటరుకు రూ.3.75 చెల్లించాల్సి ఉంటుంది.
BE 6 స్పోర్టెక్‌లో పెద్ద బ్యాటరీ ఆప్షన్‌తో పాటు అధిక రేంజ్‌పై మహీంద్రా దృష్టి పెట్టింది. రోజువారీ ఆఫీస్ ప్రయాణాలతో పాటు లాంగ్ డ్రైవ్‌లు చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. టాటా కర్వ్ EV కూడా రెండు బ్యాటరీ ఎంపికలతో అందుబాటులో ఉండి, వేరియంట్‌ను బట్టి రేంజ్ మారుతుంది. BE 6 573 కి.మీ రేంజ్ ఇస్తుంది. టాటా కర్వ్ EV 585 కి.మీ వరకు రేంజ్ ఉంది.
BE 6 స్పోర్టెక్ స్పోర్టీ డిజైన్‌తో పాటు డ్రైవింగ్ పనితీరుపై ఎక్కువగా దృష్టి పెట్టిన మోడల్. వేగంగా స్పందించే ఎలక్ట్రిక్ మోటార్, తక్షణ టార్క్ వంటి లక్షణాలు డ్రైవింగ్ అనుభవాన్ని మరింత క్రేజీగా మారుస్తాయి. కర్వ్ EVలో కూడా ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌కు సంబంధించిన సడెన్ టార్క్ ఉంటుంది. కారు కొనుగోలు సమయంలో కేవలం పవర్, యాక్సిలరేషన్ కాకుండా సస్పెన్షన్, రైడ్ కంఫర్ట్, స్టీరింగ్ ఫీల్ లాంటి అంశాలను కూడా పరిశీలించడం మంచిది.
రెండు కార్లలోనూ డిజిటల్ డిస్‌ప్లేలు, కనెక్టెడ్ టెక్నాలజీ, ఆధునిక సేఫ్టీ ఫీచర్లు, సౌకర్యవంతమైన క్యాబిన్ లాంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. కర్వ్ EV కూపే తరహా SUV డిజైన్‌తో ప్రత్యేకంగా కనిపిస్తే, BE 6 మరింత ఫ్యూచరిస్టిక్ లుక్‌తో వస్తుంది. కుటుంబ వినియోగం కోసం చూస్తున్నవారు వెనుక సీటు స్థలం, బూట్ స్పేస్, ఛార్జింగ్ సౌకర్యం లాంటి అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించడం మంచిది.
ధరను ప్రధానంగా చూసేవారికి టాటా కర్వ్ EV తక్కువ ప్రారంభ ధరతో ఆసక్తికరమైన ఆప్షన్‌గా కనిపిస్తుంది. మరోవైపు అధిక ధర పరిధిలో ఉన్నప్పటికీ BE 6 స్పోర్టెక్‌కు BaaS ఆప్షన్, స్పోర్టీ డిజైన్, పనితీరుపై మంచి ఫోకస్ న్నాయి. అందువల్ల ఈ రెండు EVలలో ఎంపిక చేసుకునే ముందు ధరతో పాటు రోజువారీ ప్రయాణ దూరం, రేంజ్ అవసరం, ఛార్జింగ్ సదుపాయం, కుటుంబ వినియోగం, డ్రైవింగ్ ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకోవడం మంచిది.
Read Also: దీపావళి సీజన్‌లో కొత్త కార్ల జాతర.. మారుతి, హ్యుందాయ్ నుంచి వస్తున్న కొత్త మోడళ్లు ఇవే!