Mamata Assets: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ తన ఆస్తుల లెక్కలతో మారోమారు వార్తల్లో నిలిచారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమె భవానీ పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిన సంగతి తెలిసిందే. అయితే ఎలక్షన్స్ కు ముందు దాఖలు ఎన్నికల అఫిడవిట్ లో తన ఆస్తుల వివరాలను ఆమె తెలియజేశారు. తాజాగా అవి బయటకు రావడంతో ఒక్కసారిగా మమత గురించి చర్చ మెుదలైంది. 15 ఏళ్లపాటు బెంగాల్ సీఎంగా ఉన్న మమతా ఆస్తులు చూసి అందరూ అవాక్కవుతున్నారు.
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) డేటా ప్రకారం.. మమతా బెనర్జీ ఆస్తుల విలువ కేవలం రూ. 15,37,509 మాత్రమే. అంటే సుమారు 15.37 లక్షలు. దీంతో దేశంలోనే అత్యంత తక్కువ ఆస్తులు కలిగిన ముఖ్యమంత్రుల్లో ఒకరిగా ఆమె నిలిచారు. అఫిడవిట్ ప్రకారం.. ఆమె వద్ద కేవలం రూ. 75,700 నగదు ఉంది. ఇండియన్ బ్యాంక్‌లోని రెండు ఖాతాల్లో కలిపి రూ. 12.76 లక్షలు ఉన్నాయి. ఎన్నికల సంబంధిత ఖర్చుల కోసం ఉద్దేశించిన బ్యాంకు ఖాతాలో రూ.40,000 ఉన్నట్లు మమతా తన అఫిడవిట్ లో తెలియజేశారు.
సాధారణంగా మహిళలకు బంగారంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే సీఎంగా పనిచేసిన మమతా.. మాత్రం ఈ విషయంలోనూ నిరాడంబరంగానే ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్ ను బట్టి తెలుస్తోంది. ఆమె వద్ద కేవలం 9.75 గ్రాముల బంగారం మాత్రమే ఉంది. దీని విలువ సుమారు రూ. 1.45 లక్షలు. పుస్తకాల రాయల్టీ, బ్యాంక్ వడ్డీయే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నట్లు అఫిడవిట్ మమత పేర్కొన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో తన ఆదాయం రూ. 23.21 లక్షలుగా ఆమె చూపించారు.
పదిహేనేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ తన పేరు మీద ఎటువంటి సొంత ఇల్లు గానీ, కారు గానీ, వ్యవసాయ భూమి గానీ లేదని మమతా అఫిడవిట్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం తాను ఉంటున్న ఇల్లు కూడా అన్న భార్య పేరు మీద ఉందని తెలియజేశారు. అంతేకాదు 2016 (రూ.30 లక్షలు), 2021 (రూ. 16.72 లక్షలు)లో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లతో పోలిస్తే.. 2026కు వచ్చేసరికి ఆమె ఆస్తుల విలువ మరింత తగ్గడం గమనార్హం. ఎప్పుడూ కాటన్ చీరలు, హవాయి చెప్పులతో కనిపించే ఆమె నిరాడంబరతను ఈ అఫిడవిట్ మరోసారి చాటిచెప్పిందని టీఎంసీ వర్గాలు కొనియాడుతున్నాయి.
Also Read: చిక్కుల్లో విజయ్.. టీవీకే పార్టీపై ఫోర్జరీ ఆరోపణలు.. గవర్నర్‌కు AMMK ఫిర్యాదు
ఇదిలా ఉంటే మే4న విడుదలైన బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీకి గట్టి షాక్ తగిలింది. 294 అసెంబ్లీ సీట్లకు గాను కేవలం 81 స్థానాలకే టీఎంసీ పరిమితమైంది. మరోవైపు 206 స్థానాల్లో విజయం సాధించి.. బెంగాల్ గడ్డపై తొలిసారి తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ సిద్ధమైంది. అయితే 2021లో జరిగిన ఎన్నికల్లో మమతా ఏకంగా 215 సీట్లు గెలవగా.. ఈసారి గణనీయంగా సీట్లు తగ్గడం గమనార్హం.
Also Read: Vijay CM Oath: విజయ్‌కు బిగ్ షాక్.. గవర్నర్ యూటర్న్.. ఇవాళ ప్రమాణ స్వీకారం లేనట్లే!