Vandemataram 150 Years: ‘వందేమాతరం’ కోసం తమ జీవితాలను అంకితం చేసిన లక్షలాది మంది మహానుభావులకు, భారతమాత బిడ్డలకు ఈ రోజు గౌరవపూర్వకంగా నివాళులర్పిస్తున్నానని ప్రధాని మోదీ అన్నారు. వందేమాతరం సామూహికంగా పాడటమనేది మాటలలో చెప్పలేని అనుభవం అన్నారు. ఒక లయ, ఒక స్వరం, ఒక భావోద్వేగం, ఉత్సాహం హృదయాన్ని కదిలిస్తుందన్నారు. శుక్రవారం దిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో వందేమాతరం 150వ స్మారకోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయుల్లో ‘వందేమాతరం’ గేయం స్ఫూర్తి నింపిందన్నారు. వందేమాతరం గేయానికి శుక్రవారంతో 150 ఏళ్లు పూర్తయ్యాయని గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. వందేమాతరం గేయాన్ని నవంబర్ 7, 1875న బంకించంద్ర ఛటర్జీ రచించారు.
‘నవంబర్ 7, నిజంగా చారిత్రాత్మకమైన రోజు. ఇవాళ మనం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ రోజు మనకు కొత్త స్ఫూర్తినిస్తుంది. లక్షలాది మంది భారతీయులలో నూతన శక్తిని నింపుతుంది. ‘వందేమాతరం’ కోసం తమ జీవితాలను అంకితం చేసిన లక్షలాది మంది మహానుభావులకు, భారతమాత బిడ్డలకు నేను గౌరవపూర్వకంగా నివాళులర్పిస్తున్నాను. వందేమాతరం కోసం అంకితం చేసిన ప్రత్యేక నాణెం, పోస్టల్ స్టాంప్ ను విడుదల చేశాను’- ప్రధాని మోదీ
‘వందేమాతరం ప్రతి యుగంలో, ప్రతి కాలంలో సందర్భాన్ని బట్టి ఉపయోగకరంగా మారింది. ఈ గేయం అమరత్వాన్ని పొందింది. చాలా మంది విప్లవకారులు, ఉరికొయ్యలపై నిలబడి వందేమాతరం అన్నారు. ఈ శతాబ్దాన్ని భారతదేశ శతాబ్దంగా మార్చుకోవాలి. అందుకు తగిన సామర్థ్యం 1.4 బిలియన్ల భారతీయులలో ఉంది’ – ప్రధాని మోదీ
వందేమాతరం గేయం ఒక స్వప్నం, ఒక సంకల్పం, ఒక మంత్రం అని ప్రధాని మోదీ అన్నారు. ఈ గేయం దేశమాత ఆరాధన, సాధన అని పేర్కొన్నారు. వందేమాతరం మనందరినీ పురాణ ఇతిహాసాల్లోకి తీసుకెళ్తుందన్నారు. వందేమాతరం శబ్దం ఆత్మవిశ్వాసాన్ని నింపుతోందని, భవిష్యత్తుకు సరికొత్త భరోసా ఇస్తుందన్నారు.