Weather News: ఎల్‌నినో ప్రభావం భారత్ తీవ్ర ప్రభావం చూపింది. ఏ స్థాయిలో చూపిందంటే.. ఆగష్టు నెలలో ఎండలు 125 ఏళ్ల రికార్డులను బద్దలు కొట్టాయి. ఆగష్టు నెల అత్యంత వేడి నెలగా అభివర్ణించింది భారత వాతావరణ శాఖ. మరి సెప్టెంబర్ మాటేంటి? ఈ నెలలో అయిన వరుణుడు కరుణిస్తాడా? అన్నది ఇప్పడు చూద్దాం.
దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం కారణంగా రుతుపవనాలు బలహీనమయ్యాయి. ఫలితంగా ఎండలు మండిపోయాయి. వాతావరణం గురించి కీలక విషయాలు వెల్లడించింది భారత వాతావరణ శాఖ. దేశంలో ఈ ఏడాది ఆగష్టు నెల రికార్డు స్థాయిలో ఎండలు కాసినట్టు తెలిపింది. ఎండలు విషయంలో 125 ఏళ్ల రికార్డు బద్దలైంది. 1901 తర్వాత అత్యంత వేడి ఆగష్టు నెల నమోదు అయినట్టు వెల్లడించింది.
2026 ఆగస్టు నెలలో సగటు, కనిష్ట ఉష్ణోగ్రతలు చారిత్రాత్మక స్థాయికి చేరుకున్నాయని ఐఎండి డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర వెల్లడించారు. సాధారణ ఆగష్టు నెల ఉష్ణోగ్రత 23.68 డిగ్రీల సెల్సియస్‌కు ఉండగా, 2026 ఆగస్టులో సగటు కనిష్ట ఉష్ణోగ్రత 24.36 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. 1901 తర్వాత ఇదే అత్యధికమని చెప్పారు. ఆగష్టు నెల సాధారణ సగటు ఉష్ణోగ్రత 27.34 డిగ్రీలు కాగా, సగటు ఉష్ణోగ్రత 28.01 డిగ్రీల సెల్సియస్ నమోదు అయ్యింది. ఇది దీర్ఘకాల సగటు కంటే దాదాపు 0.67 డిగ్రీల సెల్సియస్ అధికమని వెల్లడించారు. దేశంలోని 741 జిల్లాల్లో 47 శాతం కంటే ఎక్కువ లోటు వర్షపాతం నమోదు కావడంతో ఆగష్టు 16.3 శాతం వర్షపాత లోటు ఏర్పడింది.
రుతుపవనాల మూడు నెలల్లో సాధారణం కంటే సుమారు 14 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. ఈ సీజన్ అంతటా వర్షపాత లోటు పెరుగుతూ వచ్చింది. జూన్‌లో 35 శాతం లోటు కాగా, జూలైలో సగటు కంటే 1 శాతం అధికంగా సాధారణ వర్షపాతం నమోదైంది. ఆగస్టు లోటుతో కలిపి దాదాపు 14 శాతానికి చేరింది. 556.2 మి.మీ.కు గాను ఇప్పటివరకు 421.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. అత్యల్ప వర్షపాతం 24.2 శాతం లోటుతో దక్షిణ ప్రాంతంలో నమోదు అయ్యింది. ఆ తర్వాతి స్థానాల్లో ఈశాన్య- 25.7, వాయువ్య-10.7, మధ్య భారతదేశం- 3.8 శాతంగా ఉంది. రుతుపవనాల చివరి నెల సెప్టెంబర్ కోసం భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
1971-2020 వరకు ఉన్న డేటా ఆధారంగా సెప్టెంబర్ నెల దీర్ఘకాల సగటు 167.9 మి.మీ.గా ఉంటుందని పేర్కొంది. సెప్టెంబర్‌లో దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండి డైరెక్టర్ ప్రస్తావించారు. వాయువ్య, ఈశాన్య, తూర్పు, తూర్పు మధ్య, ఆగ్నేయ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల సాధారణం లేదా అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు. సెప్టెంబర్ నెలలో దేశంలోని చాలా ప్రాంతాల్లో నెలవారీ సగటు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండవచ్చని తెలియజేశారు. ఆగష్టునెలలో ఒడిశాలో అధిక వర్షపాతం నమోదైంది. ఎందుకంటే బంగాళాఖాతంలో ఏర్పడిన వరుస అల్పపీడనాల కారణంగా అధిక వర్షపాతం నమోదైనట్టు ఐఎండీ డైరెక్టర్ తెలిపారు. వర్షపాత ధోరణికి ఒడిశా మినహాయింపుగా నిలిచింది.