MP Mahua Moitra For Remarks: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా మళ్లీ వార్తల్లోకి వచ్చేశారు. ఉన్నది వున్నట్లు మాట్లాడడం ఆమె నైజం. ఈ విషయంలో ఎవరేమనుకున్నా పట్టించుకోరు. చెప్పాల్సిన నాలుగు మాటలు సూటిగా చెప్పేస్తారు. ఒక్కోసారి చిక్కుల్లో పడిన సందర్భాలు లేకపోలేదు. తాజాగా జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖాశర్మపై ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీంతో ఎంపీ మహువాపై కేసు నమోదైంది.
ఇంతకీ ఎంపీ మహువాపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేయడానికి కారణాలేంటి? ఇటీవల యూపీలోని హాత్రాస్‌లో జూలై రెండున సత్సంగ్ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రేఖాశర్మ వెళ్లారు. ఆ సమయంలో ఆమెకు ఓ వ్యక్తి గొడుగు పట్టుకున్న వీడియోను ఎక్స్‌లో పోస్టు చేశారు ఎంపీ మహువా. ఆమె తన యజమాని పైజమాను ఎత్తి పట్టుకోవడంతో బిజీగా ఉన్నారంటూ చిన్న క్యాప్షన్ ఇవ్వడం తొలగించడం చకచకా జరిగిపోయింది.
ఈ వ్యవహారంపై జాతీయ మహిళా కమిషన్ రియాక్ట్ అయ్యింది. మహిళల గౌరవానికి భంగం కలిగే విధంగా ఎంపీ వ్యాఖ్యలు ఉన్నాయని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొంది. అంతేకాదు ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి మూడురోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఢిల్లీ పోలీసులను కమిషన్ ఆదేశించింది.
ఢిల్లీ పోలీసులు మూడు రోజుల్లో తనను అరెస్టు చేయాలనుకుంటే నదియాకు రండి.. అక్కడే ఉంటానని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు ఎంపీ మహువా. నా గొడుగు నేనే పట్టుకుంటానని తనదైన శైలిలో చెప్పుకొచ్చా రు. అంతేకాదు గతంలో రేఖాశర్మ మహాత్మాగాంధీపై చేసిన వ్యాఖ్యల డీటేల్స్‌ను బయటపెట్టారు ఆమె. రేఖాశర్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఎంపీ ఢిల్లీ పోలీసులను కోరారు.
ALSO READ: వరుసగా కుప్పకూలుతున్న వంతెనలు.. బీహార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం..
కొద్దిరోజుల కిందట ప్రతిపక్ష నేతల కేసుల్లో న్యాయమూర్తులు న్యాయం చేయడానికి భయపడుతున్నారని అన్నారు ఎంపీ మహువా. ప్రభుత్వానికి ఎక్కడ కోపం వస్తుందోనని భయంతో బెయిల్ నిరాకరిస్తున్నారని ఆరోపించారు.