Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జాతీయ రహదారులు, రోడ్లు, ఎక్స్ ప్రెస్ వేలపై వీధి కుక్కలు, పశువులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇందుకోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సూచించింది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు దీన్ని తప్పనిసరిగా అమలు చేయాలని కోరింది. ఈ ప్రత్యేక డ్రైవ్ అమలుపై ఎనిమిది వారాల్లో స్టేటస్ రిపోర్టు అందజేయాలని ఆదేశించింది.
‘పాఠశాలలు, బస్టాండ్, రైల్వే స్టేషన్, ఆస్పత్రులలోకి వీధి కుక్కలు రాకుండా 8 వారాల్లో తగిన ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి. రెండు వారాల్లో మున్సిపల్ సిబ్బంది ఈ స్థలాలను, భవనాలను గుర్తించాలి. ఈ ప్రాంతాల్లో తిరిగే వీధి కుక్కలను స్టెరిలైజేషన్ చేసి రీ లొకేషన్ చేయాలి. వీధి కుక్కలను పట్టుకున్న ప్రాంతాలలో తిరిగి వాటిని వదిలిపెట్టకూడదు. ఎప్పటికప్పుడు మున్సిపల్ సిబ్బంది ఈ ప్రాంతాలలో తనిఖీ చేయాలి. పబ్లిక్ ఏరియాలో వీధి కుక్కలు తిరగకుండా తగిన చర్యలు తీసుకోవాలి. వీధి కుక్కల నిర్వహణపై అమికస్ క్యూరీ నివేదికను అమలు చేయాలి. ఈ నివేదిక అమలుపైన అఫిడవిట్ దాఖలు చేయాలి లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవు’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది.
పాఠశాలలు, ఆసుపత్రులు, బస్టాండ్ల ఆవరణల నుండి వీధి కుక్కలను తొలగించాలని సుప్రీంకోర్టు ఇచ్చింది. ఈ ఆదేశాలపై పిటిషనర్, లాయర్ ననితా శర్మ మాట్లాడుతూ.. ‘అన్ని విద్య, ప్రభుత్వ సంస్థలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్ల నుంచి వీధి కుక్కలను తొలగించి, వాటిని వేరే చోటకు తరలించాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. ఈ సంస్థల్లో వీధి కుక్కలు లేకుండా ఉండేలా చూసుకోవడానికి ఒక మోడల్ అధికారిని నియమించనున్నారు. ఈ రోజు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. నోరులేని జంతువుల పట్ల అంత అన్యాయం జరగకూడదు’ అన్నారు.