కర్ణాటకలోని మైసూరు నగరం తన స్వచ్ఛతకు.. రాజసం ఉట్టిపడే కట్టడాలకు ప్రపంచ ప్రసిద్ధి. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిచోట్ల బహిరంగ మూత్రవిసర్జన సమస్య నగర పాలక సంస్థకు సవాలుగా మారింది. ఈ దురలవాటును అరికట్టడానికి మైసూరు నగర పాలక సంస్థ (MCC) ఇప్పుడు ఒక వినూత్నమైన ఆలోచనతో ముందుకు వచ్చింది. అదే గోడలకు అద్దాలు అమర్చడం.
సాధారణంగా గోడలపై దేవుళ్ల చిత్రాలు వేయడం.. ఇక్కడ ఉమ్మరాదు/మూత్రం పోయరాదు. అని హెచ్చరికలు రాయడం మనం చూస్తుంటాం. కానీ మైసూరు అధికారులు మాత్రం మనిషిలోని సిగ్గును లక్ష్యంగా చేసుకున్నారు. నగరంలోని అత్యధిక రద్దీ ఉండే ప్రాంతాల్లో.. ప్రజలు తరచుగా మూత్రవిసర్జన చేసే గోడలకు పెద్ద పెద్ద అద్దాలను అమర్చారు. ఈ వినూత్న ప్రయోగం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఎవరైనా వ్యక్తి ఆ గోడ వద్దకు వచ్చి మూత్రవిసర్జన చేయడానికి సిద్ధపడగానే.. ఎదురుగా ఉన్న అద్దంలో తన ప్రతిబింబం కనిపిస్తుంది. తాను చేస్తున్న పనిని తన కళ్లతో తానే చూసుకోవడం వల్ల ఆ వ్యక్తిలో ఒక రకమైన సిగ్గు.. అసౌకర్యం కలుగుతాయని అధికారులు భావిస్తున్నారు. అంతేకాకుండా అద్దంలో వెనుక నుంచి వచ్చే వాహనాలు.. బాటసారులు కూడా కనిపిస్తుంటారు. దీనివల్ల ఎవరైనా తనను గమనిస్తున్నారేమోనన్న భయం ఆ వ్యక్తిని ఆ పని చేయకుండా ఆపుతుంది.
ఈ ప్రయోగం ప్రారంభించిన కొన్ని రోజుల్లోనే ఆయా ప్రాంతాల్లో మంచి ఫలితాలు కనిపిస్తున్నట్లు నగర పాలక సంస్థ అధికారులు వెల్లడించారు. గోడలపై దేవుళ్ల చిత్రాలు వేస్తే వాటిపై కూడా మూత్రం పోసే కిరాతకులు ఉన్నారని.. కానీ ఈ అద్దాల ప్రయోగం వారిని మానసికంగా ప్రభావితం చేస్తోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద మైసూరును అత్యంత పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దే క్రమంలో ఈ మిర్రర్ థెరపీ ఒక కీలకమైన అడుగుగా నిలుస్తోంది.
మైసూరులో ప్రజలు ఎక్కడపడితే అక్కడ మూత్రవిసర్జన చేయకుండా నివారించడానికి వినూత్న ప్రయత్నం
గోడలపై అద్దాలు అమర్చిన మైసూరు ప్రభుత్వం pic.twitter.com/U1nYmA5BKl
— BIG TV Breaking News (@bigtvtelugu) May 6, 2026
Read Also: హర్మూజ్ జలసంధి.. ఆపై ప్రాజెక్ట్ ఫ్రీడమ్ బ్రేక్, ట్రంప్ ప్రకటన, త్వరలో 14 అంశాలపై ఒప్పందం!