Bihar Floor Test Highlight: బీహార్ భవితవ్యం తేలేందుకు సర్వం సిద్ధమైంది. అసెంబ్లీలో నేడు విశ్వాస పరీక్ష నిర్వహించనుంది. నేటి విశ్వాస పరీక్షలో నితీశ్ కుమార్ గెలుస్తారా లేదా అనే దానిపై ఆసక్తి నెలకొంది. బలపరీక్షలో నెగ్గి ఎన్డీఏతో కలిసి ప్రభుత్వాన్ని కొనసాగించాలని నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ పట్టుదలతో ఉంది. ఇక విశ్వాస పరీక్షలో నితీశ్‌ను ఓడించి, తాము ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆర్జేడీ, కాంగ్రెస్ మహా కూటమి తన వ్యూహాలకు పదునుపెడుతోంది. నిన్నటి వరకు హైదరాబాద్‌లోనే ఉన్న బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సొంత గడ్డపై కాలుపెట్టారు. వారంతా ఇవాళ ఓటింగ్‌లో పాల్గొననున్నారు.
మరోవైపు నేడు జరిగే విశ్వాస పరీక్షలో ఎన్‌డీఏకు అనుకూలంగా ఓటు వేయాలని హిందుస్థానీ ఆవామ్ మోర్చా నిర్ణయించింది. దీనికి సంబంధించి తమ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసినట్లు బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ వ్యవస్థాపకుడు జీతన్ రామ్ మాంఝీ తెలిపారు. తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు నీతీశ్ కుమార్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేస్తారని ఆయన ఇప్పటికే ప్రకటించారు.
Read More: ఎన్నికల వేళ.. ఆ రాష్ట్రాల ఉద్యోగులకు పండుగే..
మొత్తం 243 స్థానాలు ఉన్న బీహార్ అసెంబ్లీలో ప్రస్తుతం నితీశ్‌కు చెందిన జేడీయూకు 45 మంది సభ్యులు ఉండగా, బీజేపీకి 78 మంది, మాంఝీ పార్టీకి నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తంగా మ్యాజిక్ ఫిగర్ అయిన 122ను దాటి ఎన్‌డీఏకు 128 ఎమ్మెల్యేల మద్ధతు ఉంది. మరోవైపు మహా గట్‌బంధన్‌లోని ఆర్జేడీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు కలిపి 114 మంది ఎమ్మెల్యేలే ఉండగా.. వారెవరూ గీత దాటకుండా ఆయా పార్టీలు క్యాంపు రాజకీయాలు కొనసాగించాయి. ఆర్జేడీ సభ్యులంతా ఆ పార్టీ నేత తేజస్వియాదవ్ నివాసంలో ఉండగా.. వారం రోజులుగా తెలంగాణలో శిబిరంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిన్న రాత్రి బీహార్‌కు చేరుకున్నారు. బలపరీక్ష అయిపోగానే ఆర్జేడీకి చెందిన అసెంబ్లీ స్పీకర్‌పై ఎన్‌డీఏ పక్షాలు అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టనున్నాయి.