Tata Group: టాటా గ్రూప్ మన ఎకానమీకి గ్లోబల్ ఎకానమీకి చాలా కీలకం. మరి అలాంటి కంపెనీలో ఇప్పుడు గొడవలు పెరుగుతున్నాయ్. రతన్ టాటా బతికున్నంత వరకు పరిస్థితి బాగానే ఉంది. కానీ ఆ తర్వాతే రెండు గ్రూపులుగా మారాయి. ఫ్యామిలీ లాయల్టీ, పవర్ స్ట్రగుల్ మధ్య టాటా గ్రూప్ నలిగిపోతోంది? ఎందుకిలా జరుగుతోంది? టాటా గ్రూప్‌ను కంట్రోల్ చేసేదెవరు? నడిపేదెవరు? ప్రాభవం మసకబారుతోందా?
రతన్ టాటా వీలునామాలో కీలకాంశాలు ..
రతన్ టాటా వీలునామాలో ఏం రాశారో తెలుసా? తను చనిపోయాక తన షేర్లు, ఆస్తులు, వ్యాపారాలు ఎవరికి చెందాలో డిటైల్డ్ గా మెన్షన్ చేశారు. అయితే అది పబ్లిక్ కాలేదు. వారసత్వ కుటుంబ సభ్యులకు ప్రాధాన్యం ఇస్తూనే.. ట్రస్టుల ద్వారా సహాయాలు చేయండి.. అందరినీ పైకి తీసుకురండి. వచ్చిన లాభాల్లో వెనుకబడిన వర్గాలు, పేదలకు సౌకర్యాలు కల్పించండి. చదువులు చెప్పించండి. ఇదీ రతన్ టాటా చెప్పిన మాట. ఎంత గొప్ప మనసు. కానీ ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యం నిర్మించిన ఈ పెద్దాయన ఒక్క మాట మాత్రం మర్చిపోయారు. అదే ఇప్పుడు టాటా గ్రూప్ లో కుంపటి రాజేస్తుందని ఊహించలేకపోయారు. టాటా గ్రూప్ లో నా తర్వాత ఎవరు అల్టిమేట్ అథారిటీ? అది మాత్రం క్లారిటీ ఇవ్వలేకపోయారు. రతన్ టాటా తర్వాత అసలైన వారసుడు ఎవరు? ఈ క్వశ్చన్ కు సమాధానం టాటా గ్రూప్ లో క్లారిటీ లేకపోవడంతో ఇప్పుడు అది కాస్తా రెండు గ్రూపులుగా మారింది. గొడవ ముదురుతోంది. రాజీనామాలు చేసే వాళ్లు చేస్తున్నారు. పంచాయితీ కేంద్రం దగ్గరికీ వెళ్లింది. ఇదీ ఘనమైన టాటాగ్రూప్ నేటి పరిస్థితి. అది కూడా టాటా చనిపోయిన ఏడాదిలోపే జరుగుతుండడం మరో ఫ్యాక్టర్.
ఉప్పు దగ్గర్నుంచి సెమీకండక్టర్ల దాకా బిజినెస్..
టాటా సాల్ట్ దగ్గర్నుంచి సెమీకండక్టర్ల దాకా అన్ని వ్యాపారాల్లోనూ అందెవేసిన చేయి వారిదే. టాటా ప్రొడక్ట్స్ అన్నీ లోకల్ లో మొదలై.. గ్లోబల్ గా బ్రాండింగ్ అయ్యాయి. ఇదంతా రాత్రికి రాత్రి వచ్చింది కాదు. వ్యాపారం ప్లస్ బాధ్యత కలిస్తే టాటా గ్రూప్. అందుకే ఈ 37 లక్షల కోట్ల రూపాయలకు పైగా వ్యాపార సామ్రాజ్యం చెక్కు చెదరలేదు. దాదాపు 150 ఏళ్లుగా టాటా గ్రూప్ భారత ఆర్థిక వ్యవస్థలో నీడలా కొనసాగింది. కానీ ఇప్పుడు మాత్రం లుకలుకలు పెరుగుతున్నాయ్. ఇంత పెద్ద గ్రూప్ లో విబేధాలు, బేధాభిప్రాయాలు, డిమాండ్లు, లుకలుకలు రావడం సహజమే. కానీ రతన్ టాటా మాత్రం తనదైన స్ట్రాటజీలతో ఈ సమస్యలను నేర్పుగా, ఓర్పుగా పరిష్కరించారు. ఏనాడూ ఒక్క విషయం కూడా బయటకు రాకుండా చూసుకున్నారు. సమస్యలను మొదట్లోనే సాల్వ్ చేసి కూల్ చేశారు.
ఆస్తులు, పదవులకు మాత్రమే వారసులు
ఆస్తులు, పదవులకు మాత్రమే వారసులు వస్తుంటారు. అప్పులు, కష్టాలకు ఎవరూ ఉండరు. అది కరెక్ట్. అయితే రతన్ టాటా తన మరణానికి ముందు ఫ్యామిలీ ఫస్ట్ పాలసీని సెట్ చేశారు. కానీ ఇది ఇప్పుడు బ్యాక్‌ఫైర్ అవుతోంది. రతన్ బతికున్నప్పుడు సైలెంట్ గా ఉన్న వాళ్లు ఇప్పుడు తమ సంగతేంటి అని అడుగుతున్నారు. పెద్దాయన బతికున్నప్పుడు గౌరవం ఇచ్చాం.. ఇక చాలు అంటున్నారు. ఆధిపత్యం కోసం ఇంటర్నల్ వార్ నడుస్తోంది. గత బోర్డ్ మీటింగ్ లలో సైలెంట్ గా ఉన్న వాళ్లు ఇప్పుడు ఛాలెంజ్ లు విసురుతున్నారు. మధ్యలోనే లేచి వెళ్లిపోతున్నారు. ఇలాంటి సీన్ల మధ్య అక్టోబర్ 10 టాటా గ్రూప్ కీలక బోర్డ్ మీటింగ్ జరగబోతోంది. అప్పుడు ఏం జరుగుతుందన్నది బిగ్ ట్విస్ట్ గా మారింది.
టాటా గ్రూప్‌లో 29 పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలు
టాటా గ్రూప్‌లో 29 పబ్లిక్ లిస్టెడ్ సంస్థలు, ఆగస్ట్ నాటికి మొత్తం మార్కెట్ క్యాప్ 37.84 లక్షల కోట్లు. ఎంత పెద్ద ఎకానమీ ఇది. TCS, టాటా మోటార్స్, టాటా స్టీల్ ఇవి మెయిన్ పిల్లర్స్ గా ఉన్నాయి. వీటిని లోకల్ గా మొదలు పెట్టి గ్లోబల్ బ్రాండ్లుగా మార్చడంలో రతన్ టాటా తిరుగులేని ఆలోచనా శక్తి ఉంది. అంతకు మించి బిజినెస్ స్కిల్స్ ఉన్నాయి. సరే పెద్దాయన అతిపెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించి కాలం చేశారు. మరి ఇప్పుడున్న వారసులు, కంపెనీల్లో వాటాలు ఉన్న వారు జాగ్రత్తగా బిజినెస్ చేసుకోవాలి కదా. అలా జరగట్లేదు. టాటా చనిపోయి ఏడాది తిరగక ముందే కథ మొత్తం ఉల్టా పల్టా అవుతోంది.
2024 అక్టోబర్ 11న టాటా ట్రస్ట్ చైర్మన్‌గా నోయెల్
రతన్ టాటా మరణం తర్వాత, 2024 అక్టోబర్ 11న నోయెల్ టాటా ట్రస్ట్ ఛైర్మన్ గా నియమితులయ్యారు. రతన్ టాటా పెళ్లి చేసుకోకపోవడంతో ఆయనకు వారసులు లేరు. నోయెల్ టాటా సవతి తల్లి కొడుకు. అందుకే ఈయనను నియమించారు. రతన్ టాటా ప్రేమలో పడ్డా.. 1962 భారత్ చైనా యుద్ధ సమయంలో అమెరికాలో ఉన్న టాటా ప్రేమించిన యువతి తల్లిదండ్రులు భారత్ వెళ్లేందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆయన అలాగే ఉండిపోయారు. తన జీవితాన్ని దేశం కోసం, టాటా గ్రూప్ వ్యాపార అభివృద్ధికి అంకితం చేశాడు. దేశం కోసం అన్న మాట ఎందుకు వాడాల్సి వచ్చిందంటే… టాటా గ్రూప్ మనదేశం, ప్రపంచ ఎకానమీకి చాలా కీలకం. అది కుప్పకూలితే కథ మరోలా ఉంటుంది కాబట్టి. ఎంతో మంది ఉద్యోగ, వ్యాపార జీవితాలు టాటా గ్రూప్ తో ముడిపడి ఉన్నాయి కాబట్టి. అంతగొప్ప మనిషి నడిపిన ఈ వ్యాపార సామ్రాజ్యంలో నోయెల్ టాటా వర్సెస్ చంద్రశేఖరన్ గేమ్ నడుస్తోంది. టాటా ట్రస్ట్ తో పాటు టాటా సన్స్ గ్రూపులో ఆధిపత్యం కోసం నోయెల్ టాటా ఆయన వారసులు పోటీ పడుతుంటే మూడోసారి టాటాసన్స్ ఛైర్మన్ కోసం చంద్రశేఖరన్ పట్టుదలగా ఉన్నారు. ఈ వ్యాపార చదరంగంలో మరి పైచేయి ఎవరిది?
బలమైన టాటా గ్రూప్ రతన్ టాటా చనిపోయిన ఏడాదిలోపే రెండు గ్రూపులుగా చీలిపోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. ఇన్వెస్టర్లు, వాటా దారులు ఏ ఇద్దరు కలిసినా ఇదే విషయం మాట్లాడుకుంటున్నారు. చెప్పాలంటే హాట్ డిబేట్ గా మారింది. ఎవరి వాదన నెగ్గుతుంది? ఎవరిది పైచేయి? ఎవరు టాటా కింగ్??
రెండు వర్గాలుగా చీలిన టాటా గ్రూప్
గత నెల సెప్టెంబర్ నుంచి టాటా గ్రూప్ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఒక వర్గంలో నోయెల్ టాటా మద్దతుదారులు ఉన్నారు. ఇందులో టీవీఎస్ ఛైర్మన్ అలాగే టాటా ట్రస్ట్స్ వైస్ చైర్మన్ గా ఉన్న వేణు శ్రీనివాసన్ సహా మరికొందరు ఉన్నారు. వీరు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ప్రొఫెషనల్ మేనేజ్‌మెంట్ పై దృష్టి పెట్టారు. ఇక మరో వర్గం రెబల్ గా మారింది. ఇది అపోజిషన్ అంటున్నారు. ఇందులో మెహ్లీ మిస్ట్రీ ఈయన టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్ట్రీ కజిన్. షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ కు చెందిన కుటుంబం. టాటా గ్రూప్ లో వీళ్లకు 18.37 శాతం షేర్లు కలిగి ఉంది. అలాగే ట్రస్టీ డారియస్ ఖంబాటా, జహంగీర్ HC జెహంగీర్, ప్రమిత్ ఝవేరి వీళ్లంతా ట్రస్టీల్లో అధికారం కోరుకుంటున్నారు. అంతే కాదు టాటా సన్స్ బోర్డు మీటింగ్‌లపై మరింత కంట్రోల్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదీ లుకలుకలకు కారణం.
గతంలోనే బోర్డులో జాయిన్ అయిన నోయెల్ కూతుళ్లు
ఈ ఏడాది జనవరిలో, నోయెల్ టాటా కూతుర్లు మాయా, లియా టాటా… సర్ రతన్ టాటా ఇండస్ట్రియల్ ఇన్‌స్టిట్యూట్ బోర్డులో జాయిన్ అయ్యారు. అలాగే నోయెల్ మనవడు నెవిల్ టాటా కూడా చిన్న ట్రస్టుల్లో ఎంటర్ అయ్యాడు. ఇది నెక్స్ట్ జెనరేషన్ ప్లాన్ అని చెప్పారు. అయితే ఓ ట్రస్టీ అర్నాజ్ రాజీనామా చేసి ఇది తమను ఫోర్స్ ఫుల్ గా బయటకు పంపించే కార్యక్రమం అని ఫైర్ అయి వెళ్లిపోయాడు. అంతే కాదు ఇతర వర్గంలో ఇది ఫ్యామిలీ టేకోవర్ అన్న విమర్శలు వచ్చాయి. నిజానికి నోయెల్ ముగ్గురు వారసులు రతన్ టాటా బతికున్నప్పుడే ఆయన ఆమోదంతోనే 2024 మేలో కంపెనీ బోర్డుల్లో వేర్వేరు పొజిషన్లలో జాయిన్ అయ్యారు. సో తన మరణం తర్వాత కొంత వివాదం ఉంటుందని గ్రహించిన రతన్.. ఫ్యామిలీ ఫస్ట్ పాలసీని సెట్ చేశారు. కానీ ఇప్పుడు ఆయన బతికి లేరు కదా…. గట్టిగా అడిగే వాళ్లెవరు?
ఇండిపెండెంట్ డైరెక్టర్ నియామకానికి బ్రెక్స్
సెప్టెంబర్ 11న జరిగిన టాటా గ్రూప్ మీటింగ్‌లో, మాజీ డిఫెన్స్ సెక్రటరీ విజయ్ సింగ్‌ను ఆల్ ఆఫ్ సడెన్ గా టాటా సన్స్ బోర్డు నుండి తొలగించారు. ఇది ఇంటర్నల్ వార్ ఎలా ఉందో చెబుతోంది. కనీస సమాచారం ఇవ్వరా అని అపోజిషన్ గ్రూప్ ఆరోపించి కూడా. ఈ చర్యతో టాటా సన్స్ బోర్డులో ఇండిపెండెంట్ డైరెక్టర్ల నియామకం ఆగిపోయింది. ఇక్కడ టాటా గ్రూప్ లో ఇంత గొడవ జరగడానికి పాత వివాదాలు ఉన్నాయి. నిజానికి టాటా గ్రూప్ లో ఇలాంటి వివాదాలు వద్దు అని రతన్ టాటా 2013లోనే ఓ ప్లాన్ రెడీ చేసుకున్నారు. తన వారసుడిగా సైరస్ మిస్ట్రీని ఎంపిక చేశారు. అయితే సరిగా బాధ్యతలు నిర్వర్తించట్లేదనుకున్నారో ఏమోగానీ..
టాటా సన్స్ చైర్మన్ పదవి నుండి 2016 అక్టోబర్ 24న సైరస్ మిస్త్రీని తొలగించారు. ఇది టాటా గ్రూప్ చరిత్రలో అత్యంత వివాదాస్పద ఘటనలలో ఒకటిగా నిలిచింది. ఇది కాస్తా రతన్ టాటా, అలాగే షాపూర్ జీ పల్లోంజి గ్రూప్ కు చెందిన మిస్ట్రీ కుటుంబాల మధ్య గొడవకు దారి తీసింది. అదే ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతోందంటున్నారు.
సెప్టెంబర్ 30న టాటా సన్స్ లిస్టింగ్ మిస్..
100 కోట్లకు పైగా ట్రాన్సాక్షన్లపై అన్ని ట్రస్టీల అప్రూవల్ కోసం పట్టు..
మెహ్లీ మిస్త్రీ ఇప్పుడు అపోజిషన్ గ్రూప్ లో ఉన్నాడు. 100 కోట్లకు పైగా ట్రాన్సాక్షన్లపై అన్ని ట్రస్టీల అప్రూవల్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ, నోయెల్ గ్రూప్ సైడ్ మాత్రం అలా కుదరదన్నది. రతన్ టాటా బతికి ఉన్నప్పుడు, ఆయన అథారిటీతో అన్నీ కంట్రోల్ చేశారు. ట్రస్టీలు లేదా నామినీ డైరెక్టర్లు నిర్ణయాలను చాలెంజ్ చేయలేదు. కానీ రతన్ మరణం తర్వాత మాత్రం ఇలా టాటా గ్రూప్ భగభగ మండిపోతోంది. రతన్ టాటా సరైన సక్సెషన్ ప్లాన్ చెప్పకపోవడమే ఇప్పటి పరిస్థితికి నిదర్శనం. టాటా సన్స్ NBFC 2025 సెప్టెంబర్ 30కల్లా లిస్ట్ కావాలి, కానీ మిస్ అయింది. ఇది లిక్విడిటీ కంట్రోల్ అంశాలకు కారణమైంది.
TCS, టాటా మోటర్స్, టాటా స్టీల్ షేర్లు డౌన్
సో ఇప్పుడు ఈ సంక్షోభాన్ని ఎవరు నివారించాలి? నోయెల్ టాటా అనుభవం ఉన్న వ్యక్తే. కానీ రతన్ టాటా అంతటి ఛరిష్మా లేదు. మరోవైపు టాటా సన్స్ చైర్మన్ N చంద్రశేఖరన్ మూడో టర్మ్ కోసం ఒత్తిడి పెంచుతున్నారు. నోయెల్ మాటలను లైట్ తీసుకుంటున్నారు. ఈ గొడవల వల్ల TCS, టాటా మోటార్స్, టాటా స్టీల్ షేర్లు 5-10% డౌన్ అయ్యాయి. లిస్టింగ్ ఆలస్యంతో ఇన్వెస్టర్ నమ్మకం తగ్గింది. వీళ్లంతా కలిసి ఇన్వెస్టర్లు… టాటా షేర్లు కొనాలా లేక వెయిట్ చేయాలా? అన్న పరిస్థితికి తీసుకొస్తున్నారు.
Also Read: రాజకీయాలకు దూరంగా జగ్గారెడ్డి.. అసలు ఏమైంది..!
ఇంత పెద్ద కంపెనీ, ఆర్థిక వ్యవస్థకు కీలకమైన టాటా గ్రూప్ లో గొడవలు ముదిరితే మొదటికే నష్టం అనుకుంది కేంద్రం. అందుకే రంగంలోకి దిగింది. అక్టోబర్ 7న, నోయెల్ టాటా, N చంద్రశేఖరన్, వేణు శ్రీనివాసన్, డారియస్ ఖంబాటా ఈ రెండు వేర్వేరు గ్రూపులు కలిసి అమిత్ షా ఇంట్లో సమావేశమయ్యారు. ఇందులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రులు ఓ మాటన్నారు. ప్రభుత్వం మౌనంగా ప్రేక్షక పాత్ర వహించదని సూచించారు. ఎందుకంటే టాటా గ్రూప్ ఎకానమీకి ముఖ్యం కాబట్టి. అలాగే టాటా చారిటబుల్ ట్రస్టులతో పేదలకు చాలా కార్యక్రమాలు నడుస్తున్నాయి కాబట్టి. సమావేశం 45 నిమిషాలు జరిగింది. స్టేటస్ కో మెయింటేన్ చేయండి అని సిగ్నల్ ఇచ్చి పంపించారంటున్నారు. సో ఇప్పుడు లిస్టింగ్, షాపూర్జీ పల్లోంజీ కోరుతున్న 100 కోట్ల లిక్విడిటీ, అలాగే ట్రస్టీ డివిజన్లపై చర్చ అక్టోబర్ 10న జరగబోయే బోర్డు మీటింగ్ కీలకం కాబోతున్నాయి. సో నోయెల్ టాటా ఈ క్రైసిస్‌ను పరిష్కరిస్తే టాటా గ్రూప్ మరింత బలపడుతుంది. లేకపోతే చీలిక రిస్క్ ఉంది. RBI లిస్టింగ్, టాటా క్యాపిటల్ IPO, నెక్స్ట్ జెనెరేషన్ ఎంట్రీ ఇవన్నీ టాటా గ్రూప్ లో రాబోయే రోజుల్లో బిగ్ ట్విస్ట్‌లుగా కనిపిస్తున్నాయి.
Story By Vidya Sagar, Bigtv