BigTV English

AI assistant: AI యుగం వచ్చినా.. అమ్మాయిలపై వేధింపులు ఆగవా..

AI assistant: AI యుగం వచ్చినా.. అమ్మాయిలపై వేధింపులు ఆగవా..

AI assistant: AI జమానా వచ్చినా సరే మన సొసైటీలో పరిస్థితులు మాత్రం మారట్లేదు. బాలికలు, యువతులు, మహిళల చుట్టూ రాక్షసులే తిరుగుతున్నారు. వేధిస్తున్నారు. వెంటపడుతున్నారు. ప్రేమించాలంటున్నారు. లైంగికంగా ఇబ్బంది పెడుతున్నారు. ఇలాంటి ఘటనలు రోజూ జరుగుతున్నాయి. కొందరు ధైర్యంగా ఎదురుగుతున్నారు. ఇంకొందరు మౌనంగా కుమిలిపోతూ తనువే చాలిస్తున్నారు.


చుట్టూ రాక్షసులే ఉంటే.. ఆడపిల్లలు ముందడుగు వేసేదెప్పుడు? మౌనంగా భరిస్తూ వెళ్తే సమాజం ఇంకా భయపెడుతూనే ఉంటుంది. అపరకాళీలా ఎదురుతిరిగితేనే దారికొస్తుంది సమాజం. ఈ టాపిక్ ఎందుకంటే.. మౌలిక అనే యువతి ఘటన రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. ఈమె ఉండేది లాలాగూడ. తార్నాక రైల్వే డిగ్రీ కాలేజ్ సెకండియర్ చదువుతోంది. రిటైర్డ్ రైల్వే ఉద్యోగి కుమార్తె ఈమె. ఇంతలోనే మౌలిక జీవితంలో విలన్ ఎంటరయ్యాడు. యాక్టివ్ గా కనిపించడమే ఈమె చేసిన నేరమైంది. నలుగురితో కలివిడిగా మాట్లాడడమే శాపమైంది. మాణికేశ్వర్‌ నగర్‌కు చెందిన అంబాజీ అనే యువకుడు కొన్ని నెలల క్రితం మౌలిక చదివే కాలేజీలోనే వాలీబాల్‌ కోచ్‌గా జాయిన్‌ అయ్యాడు. కొద్ది రోజులుగా అతడు మౌలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడంంటున్నారు. దీంతో మనస్తాపానికి లోనైన మౌలిక బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూలేని టైంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు లాలాగూడ పోలీసులు.

వేధిస్తుంటే మౌనంగా భరించడం ఎందుకు?
మౌలిక ఘటన ఈ తరం అమ్మాయిలకు చాలా పాఠాలు నేర్పుతోంది. 19 ఏళ్లు, డిగ్రీ సెకండియర్. వేధిస్తుంటే మౌనంగా భరించడం ఎందుకు? ఒక్కరుగా కుమిలిపోవడం ఎందుకు? లోలోపల నలిగిపోవడం ఎందుకు? మనసు కష్టపెట్టుకోవడం ఎందుకు? ఆత్మహత్య చేసుకునే ధైర్యంలో ఒక శాతం పాజిటివ్ గా ఆలోచించినా మౌలిక ఇప్పుడు మన మధ్య బతికి ఉండేది. వేధించిన వ్యక్తికి ఏది జరగాలో అది జరిగి ఉండేది. కానీ అలా జరగలేదు. విధి మౌలిక జీవితాన్నే బలి తీసుకుంది. ఎందుకోగానీ ఆమెకు ఏదీ ధైర్యాన్ని ఇవ్వలేకపోయింది. జీవితమే ఇప్పుడు బలైపోయింది.


సమస్యలేవో ఉన్నాయని సైడ్‌గా ఉంటే సరిపోతుందా.. మౌనంగా ఉన్నంతకాలం ఇలాంటి రాక్షసులు రెచ్చిపోతూనే ఉంటారు. ఇలాంటి వేధింపులు, కీచకులతో బలవుతున్న అమ్మాయిలే. ఇదీ మన సభ్య సమాజం అని చెప్పుకోలేని పరిస్థితి. గజానికో గాంధారి పుత్రుడు ఉన్నప్పుడు ఇక సభ్యత ఎక్కడ ఉంటుంది? ఇలా అన్యాయంగా అమ్మాయిలను వేధించే వాళ్లకు భయంకరమైన శిక్షలు ఉండాలి.. బెయిల్ కూడా రాకూడదు.. అప్పుడే వారికి సొసైటీలో రక్షణ ఉంటుంది. అడుగు బయట పెట్టగలుగుతారు. లేకపోతే సమస్యలు ఇలాగే ఉంటాయి.

వేధింపులకు బలైనా నాగాంజలి
ఆర్నెళ్ల క్రితం మౌలిక మాదిరే రాజమహేంద్రవరంలో ఓ ఘటన జరిగింది. మరో యువతి కథ.. నాగాంజలి రాజమహేంద్రవరం కిమ్స్ బొల్లినేని హాస్పిటల్ లో ఫార్మాలజిస్ట్ గా పని చేసేది. అదే హాస్పిటల్ లో పని చేసే ఏజీఎం పరిచయం పెంచుకుని, ఆమె వెనకే తిరుగుతూ.. ప్రేమించానని నమ్మించి, శారీరకంగా, లైంగికంగా వేధించేవాడన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే.. నాగాంజలిని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడన్న బాధతో.. మార్చి 23న సూసైడ్ నోట్ రాసి ఇంజక్షన్ తీసుకుని సూసైడ్ చేసుకుంది. నాడు అంజలి డైరీలో సూసైడ్ నోట్ దొరికింది. ఆ లేఖలో ఆమెకు ఎదురైన వేధింపులు బయట పడ్డాయి. దీంతో అప్పట్లో మహిళా సంఘాలు ఆందోళనలు తీవ్రం చేశాయి.

ఆమె రాసిన సూసైడ్ లెటర్ అందరినీ కన్నీళ్లు పెట్టించింది. మిగితా అమ్మాయిలనూ అలర్ట్ చేసింది. పని చేసే ప్రదేశాల్లో కాలేజీల్లో, స్కూళ్లల్లో ఇంటి దగ్గర, ఇంటి బయట, పబ్లిక్ ప్లేసుల్లో ఎలా ఉండాలో.. ఎంతటి అప్రమత్తత అవసరమో నాగాంజలి ఘటన నిరూపించింది. జీవిత‌మంతా నాశ‌నం చేసుకుని ఏడ‌వ‌డానికి కూడా త‌న‌కు ఓపిక లేద‌ని సూసైడ్ లెటర్ లో రాసుకొచ్చింది. ఓ వ్యక్తి చేతిలో మోసపోయి ఇంటికి వెళ్లే ధైర్యం లేద‌ని, జీవితంపై చాలా క‌ల‌లు క‌న్నాన‌ని, కానీ వాటిని చిదిమేశాడ‌ని ఆవేద‌న‌ను వ్యక్తం చేసింది. ఒక ఫంక్షన్‌కు చీర కట్టుకుని వెళ్లడ‌మే తాను చేసిన పాప‌మ‌ని, ఒక మోస‌గాడి క‌న్ను తనపై ప‌డింద‌ని రాసుకొచ్చింది. తాను చ‌దువుకున్న చ‌దువు కూడా తాను చ‌నిపోవ‌డానికే అన్న సంగ‌తి గ్రహించ‌లేక‌పోయానన్నది. ఆడ‌పిల్లల‌కు ర‌క్షణ లేదని, త‌న‌ను ఎంత కొట్టినా, తిట్టినా ఓపిక‌గా భ‌రించాన‌ని త‌న‌కు ఎదురైన ఘ‌ట‌న‌ల‌ను వివ‌రించింది. ఇక త‌ట్టుకునే శ‌క్తి, ఓపిక త‌న‌కు లేద‌ని, అన్ని రకాల వేధింపులతో ఇక తనువు చాలిస్తున్నానన్నది. అమ్మ, నాన్న క్షమించండి, వేరే దారి లేకే చ‌నిపోతున్నానంటూ చివరి మాటగా ముగించింది. ఎంతటి ఘోరమిది. ఎంతటి విషాదమిది?

వేధింపులు ఎదురైతే.. ధీటుగా ఎదుర్కొనే శక్తి ఉండి ఉంటే ఇప్పుడు మౌలిక, నాగాంజలి బతికి ఉండేవాళ్లు. తమకు జరిగిన అన్యాయం, హరాస్ మెంట్ పై పోరాటం చేసేవాళ్లు. వేదనతో కుమిలిపోయారు. జీవితాన్ని ముగించారు. తమ వాళ్ల సపోర్ట్ తీసుకుని ఉన్నా బతికి ఉండేవాళ్లు. వీధి రౌడీ, సహ విద్యార్థి, దూరబ్బందువు, అందాకా ఎందుకు ఆఖరికి దగ్గరివారైనా, మరొకరైనా… వావి వరుసల్లేవ్, బంధాల్లేవ్. అలాంటి ఘోరాలు జరుగుతున్న సమాజమిది. ఇక సోషల్ మీడియా ముసుగులో జరుగుతున్న ఘోరాలకు అంతే లేదు. చివరికి జీవితాలే బలవుతున్నాయి. ఇందులో సున్నిత మనస్కులు చిక్కుకుని విలవిలలాడుతున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. యువతులను అలర్ట్ చేయడంలో తల్లిదండ్రులు, సమాజం కూడా కీలకమే.

అమ్మాయి స్వేచ్ఛగా పని చేసే వాతావరణం ఎక్కడ?
మహిళలకు మంచి రోజులు వచ్చాయి. వస్తున్నాయి, వచ్చేశాయి అని ఎవరైనా అంటే ఒకడుగు ముందుకు.. ఆరడుగులు వెనక్కు అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి. అటు తిరిగి ఇటు తిరిగి సమస్యంతా వేధింపుల చుట్టూనే తిరుగుతోంది. ఒక అమ్మాయి స్వేచ్ఛగా పని చేసుకునే వాతావరణం ఎక్కడా ఉండడం లేదు. స్కూలైనా, కాలేజీ అయినా, పని చేసే ఆఫీసైనా.. బస్సైనా, రోడ్డైనా, ఇంటా బయట ఏదో రకంగా వేధింపులు. కొందరే ఎదురు తిరుగుతున్నారు.. ఇంకొందరు మౌనంగా భరిస్తున్నారు.. మరికొందరు బలవుతున్నారు.

ఎన్ని రకాలుగా వేధించాలో అన్ని రకాలుగా నరకం..
అన్ని రంగాల్లో ఎదిగే స్కోప్, శక్తి సామర్థ్యాలు మహిళలకు ఉన్నాయి. పనిలో తమ సత్తా చాటుకుంటున్నారు. రాజకీయాల్లోనూ తమదైన ముద్ర వేస్తున్నారు. కానీ గజానికో గాంధారి పుత్రుడున్న దేశం మనది. మహిళలను ఎన్ని రకాలుగా వేధించాలో అన్ని రకాలుగా నరకం చూపిస్తున్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక.. చెబితే ఏమవుతుందోనన్న భయాలు.. ఇంట్లో వారిని ఇబ్బంది పెట్టడం ఎందుకు ఇలాంటి ఆలోచనలతో లోలోపలే కుమిలిపోతూ మౌలిక మాదిరి సూసైడ్స్ చేసుకుంటున్న వారెందరో ఉంటున్నారు.

2.1 కోట్ల మంది మహిళలు ఉద్యోగాలకు దూరం..
పని చేసే చోట వేధింపులతో 2017-2022 మధ్య దాదాపు 2.1 కోట్ల మంది మహిళలు శాశ్వతంగా ఉద్యోగాలను వదిలిపెట్టారు. మరో ఉద్యోగం వెతుక్కునే సాహసం చేసే పరిస్థితి కూడా లేదు. అందరూ నిర్భయంగా సమస్యలను ఎదుర్కొనే పరిస్థితి ఉండదు. కొందరే చాలా ధైర్యంగా తమ సమస్యలపై పోరాడుతారు. ఇంకొందరు అడుగు పెట్టాలంటేనే భయపడే పరిస్థితులు ఉన్నాయి. ఇంకోవైపు ప్రస్తుత సమాజంలో అమ్మాయిలు మోసపోతున్న ఘటనలు కామన్ అయ్యాయి. ఇంకొన్ని సందర్భాల్లో బ్లాక్ మెయిల్స్ తో మనోవేదనకు గురవుతున్నారు.

సమస్యల్ని ఇంట్లో ధైర్యంగా చెప్పాల్సిందే..
తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో పిల్లల్ని చదివిస్తున్నారు. లైఫ్ బాగుండాలని కోరుకుంటారు. అలాంటిది ఎవరైనా వేధిస్తున్నారంటే ఊరుకుంటారా? అందుకే ఎవరైనా సరే సమస్యల్ని ఇంట్లో ధైర్యంగా చెప్పుకోవాలి. ప్రతి సమస్యకు ఏదో ఒక పరిష్కారం కచ్చితంగా ఉండి తీరుతుంది. ఆ విషయాన్ని గ్రహించాలి. స్నేహాల ముసుగులో నేటి సమాజంలో చాలా ఆకృత్యాలు అమ్మాయిల జీవితాలను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. నమ్మితే నట్టేట ముంచే ఘటనలు పెరుగుతున్నాయి. సమాజంలో పైకి మనకు కనిపిస్తున్నవి కొన్నే.

Also Read: మరో బాంబు పేల్చిన ట్రంప్.. చైనాపై 100 శాతం సుంకాల ప్రకటన

ఇక సోషల్ మీడియా పరిచయాలను నమ్మకపోవడమే మంచిది. చాటింగ్ లతో మొదలైన స్నేహాలు బ్లాక్ మెయిల్ చేయడం దాకా వెళ్తున్నాయి. చివరకు స్నాప్ చాట్ వంటి యాప్స్ తో లొకేషన్ తెలుసుకుని మరీ అఘాయిత్యాలు చేస్తున్న కేసులు ఇటీవలి కాలంలో చాలా వెలుగుచూశాయి. ఫేస్ బుక్, ఇన్ స్టా పరిచయాలు యువతుల మెడకు చుట్టుకుంటున్నాయి. నమ్మకంగా ఉంటూనే నట్టేట ముంచే వ్యక్తులు ఈ సమాజంలోనే మన మధ్యే తిరుగుతున్నారు. తల్లిదండ్రులు కూడా ఇలాంటి వాటిపై అమ్మాయిల్లో అవగాహన పెంచాలి. పక్కింటి అంకులైనా, ఎదురింటి కుర్రాడైనా, ఆఫీసుల్లో సహ ఉద్యోగి అయినా.. ఎవరినీ నమ్మే పరిస్థితి లేదు. ఎవరినీ నమ్మి ఇల్లు దాటి బయటకు పంపే పరిస్థితి అసలే కనిపించడం లేదు. సమాజంలో ఎవరు ఎలా ఉంటారో తెలియకపోవడం, తెలిసిన వారే కదా అని నమ్మడం ఇలాంటి వాటితో ఘోరాలు జరిగిపోతున్నాయి.

వేధిస్తే తిరగబడాల్సిందే.. ఎదురు నిలవాల్సిందే..
ఇతరులను గుడ్డిగా నమ్మటం ద్వారా ఏర్పడే నష్టాలను చెప్పేలా పేరెంట్స్ చొరవ తీసుకోవాలి. వేధించే వారికి చెక్ పెట్టేందుకు సిద్ధంగా ఉండాలి. అంతే తప్ప సూసైడ్ చేసుకోనక్కర్లేదు. ఎదురించి నిలబడాలి. ఇంట్లో చెప్పడానికి ఏమాత్రం భయపడొద్దు. ధైర్యంగా చెప్పేయాలి. ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది కదా. భవిష్యత్ పై ఎంతో ఆశలతో చదువుకుంటూ అన్ని రంగాల్లో రాణిస్తున్న అమ్మాయిలు.. ఇంట్లో తల్లిదండ్రులకు శోకం మిగిల్చవద్దు.

Story By Vidya sagar, Bigtv

Related News

BJP: బీజేపీపై కొండ సెటైర్లు.. ఫ్లవర్ కాదు ఫైర్

Telangana Politics: రాజకీయాలకు దూరంగా జగ్గారెడ్డి.. అసలు ఏమైంది..!

AP Fake Liquor Case: ఏపీ కల్తీ మద్యం స్కామ్.. వెనుకుంది వాళ్లేనా..

AP Politics: అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరుపై చంద్రబాబు వార్నింగ్..

AP Politics: జగన్ నర్సీపట్నం టూర్.. అసలు ప్లాన్ ఇదేనా..?

Huzurabad Politics: నా సెగ్మెంట్‌లో నీకేం పని.. బండిపై రగిలిపోతున్న ఈటల

Rajnath Singh: తోక జాడిస్తే పాక్‌ని లేపేస్తాం.. రాజ్ నాథ్ మాస్ వార్నింగ్

Big Stories

×