
Prakash Singh Badal(National News Update) :11సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 5 సార్లు సీఎం పీఠంపై కూర్చుకున్నారు. ఆయనే పంజాబ్ రాజకీయ దిగ్గజం, శిరోమణి ఆకాలీదళ్ అగ్రనేత ప్రకాశ్ సింగ్ బాదల్. 95 ఏళ్ల ఆయన కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ వారం రోజుల క్రితమే మొహాలీలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చేరారు. అక్కడే చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి 8 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ప్రకటించారు.
బుధవారం మధ్యాహ్నం వరకు పార్టీ ప్రధాన కార్యాలయంలో బాదల్ భౌతికకాయాన్ని కార్యకర్తల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తర్వాత పార్ధీవ దేహాన్ని బాదల్ స్వగ్రామానికి తరలిస్తారు. గురువారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
బాదల్ కుమారుడు సుఖ్‌బీర్ సింగ్ ఆయన రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. సుఖ్‌బీర్ భార్య హర్‌సిమ్రత్ కౌర్ బఠిండా ఎంపీగా ఉన్నారు. బాదల్‌కు కుమార్తె పర్నీత్ కౌర్ కూడా ఉన్నారు. పర్నీత్ మాజీ మంత్రి ఆదేశ్ ప్రతాప్‌సింగ్ కైరాన్ సతీమణి. బాదల్ మృతితో కేంద్ర ప్రభుత్వం రెండురోజులు సంతాప దినాలు ప్రకటించింది.
ప్రకాశ్‌సింగ్ బాదల్ మృతిపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ప్రజలకు విశేష సేవలందించిన గొప్ప రాజనీతిజ్ఞుడని మోదీ ప్రశంసించారు. బాదల్‌తో కలిసి ఉన్న ఫొటోలను ప్రధాని తన ట్విటర్‌లో ఖాతాలో షేర్ చేశారు. బాదల్ మృతిపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌సహా పలు రాష్ట్రాల సీఎంలు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంతాపం తెలిపారు.