
Rain in Hyderabad(Telangana Latest News) : హైదరాబాద్‌ను భారీ వర్షం ముంచెత్తింది. మంగళవారం నగరంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. 2 గంటల వ్యవధిలోనే దాదాపు 8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రామచంద్రాపురంలో అత్యధికంగా 7.98 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. గచ్చిబౌలిలో 7.75 సెం.మీ., గాజులరామారంలో 6.5 సెం.మీ., కుత్బుల్లాపూర్ లో 5.55 సెం.మీల వర్షం కురిసింది. మండు వేసవిలో ఇంత భారీ వర్షం కురవడం గత 8 ఏళ్లలో ఇదే తొలిసారి. 2015లో ఏప్రిల్ 12న అత్యధికంగా 6.1 సెం.మీ.ల వర్షం కురిసింది. గ్రేటర్ హైదరాబాద్ లో ఇంకా అనేక ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది.
వానతోపాటు ఈదురుగాలులు నగర వాసులను వణికించాయి. 30 నుంచి 40 కి.మీ.ల వేగంతో గాలుల వీచడంతో పలుచోట్ల చెట్ల కొమ్మలు, హోర్డింగులు విరిగి విద్యుత్తు తీగలపై పడ్డాయి. దీంతో జీహెచ్‌ఎంసీ పరిధిలో విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. మంగళవారం రాత్రి అనేక ప్రాంతాలు అంధకారంలో ఉన్నాయి. రాత్రి 7 గంటల నుంచి 8.30 గంటల మధ్య మెట్రోజోన్‌లో 89 ఫీడర్లు ట్రిప్ అయ్యాయి. క్షేత్రస్థాయిలో పనిచేసే ఆర్టిజన్లు సమ్మెలో ఉండటంతో విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో సమస్యలు ఏర్పడ్డాయి.
భాగ్యనగరంలోని ప్రధాన రహదారులపైకి భారీగా నీరు చేరింది. అబిడ్స్, లక్డీకాపూల్, అమీర్‌పేట, బంజారాహిల్స్ , కూకట్‌పల్లి, మియాపూర్ మార్గాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రహ్మత్‌నగర్ డివిజన్ ఎస్పీఆర్‌హిల్స్ ఓంనగర్‌లో గోడ కూలడంతో విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 8 నెలల చిన్నారి జీవనిక మృత్యువాత పడింది. నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి పిల్లర్.. రేకుల ఇంటిపై పడడంతో ఈ దుర్ఘటన జరిగింది.
ట్యాంక్ బండ్ వద్ద పెను ప్రమాదం తప్పింది. మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో 40 మంది టూరిస్టులతో భాగమతి బోటు బయల్దేరింది. బోటు బుద్ధుని విగ్రహం వద్దకు చేరుకునే సమయంలో భారీగా ఈదురు గాలుల వీచాయి. దీంతో బోటు కొట్టుకుపోయింది. ప్రమాదంపై టూరిజం సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. స్పీడ్ బోట్ల ద్వారా ప్రమాదానికి గురైన బోట్‌ను బోట్స్ క్లబ్ వద్ద ఒడ్డుకు చేర్చారు. దీంతో పర్యాటకులు ఊపిరి పీల్చుకున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో కుండపోత వర్షం కురిసింది. కొన్ని చోట్ల వడగళ్ల వాన పడింది. అకాల వర్షాలతో పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. ఇంకా అనేక ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
Byri Naresh : ఎవరీ బైరి నరేష్?.. తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు హాట్ టాపిక్ అయ్యారు..?