Bihar Elections: బిహార్‌లో రెండో దశ ఎన్నికల పోలింగ్ మొదలైంది. 243 అసెంబ్లీ స్థానాలకు గాను ఆఖరి విడతలో 122 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. 3.70 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుంది. ఈ విడత ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో విభిన్నమైన సామాజిక వర్గాల ప్రజలు, కుల సమీకరణాలు, ముస్లింలు ఎక్కువగా ఉండటంతో అధికార, ప్రతిపక్షాలకు పోలింగ్ కీలకంగా మారింది. నితీశ్ మంత్రివర్గంలోని సగం మంది మంత్రులు ఈ విడత ఎన్నికల బరిలో ఉన్నారు.
ఈనెల 14న ఫలితాలు వెలువడనున్నాయి. ఒకవైపు నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ, మరోవైపు తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ఇండియా కూటమి మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తోంది. ఈ ఫలితాలు కేవలం బీహార్‌కే కాదు, దేశ స్థాయిలో ఇండియా కూటమి భవిష్యత్తును కూడా నిర్ణయించబోతున్నాయి. ఎన్నికల సంఘం, భద్రతా బలగాలు పూర్తిస్థాయి నిఘాను ఏర్పాటు చేశాయి. పోలింగ్‌ను అత్యంత పారదర్శకంగా, ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా నిర్వహించడానికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
Also Read: దేశవ్యాప్తంగా పెరుగుతున్న చలి తీవ్రత.. చీకటైతే చాలు.. చుక్కలు చూపిస్తున్న చలి
ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లోని అత్యధిక పోలింగ్ కేంద్రాలలో వెబ్‌కాస్టింగ్ ద్వారా ప్రత్యక్ష పర్యవేక్షిస్తున్నారు. ఈసారి ఎంఐఎం పోటీ చేయనున్న స్థానాలు ఎక్కువగా ఉన్నాయి. సీమాంచల్ జిల్లాలోనే కిషన్‌గంజ్, పూర్ణియా, కటిహార్, అరారియా వంటి నియోజకవర్గాల్లో ఎంఐఎం బరిలోకి దిగుతోంది. మొత్తంగా 25 స్థానాల్లో పోటీ చేస్తుంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎంఐఎం సీమాంచల్ ప్రాంతంలోనే 5 స్థానాలను గెలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. మరీ ఈసారి కూడా ఆ ప్రాంతంలో పట్టు సాధిస్తుందా అనేదానిపై ఆసక్తి నెలకొంది.