Cold Weather: ఆరింటికే చీకటి పడుతుంది.. ఆ కాసేపటికే వణుకు ప్రారంభమవుతోంది. ఇంతకీ ఈ చలి పులి పంజా ఈ స్థాయిలో విసరడానికి కారనమేంటి? ఇక ముందు ముందు పరిస్థితి ఎలా ఉండబోతుంది? వాతావరణశాఖ అధికారులు చెబుతున్నదేంటి? మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?
చలిగాలుల ఎంట్రీ.. చీకటైతే చాలు.. చుక్కలు చూపిస్తున్న చలి
మొన్నటి వరకు అయితే భానుడి భగభగలు.. లేదంటే వరణుడి ఉరుములతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు చుక్కలు కనిపించాయి. ఇప్పుడు నా వంతు అంటూ చలిగాలులు ఎంట్రీ ఇచ్చాయి. ఇప్పుడు ప్రజలను ఈ గాలులు వణికిస్తున్నాయి. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. జస్ట్ రెండు, మూడు రోజుల వ్యవధిలోనే ఉష్ణోగ్రతలు.. 10 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు పడిపోయాయి. అయితే ఇది కాదు.. అసలు కథ ముందుంది అంటోంది వాతావరణశాఖ. రాబోయే పది రోజుల్లో చలి తీవ్రత అధికంగా ఉంటుందని అధికారులు తెలిపారు.
రాబోయే 10 రోజుల్లో అధికంగా చలి తీవ్రత.. సింగిల్ డిజిట్‌కు పడిపోయే అవకాశం
రాబోయే పది రోజుల్లో చాలా జిల్లాల్లో రాత్రి పూట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు అధికారులు. ముఖ్యంగా ఆసిఫాబాద్, భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా 30 డిగ్రీల వరకే నమోదవుతాయన్నారు. చలి తీవ్రత పెరుగుతుండటంతో పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.
చాలా రాష్ట్రాల్లో కోల్డ్ వేవ్ పరిస్థితులు.. రాత్రి, తెల్లవారుజామున దట్టమైన పొగమంచు
ఉత్తర భారతదేశంలో ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ఇప్పటికే మంచు వర్షం ప్రారంభమైంది. యూపీ, ఢిల్లీ, బీహార్, పంజాబ్, మధ్యప్రదేశ్‌లలో కూడా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. రాజస్థాన్‌లో కూడా ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో కోల్డ్ వేవ్ పరిస్థితులు నెలకొన్నాయని అధికారులు తెలిపారు. చాలా రాష్ట్రాల్లో తెల్లవారుజామున పొగమంచు కురుస్తోంది.
Also Read: జూబ్లీహిల్స్ బైపోల్.. ప్రారంభం అయిన పోలింగ్..
ఈ సారి రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం
దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటికే కాలుష్యంతో సతమతమవుతున్న ప్రజలకు.. ఇప్పుడు చలి కూడా తోడైంది. రాత్రి, తెల్లవారుజామున దట్టమైన పొగమంచు వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. ఇక హిమాచల్, ఉత్తరాఖండ్‌లోని ఎత్తైన ప్రాంతాల్లో ఇప్పటికే మంచు కురవడం ప్రారంభమైంది. ఇది ఊహించిన దానికంటే చాలా ముందు సమయం అంటున్నారు అధికారులు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. ఈ సారి రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం కనిపిస్తోందని చెబుతున్నారు.